cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగాస్టార్ చిరంజీవికి బాలు చీవాట్లు

మెగాస్టార్ చిరంజీవికి బాలు చీవాట్లు

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాలు భౌతికంగా మ‌న మ‌ధ్య నుంచి అనంత లోకాల‌కు ఎగిరిపోయినా .... ఆయ‌న మిగిల్చిన జ్ఞాప‌కాలు మాత్రం మ‌న‌తోనే, మ‌న మ‌ధ్యే ఉన్నాయి. బాలు జ్ఞాప‌కాల‌కు, పాట‌ల‌కు మ‌ర‌ణం లేదు. ఈ సంద‌ర్భంలో బాలుతో ఉన్న అనుబంధాల్ని నెమ‌రు వేసుకునే క్ర‌మంలో ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ స్వీయానుభ‌వాల‌ను  పంచుకుంటున్నారు. 

ఈ నేప‌థ్యంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బాలుతో త‌న‌కున్న ఆత్మీయానుబంధాన్ని ఆవిష్క‌రించే ఓ  వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఈ వీడియోలో చిరును బాలు చీవాట్లు పెట్టిన సంగ‌తులు కూడా ఉన్నాయి. ఆ విశేషాలేంటో చిరంజీవి మాట‌ల్లోనే తెలుసుకుందాం.

"ఎస్పీ బాలు ఇక లేర‌నే చేదు నిజాన్నిజీర్ణించుకోలేక పోతున్నాను. బాలు త్వ‌ర‌గా కోలుకుని వ‌స్తార‌ని, ఆయ‌న‌ వైభ‌వం మ‌ళ్లీ చూస్తామ‌ని ఆశ‌గా ఎదురు చూసిన నాకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఎంత‌లా అంటే నా సొంత కుటుంబ స‌భ్యుడిని కోల్పోయిన బాధ‌.  సొంత అన్న‌ను పోగొట్టుకున్న ఆవేద‌న‌. మా మ‌ధ్య కేవ‌లం సినిమా ప‌రంగానే కాకుండా కుటుంబ ప‌రంగా కూడా అనుబంధం ఉంది. మ‌ద్రాస్‌లో ప‌క్క‌ప‌క్క వీధుల్లోనే ఉండేవాళ్లం. అప్పుడ‌ప్పుడు క‌లుసుకునే వాళ్లం. అన్న‌య్యా అని పిలిచేవాన్ని. ఆయ‌న న‌న్ను త‌మ్ముడూ అని ప్రేమ‌గా పిలిచేవారు.

కెరీర్ ప‌రంగా నా స‌క్సెస్‌కు ఆయ‌నే కార‌ణం. నాకింత‌ ప్ర‌జాద‌ర‌ణ వెనుక బాలు పాడిన పాట‌లే కీల‌క పాత్ర పోషించాయి.  మొద‌ట్లో ఆయ‌న్ని నువ్వు అని సంబోధించే వాన్ని.  ఆ త‌ర్వాత ఆయ‌న గొప్ప‌త‌నం తెలుసుకుని మీరు అని సంబోధించే వాన్ని. దీంతో ఆయ‌న చిన్న‌బుచ్చుకునే వారు. ఏమ‌య్యా ఏమైంది నీకు ... మీరు అంటే దూరం పెరుగుతుంద‌ని, నువ్వు అనే పిల‌వాల‌ని కోరే వారు. అంత గొప్ప వ్య‌క్తి ఆయ‌న.

బాలు అన్న‌య్య లేని లోటు ఎవ‌రూ పూడ్చ‌లేరు. ఆయ‌న లేని లోటును భ‌ర్తీ చేసేందుకు మ‌ళ్లీ ఆయ‌నే జ‌న్మించాలి" ...ఇలా భావోద్వేగంతో కూడిన స్వ‌రంతో బాలు గురించి చిరు చెప్పుకుపోయారు. చివ‌ర్లో త‌న‌ను సున్నితంగా చీవాట్లు పెట్టిన విష‌యాన్ని కూడా మెగాస్టార్ బ‌య‌ట పెట్టారు.

"ఏమ‌య్యా నువ్వు క‌మ‌ర్షియల్ చ‌ట్రంలో ప‌డిపోయి నీలో ఉన్న న‌టుడిని దూరం చేసుకుంటున్నావ్‌. నువ్వు మంచి న‌టుడివి. నువ్వు న‌ట‌న‌కు ప్రాధాన్యం ఇచ్చే క్యారెక్ట‌ర్స్ చేయాలి" అని శ్రేయోభిలాషిగా హెచ్చ‌రించిన‌, మంద‌లించిన విష‌యాన్ని చెప్పుకొచ్చారు. అయితే "ఏం చేసేది అన్న‌య్యా , ప్రేక్ష‌కులు ఏం కోరుకుంటే అదే ఇవ్వాలి, మ‌నం చేయాలి క‌దా" అని తాను స‌మాధానం ఇచ్చిన‌ట్టు చిరు తెలిపారు. "అలా కాద‌య్యా" అని బాలు అన్న‌ట్టు చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

కానీ ఆ త‌ర్వాత రోజుల్లో తాను  రుద్రవీణ‌, ఆప‌ద్భాంద‌వుడు, స్వ‌యంకృషి , ఆరాధ‌న లాంటి సినిమాలు తీశానంటే, వాటి వెనుకాల బాలు ఇచ్చిన స‌ల‌హాలే ప్రేర‌ణై ఉంటాయ‌ని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. క‌మ‌ర్షియ‌ల్ చ‌ట్రంలో కొట్టుకుపోతూ ... క‌ళామ‌త‌ల్లికి అన్యాయం చేస్తున్నారనే ఆవేద‌న‌, ఆక్రోశం బాలు మాటల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. క‌ళ‌ను ఎంత‌గా ఆరాధించేవారో ఆయ‌న ఆచ‌రించి చూపిన జీవిత‌మే నిద‌ర్శ‌నం. 

 


×