Advertisement

Advertisement


Home > Movies - Movie News

యువతరం కన్న కమ్మని కల బాలూ పాట!

యువతరం కన్న కమ్మని కల బాలూ పాట!

1970 కంటే కొంచెం ముందు తెలుగునాట ఉదయించిన యువతరానికో ప్రత్యేకత వుంది. అదివరకు పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన కాలేజీ చదువులు ఒక మోస్తరు టౌన్లకు కూడా అందుబాటులోకొచ్చాయి. దానివల్ల గ్రాడ్యుయేట్లు బాగా పెరిగి నిరుద్యోగులు ఎక్కువయ్యారు. అయినా భవిష్యత్తుపట్ల ఒక ఆశావహమైన దృక్పథం కాలేజీ చదువులు తీసుకొచ్చాయి. వీరికి భవిష్యత్తు ఒక అందమైన కల. దానివల్ల అది వరకు లేనంత సున్నితత్వం, లాలిత్యం ఆ యువతరానికబ్బింది. దాని ప్రభావం సినిమా పాటపైన ప్రసరించింది. 

తెలుగు సినిమా పాట అంటేనే లలిత గీతం. ఆ లాలిత్యం చాల్లేదు. పాట మరింత లలితంగా తయారయ్యేందుకు సిద్ధంగా వుంది. దానికి అవసరమైన గాత్రం దొరకడం అవసరమైంది.

అదే సమయంలో నెల్లూరులో పైలాపచ్చీసు కూడా లేని ఓ కుర్రాడుండేవాడు. అల్లరి చేస్తూ పాటలు పాడుకుంటూ తిరిగేవాడు. ఆ అల్లరి పాట పేరు బాలు.  నేను సేకరించిన సమాచారం ప్రకారం బాలు సర్వోదయ కాలేజీ స్టూడెంటు. బాలూ పాడుతుంటే కుర్రకారు అతని చుట్టూ మూగేవారు. కాలేజీ యాజమాన్యానికి అదో తలనొప్పి వ్యవహారంగా మారేదంటారు.

ఓ పాటల పోటీలో ఘంటసాలగారు ఈ కుర్రాడ్ని పట్టుకున్నారు. ఎస్పీ కోదండపాణికి బాలూతో పాడించమని రికమెండ్ చేసినందుకు ఘంటసాలకు బాలూ జీవితాంతం వరకూ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే వున్నాడు. రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ కింద పద్మనాభం తీసిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న 1967లో వచ్చింది. ఆ సినిమాలో 'ఏమి ఈ వింత మోహం' అనే పాట బాలూ పాడిన మొదటి పాట. ఈ పాటలో కోదండపాణి ముక్కుపచ్చలారని ఈ కుర్రాణ్ణి తీసుకెళ్ళి సింహాలకు ఎరగా వేశారేమో అనిపిస్తుంది. పల్లవిలోనే పి.సుశీల గాత్రంతో కోదండపాణి వేసిన సమ్మోహనాస్త్రానికి మరో కొత్త గొంతు పెగిలేది కూడా కాదు.

ఈ పాటలో సుశీలకు లీడ్ యిచ్చి వూరుకోలేదు కోదండపాణి, మరో ఇద్దరు హేమాహేమీల్ని సిద్ధంగా వుంచారు. ఒకరు పి.బి.శ్రీనివాస్. మరొకరు ఈలపాట రఘురామయ్య. వీరిలో పి.బి.శ్రీనివాస్ గాత్రం మలయమారుతం కాగా రఘురామయ్య గాత్రం చండామారుతం. అసాధారణమైన అంశం ఏమిటంటే ఈ ఇద్దరికీ ముందు బాలూకి లీడ్ యివ్వడం. ఈ కొత్త కుర్రాడి మీద ఎంతో నమ్మకం వుంచనిదే కోదండపాణి ఆ పని చేసి వుండరు. సుశీల చరణం అయిపోతూనే బాలూ ప్రారంభం అద్వితీయం.

ఘంటసాలని స్మరించుకొని పాట మొదలు పెట్టాడో యేమో, వయసుకు మించిన పక్వంతో లిరిక్‌గా కూడా చాలా కష్టమైన ఈ పాటని నదురూ బెదురూ లేకుండా పాడేశాడు.  ఆ తర్వాతి కాలంలో సుప్రసిద్ధమైన సుశీల-బాలూ యుగళగీతానికి ఈ పాటే నాంది. బాలూ చరణం ముగుస్తూనే పీబీ తన స్వరాన్ని మామూలు కంటే ఎక్కువ అదుపు చేసుకున్నట్టనిపిస్తుంది. 

అసలే పూతరేకులాంటి పీబీ స్వరం, పుప్పొడిరేకంత సున్నితమైపోయింది. ఆ తర్వాత రఘురామయ్య రెండు చరణాలు పాడాల్సి రావడంతో పాట ఉద్ధృతంగా ముగుస్తుంది. మామూలుగా ఆరోజుల్లో తెలుగు సినిమాపాట మూడున్నర నిమిషాల కంటే ఎక్కువుండేది కాదు. 'ఏమి ఈ వింత మోహం ' ఆరున్నర నిమిషాలు సాగుతుంది.

1970 వస్తూనే ఓ కొత్తరకం సినిమా వచ్చింది. న్యూవేవ్ సినిమా అన్నారు దాన్ని. నిరుద్యోగం వల్లనో, మోజుతోనో సినిమాల్లో చేరడానికి యువతీయువకులు ఎప్పుడూ లేనంత ఎక్కువగా వచ్చిపడసాగారు. భారీ ఖర్చుతో మరింత భారీ హీరోహీరోయిన్లతో సినిమా తీయలేని అర్భకులు తమ దగ్గరున్న సర్‌ప్లస్‌తో చిన్నపాటి సినిమాలు తీయడానికి సిద్ధమయ్యారు. 

మలయాళంలో మొదలైన ఈ న్యూవేవ్ సినిమా తెలుగు తెరమీది కొచ్చింది. ఏ-సర్టిఫికేట్ యిచ్చి వీటిని వదిలేవారు. వీటితో ప్రతి యేటా వచ్చే సినిమాల సంఖ్య రెండింతలైంది. లీలారాణి న్యూవేవ్ హీరోయిన్‌గా ప్రకంపనలు సృష్టించి ఆ వ్యవస్థకే బలయిపోయింది. అలాగే విజయశ్రీ. ఆ తర్వాత ఫటాఫట్ జయలక్ష్మి. ఆ పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. వీటి మంచిచెడ్డల సంగతి ఎలా వున్నా రోజురోజుకీ స్లమ్స్‌లోకి  దిగజారిపోతున్న దిక్కులేనంతమంది సినీ ఆర్టిస్టులకి అవి ఒక్కపూటైనా అన్నం పెట్టగలిగాయి.

ఈ న్యూవేవ్ సినిమాల కోసం కాలేజీ కుర్రకారు ఎగబడింది. అంతకు ఒకతరం ముందు వారికి పెద్దవాళ్ళు పిల్చుకెళ్తే తప్ప సినిమా చూసేంత స్వేచ్ఛ వుండేది కాదు. జేబులో డబ్బులాడేవీ కాదు. ఈ తరం వచ్చేసరికి కాలేజీ కుర్రవాళ్ళు సినిమాకు కొత్త మార్కెట్ తెచ్చిపెట్టారు. ఆ సందర్భంగా వచ్చిందే 'కన్నెవయసు ' సినిమా.

'కన్నెవయసు' టీనేజ్ లవ్ సినిమా. 1973లో వచ్చింది. రాజ్ కపూర్ 'బాబీ' కంటే కొన్ని నెలల ముందే ఈ సినిమా విడుదలైంది. ఆశ్చర్యం ఏమిటంటే న్యూవేవ్ వరవడిలో వచ్చిన ఈ సినిమాలో రోజారమణి మొదటిసారి హీరోయిన్‌గా చేయడం. ఛైల్డ్ ఆర్టిస్టుగా గొప్ప పేరున్న రోజారమణికది రాంగ్ ఛాయిస్ అని ఆ రోజుల్లో చాలామంది అనుకునేవారు. 'కన్నెవయసు ' సినిమా ఘన విజయానికి ఇద్దరే కారణం - ఒకరు రోజారమణి. మరొకరు బాలూ. ఆ తరం యువతీ యువకులకు రోజారమణి కలలో కనిపించడం, బాలూ పాట కలలో వినిపించడం మొదలైంది.

'కన్నెవయసు 'లో బాలూ పాడిన 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' అనే పాట యువతరం హృదయాల్లో అలా దూరి కూర్చుండి పోయింది. బాలూ తనను ప్రభావితం చేసిన గాయకుల్లో ఇద్దర్ని చాలా ఎక్కువగా స్మరిస్తూ వచ్చాడు. ఘంటసాల, మహమ్మద్ రఫీ. రఫీ అంటే బాలూకో అబ్సెషన్! తన కుమారుణ్ణి కూడా బాలూ రఫీ అనే ముద్దుపేరుతో పిల్చుకునేవాడు.

ముఖమల్ వస్త్రంలాంటి రఫీ మార్దవాన్ని 'ఏ దివిలో విరిసిన పారిజాతమో'లో ప్రవేశపెట్టాడు బాలూ. అంతకు ముందు కూడా రఫీ ప్రేరణతో బాలూ పాడిన పాటలున్నాయిగాని, 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' పాటలో రఫీ ముద్ర చాలా సున్నితంగా పడింది. 'ఏ మేరా ప్రేమ్ పత్ర్ పఢ్‌కర్ ' అనే అజరామరమైన పాటలో అసలు పాటకంటే ముందుగా 'మెహెర్‌బాఁ లిఖూఁ యా దిల్‌రుబా లిఖూఁ ' అనే కవిత వినిపిస్తాడు రఫీ. అందులో 'హైరాన్ హూఁ కె ఆప్‌కో ఇస్ ఖత్ మేఁ క్యా లిఖూఁ!' అని వాపోతాడు. సరిగ్గా ఆ భావప్రకటన ఒడిసిపట్టుకున్నాడు బాలూ.

ఏ దివిలో విరిసిన పారిజాతమోలో 'పారిజాతమో' అనేచోట ఒకసారీ, 'ప్రేమగీతమో' అనే చోట మరోసారీ రఫీని పలికించాడు బాలూ. నిజానికివి వేర్వేరు మీటర్లలో పాడిన పాటలు. కానీ బాలూ ఒకడే వాటికి సయోధ్య కుదర్చగలడనిపిస్తుంది. ఇలాంటి సోలో సాంగ్స్ అంతకు ముందూ ఆ తర్వాతకూడా ఎన్నో పాడాడు బాలూ. ఆ పాటలన్నీ యువతరం సంపదగా మిగిలిపోయాయి.

పదేళ్ళకోసారి లెక్క వేసుకుంటే అయిదు యువతరాల్ని ప్రభావితం చేయగలిగిన బాలూ ఓ ఘంటసాల, ఓ రఫీ, ఓ కిషోర్, ఓ ఎల్విస్ ప్రెస్లీ. నలభైవేల పాటలు పాడగలిగాడంటే దాని వెనక రహస్యమదే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?