cloudfront

Advertisement


Home > Movies - Movie News

బిగ్‌బాస్ అల్లరి పిల్ల తేజ‌స్వినీ చిలిపి ప్రశ్నలు

బిగ్‌బాస్ అల్లరి పిల్ల తేజ‌స్వినీ చిలిపి ప్రశ్నలు

"కొంచెం స్నేహంగా ఉంటే ప్రేమా? ఆ త‌ర్వాత పెళ్లి? సామ్రాట్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అంతే త‌ప్ప మా మ‌ధ్య ఎలాంటి సంబంధం లేదు " అని బిగ్‌బాస్ అల్లరి పిల్ల ప్రశ్నిస్తోంది, నిల‌దీస్తోంది, ఆగ్రహిస్తోంది, వివ‌రిస్తోంది. ఇంత‌కూ ఆ అల్లరి పిల్ల‌, కొంటె పిల్ల ఎవ‌ర‌బ్బా? బిగ్‌బాస్ సీజ‌న్‌-2లో ఛ‌లాకీగా, న‌వ్వుతూ, తుళ్లుతూ, గ‌ల‌గ‌లా మాట్లాడుతూ వినోదాన్నిపంచుతూ అక‌స్మాత్తుగా నిష్క్రమించిన ఆ అమ్మాయే తేజ‌స్వినీ మ‌దివాడ‌. మాట‌ల్లో అమాయ‌క‌త్వం, చేత‌ల్లో చిలిపిత‌నం ఆమె ప్రత్యేక ఆకర్షణ‌లు.

తేజ‌స్వినీ వృత్తిరీత్యా మోడ‌ల్‌, కొరియో గ్రాఫ‌ర్‌. అంతే కాదండోయ్‌, సినిమాల్లో కూడా త‌న‌దైన న‌ట‌న‌తో మెరుస్తోంది. హీరోయిన్ ఫ్రెండ్‌గా, చెల్లెలుగా మొద‌లైన సినీ ప్రస్థానం హీరోయిన్‌గా కూడా అల‌రిస్తోంది. వ్యక్తిగ‌తంగా ఆమె ఒంట‌రి జీవితం గ‌డుపుతోంది. త‌ల్లి చిన్నప్పుడే మ‌ర‌ణించారు. తండ్రి బాధ్యతా రాహిత్యం, సోద‌రుడి అవ‌కాశవాదం గురించి వివ‌రిస్తూ త‌న ఒంట‌రి జీవితానికి ఉన్న నేప‌థ్యాన్ని బిగ్‌బాస్‌లో ఓపెన్‌గా చెప్పి అయ్యో పాపం అనిపించింది.

ఎవ‌రికి ఎవ‌రితో, ఎందుకు అటాచ్‌మెంట్ ఏర్పడుతుందో, కెమిస్ర్టీ కుదురుతుందో చెప్పడం క‌ష్టం. బిగ్‌బాస్ హౌస్‌లో సామ్రాట్‌తో తేజ‌స్వినీకి స్నేహం కుదిరింది. ఒక్కోసారి వారు గుస‌గుస‌లాడుకోవ‌డం... ఎక్స్‌ట్రా ప‌నులు వారిపై ఆ హౌస్‌లో ఉన్న వారికే కాదు,  షో చూసే వారి మ‌న‌సుల్లో కూడా ఎక్కడో అనుమాన బీజాలు మొల‌కెత్తాయి. బిగ్‌బాస్ హోస్ట్ నాని కూడా ఇదే అభిప్రాయంతో ప‌లు సంద‌ర్భాల్లో వారిని నేరుగా అడిగారు కూడా. అబ్బే మీర‌నుకున్నట్టు అలాంటిదేమీ లేదండి నాని గారు అని తేజ‌స్వినీ అమాయ‌కంగా చెబితే, నేను చాలా అమ్మాయ‌కుడిని... సారీ సారీ అమాయ‌కుడిని అన్నా అని వివ‌ర‌ణ ఇచ్చుకున్నాడు.

బిగ్‌బాస్ హౌస్ నుంచి తేజ‌స్వినీ ఎలిమినేట్ అయిన క్షణంలో సామ్రాట్ క‌ళ్ల నుంచి కురిసిన క‌న్నీటి బొట్లు తేజస్వినీపై ప్రేమ‌ను చాటాయి. ఇక‌పై తేజస్వినీతో క‌లిసి ఉండ‌లేమ‌నే విర‌హవేద‌న సామ్రాట్‌లో స్పష్టంగా ఆవిష్కృత‌మైంది. స‌రే, తేజ‌స్వినీ బ‌య‌ట‌కొచ్చింది. సామ్రాట్‌తో నీ సంబంధం ఏంటి అనే ప్రశ్నలు ఆమెను మ‌న‌శ్శాంతిగా ఉండ‌నివ్వలేదు. మీ ఇద్దరు పెళ్లెప్పుడు చేసుకుంటున్నార‌నే ప్రశ్నలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేయ‌సాగాయి. అయ్యో, అలాంటిదేమీ లేదు బాబు అని ఆమె నెత్తినోరూ కొట్టుకుని చెప్పినా జ‌నాలు వినిపించుకోవ‌డం లేదు.

దీనికి ఆమె ఓపిక‌గా మీడియా వేదిక‌గా వివ‌ర‌ణ ఇస్తూనే ఉన్నారు. "నేను ఒంట‌రిని. నాకు ఒంట‌రే తోడు. దీంతో ప‌దిమందితో క‌ల‌సి ఉండాల‌నే బ‌ల‌మైన కోరిక నాలో దాగి ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఆ అవ‌కాశం వ‌చ్చింది. అందులోనూ సామ్రాట్‌తో మిగిలిన వారికంటే మ‌రింత క్లోజ్ అయ్యిన విష‌యం వాస్తవ‌మే. ఎందుకో కొంద‌రితో మ‌న‌సులోని బాధ‌ల‌ను పంచుకుంటే ఏదో భారం దించుకున్న ఫీలింగ్. అదే సామ్రాట్ విష‌యంలో కూడా నా బంధం, అనుబంధం. అంతేగాని అంద‌రూ అనుకుంటున్నట్టు సామ్రాట్‌తో ప్రేమ‌, పెళ్లి వ్యవ‌హారాలేవీ లేవు. ఏం మ‌గ‌వాళ్లతో స్నేహం ఉండ‌కూడ‌దా. సామ్రాట్ నాకు ఆప్తమిత్రుడు. ఇంతే" అని ఆమె చెబుతోంది.

నిజానికి భార‌తీయ స‌మాజంలో ముఖ్యంగా మ‌హిళ పుట్టేస‌రికే క‌ట్టుబాట్లతో కూడిన వ్యవ‌స్థ సిద్ధంగా ఉంటుంది. ఈ వ్యవ‌స్థ వారి ఇష్టాయిష్టాల‌తో నిమిత్తం లేకుండా రూపుదిద్దుకొంది. తండ్రి, సోద‌రుడు, ఆ త‌ర్వాత భ‌ర్తే స్త్రీకి స‌ర్వస్వం అనేలా ఒక ప్రత్యేక రాజ్యాంగం వారికి ఉంది. దీన్ని కాద‌ని ముందుకు సాగే మ‌హిళ‌ల విష‌యంలో  ఎద్దు పుండును కాకులు పొడిచిన‌ట్టు స‌మాజం కూడా వారి వ్యక్తిత్వంపై దాడి చేస్తుంది. అందులోనూ ఒంట‌రిగా జీవిస్తున్న తేజ‌స్వినీ లాంటి వారికి స‌మాజం నుంచి ఎదుర‌య్యే ఛీత్కారాల గురించి ప్రత్యేకంగా చెప్పన‌వ‌స‌రం లేదు. వీట‌న్నింటిని ఎదుర్కొంటూ, తిప్పికొడుతూ ఎప్పటిక‌ప్పుడు జీవితంపై ప్రేమ‌ను పెంచుకుంటూ ముందుకు సాగుతున్న తేజ‌స్వినీ లాంటి వారికి హ్యాట్సాప్ చెప్పక త‌ప్పదు.

ప్రతి ఒక్కరి జీవితాన్ని వారి సామాజిక, కుటుంబ నేప‌థ్యాలు ప్రభావితం చేస్తుంటాయి. మీలాంటి తండ్రి ఉంటే నా జీవితం మ‌రోర‌కంగా ఉండేద‌ని మాన‌వ హ‌క్కుల ఉద్యమ‌కారుడు బాబు గోగినేనితో తేజ‌స్వినీ అన్నారు. ఒంట‌రి జీవితం తేజ‌స్వినీ కోరుకున్నది కాదు. ఆమె ఒంట‌రి జీవితానికి ప‌రిస్థితులే కార‌ణం. సామ్రాట్‌తో త‌న ప్రేమ‌ను దాచుకునేంత భ‌యం, పిరికిత‌నం తేజ‌స్వినీలో ఏమాత్రం లేవు.

కాక‌పోతే ఆమె ప్రశ్నిస్తున్నట్టు స్ర్తీ, పురుషుల మ‌ధ్య ప్రేమ‌, పెళ్లి బంధాలు త‌ప్ప మ‌రే అనుబంధం ఉండ‌కూడ‌దా? మాన‌వ సంబంధాల్లో, మ‌రీ ముఖ్యంగా ఆడ‌, మగ‌వాళ్ల మ‌ధ్య విష‌యానికి వ‌స్తే మ‌న ఆలోచ‌న‌ల్లో ఎందుకింత సంకుచిత్వం? ప్రతి ఒక్కరూ విశాల దృక్పధంతో ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది.