cloudfront

Advertisement


Home > Movies - Movie News

బిగ్‌బాస్ షోలో రాష్ర్టప‌తి పాల‌న‌

బిగ్‌బాస్ షోలో రాష్ర్టప‌తి పాల‌న‌

బిగ్‌బాస్ సీజ‌న్‌-2 షో ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. బిగ్‌బాస్ షోలో ఏమైనా జ‌ర‌గొచ్చని చెబుతున్నట్టు ఎవ‌రూ ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 11వ వారానికి వ‌చ్చేస‌రికి బిగ్‌బాస్ షోలో పాల‌న కుంటుప‌డడంతో రాష్ర్టప‌తి పాల‌న విధించి బిగ్‌బాస్ సంచ‌ల‌నం సృష్టించారు. దీంతో దీప్తి కెప్టెన్సీ ఒక్కరోజు ముచ్చటే అయ్యింది. ప‌ద‌వి పోగొట్టుకున్న దీప్తికి క‌న్నీళ్లు, సాటి స‌భ్యుల ఓదార్పు మిగిలాయి.

మాటీవీలో బిగ్‌బాస్ సీజ‌న్‌-2 స‌హ‌జ న‌టుడు నాని హోస్ట్‌గా 11 వారాల క్రితం గ్రాండ్‌గా ప్రారంభ‌మైంది. 16మంది స‌భ్యుల ఎంట్రీ అట్టహాసంగా సాగింది. బాబు గోగినేని లాంటి మాన‌వ‌హ‌క్కుల ఉద్యమ‌కారునికి ఇందులో స్థానం ద‌క్కింది. బిగ్‌బాస్ హౌజ్‌కు మొట్టమొద‌టి కెప్టెన్‌గా సామ్రాట్ ఎన్నిక‌య్యారు. కెప్టెన్సీ ప‌ద‌వీకాలం ఏడురోజులు. కెప్టెన్సీలో ఉన్నవారికి ఎలిమినేష‌న్ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. దీంతో కెప్టెన్‌గా ఎన్నిక‌య్యేందుకు బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లో ఇంటి స‌భ్యులు సీరియ‌స్‌గా పాల్గొంటూ విజేత‌గా నిలిచేందుకు స‌ర్వశ‌క్తులు ఒడ్డుతున్నారు.

ప్రస్తుత కెప్టెన్ దీప్తి న‌ల్లమోతు విష‌యానికి వ‌ద్దాం. ఈమె వృత్తిరీత్యా జ‌ర్నలిస్టు. టీవీ9లో సినిమాల‌కు సంబంధించిన ప్రోగ్రాంకు యాంక‌రింగ్ చేస్తున్నారు. దీప్తి విజ‌య‌వాడ నివాసి. ఇంటి స‌భ్యులంద‌రితో చ‌క్కగా, న‌వ్వుతూ, పాజిటీవ్‌గా మాట్లాడుతూ, ఆడుతూ, పాడుతూ అన్ని టాస్క్‌ల‌లో మంచి నైపుణ్యం ప్రద‌ర్శిస్తున్నారు. ఇంటి కెప్టెన్ కావ‌డం ఆమె క‌ల‌. దానికోసం ఇప్పటి వ‌ర‌కు నాలుగు ద‌ఫాలు పోటీప‌డ్డారు. చివ‌రిగా నాలుగోసారి ఆమె కోరిక ఫ‌లించింది. దీంతో దీప్తి ఆనందానికి ఆకాశ‌మే హ‌ద్దైంది.

ఆమె కెప్టెన్సీలో ఉంటూ మైక్‌ను తొల‌గించి మాట్లాడుతుంది. అంతేకాదు, ఇంట్లో గ‌ణేష్‌, గీతా మాధురి నిద్రిస్తుండ‌టంతో య‌ధావిధిగా కుక్కలు అరుస్తాయి. మైక్ పెట్టుకోని రోల్‌రైడాను బిగ్‌బాస్ మంద‌లిస్తారు. కెప్టెన్‌గా స‌క్రమంగా బాధ్యత‌లు నిర్వర్తిస్తూ, ఇంటి స‌భ్యుల‌ను కూడా స‌రైన మార్గంలో న‌డిపించాల్సిన దీప్తినే ఆద‌ర్శంగా లేక‌పోవ‌డంతో బిగ్‌బాస్‌కు కోపం వ‌స్తుంది. దీంతో ఆయ‌న త‌న‌దైన గంభీర స్వరంతో దీప్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా ఇంటి నిబంధ‌న‌ల‌ను స‌భ్యులు ప‌దేప‌దే అతిక్రమిస్తున్నార‌ని, మైక్‌లు తొల‌గించి మాట్లాడుతున్నార‌ని తీవ్ర స్వరంతో నిర‌స‌న వ్యక్తంచేస్తారు.

ఇంటి నిబంధ‌న‌ల‌ను అతిక్రమిస్తున్న వారికి శిక్షలు విధిస్తూ 11 వారాలుగా మార్పు తీసుకురావాల‌నుకుంటున్నా సాధ్యప‌డ‌లేద‌ని బిగ్‌బాస్ అస‌హ‌నం వ్యక్తం చేస్తారు. నిబంధ‌న‌లు పాటించ‌కుంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని దీప్తి కెప్టెన్‌గా బాధ్యత‌లు చేపట్టాక బిగ్‌బాస్ హెచ్చరించ‌డంతో పాటు పాల‌న‌పై దిశానిర్దేశం చేసిన విష‌యాన్ని గుర్తుచేస్తారు.

ముందే  హెచ్చరించిన‌ట్టుగా దీప్తి కెప్టెన్సీని ర‌ద్దుచేస్తూ బిగ్‌బాస్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈవారం కెప్టెన్ లేకుండానే ఇంటి పాల‌న సాగుతుంద‌ని బిగ్‌బాస్ తేల్చిచెప్పారు. ఎంతో ఆశ‌తో, ప‌ట్టుద‌ల‌తో సాధించిన ప‌ద‌వి పోగొట్టుకున్న దీప్తి తీవ్ర ఆవేద‌న‌కు లోన‌య్యారు. దుఃఖంలో మునిగిన ఆమె త‌న‌కు ప‌ద‌విని తిరిగి ప్రసాదించాల‌ని బిగ్‌బాస్‌ను వేడుకొంటుంది.

శ‌నివారం కావ‌డంతో హోస్ట్ నాని వ‌చ్చిన‌ప్పుడు కూడా దీప్తి ప‌ద‌వి ర‌ద్దు కావ‌డంపై విచారం వ్యక్తంచేస్తారు. త‌న ప‌ద‌విని పున‌రుద్ధరించాల‌ని దీప్తి వేడుకోగా... అది త‌నచేతిలో లేద‌ని, తిరిగి ఇవ్వాల‌ని మాత్రం తాను కూడా బిగ్‌బాస్‌ను కోరుకుంటున్నాన‌ని నిస్సహాయ‌త‌ను వ్యక్తం చేస్తారు. కెప్టెన్సీ ఎన్నిక సంద‌ర్భంలో దీప్తి త‌న‌కు ఓటు వేయాల‌ని స‌భ్యుల‌కు అప్పీల్ చేస్తున్న సంద‌ర్భంలో తాను బాధ్యత‌గా వ్యవ‌హ‌రిస్తాన‌ని, అంద‌రినీ చ‌క్కగా చూసుకుంటాన‌ని హామీ ఇచ్చారు.

బ‌హుశా దీప్తి దృష్టిలో మంచిగా ఉండ‌టం అంటే నిబంధ‌న‌లు అతిక్రమిస్తున్నా చూసీ చూడ‌న‌ట్టు వ్యవ‌హ‌రించ‌డ‌మే అనుకున్నట్టున్నారు. అంతేకాదు క‌నురెప్పే కాటేసిన‌ట్టుగా ఆమే రూల్స్‌ను పాటించ‌క‌, ఇత‌రుల‌కు చెప్పే హ‌క్కు కోల్పోయారు. దీంతో బిగ్‌బాస్‌లో ఎవ‌రికి వారు బాస్‌ల‌య్యారు. పాల‌న గాడిత‌ప్పింది. దీంతో బిగ్‌బాస్‌కు క‌ఠిన నిర్ణయం తీసుకోక త‌ప్పని ప‌రిస్థితులు వ‌చ్చాయి. కెప్టెన్సీని ర‌ద్దుచేసి త‌న పాల‌న విధించారు. పాల‌కులు క‌ట్టుత‌ప్పితే ప్రజాస్వామ్యంలో ప్రజ‌లు బిగ్‌బాస్‌లాగే క‌ఠిన నిర్ణయాలు తీసుకుంటారనేందుకు ఇదో నిద‌ర్శనం.
-సొదుం ర‌మ‌ణారెడ్డి