రియాల్టీ షోలకు సహజంగానే రేటింగ్ ఎక్కువ. యువతీ, యువకులు కలిసి నెలల తరబడే ఒకే ఇంట్లో ఉంటుండడం, వాళ్ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సుకత బుల్లితెర ప్రేక్షకుల్లో మెండే. ఈ బలహీనతను సొమ్ము చేసుకునే క్రమంలో మొదలైన బిగ్‌బాస్ రియాల్టీ షో తెలుగులోనూ సక్సెస్ టాక్ సంపాదించుకుంది.
ఇప్పటికే బిగ్‌బాస్ రియాల్టీ షోలకు సంబంధించి మూడు సీజన్‌లో దిగ్విజయంగా ముగిశాయి. త్వరలో నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. ఈ మేరకు స్టార్ మా చానల్‌లో ప్రోమో కూడా వస్తోంది. అయితే మొదటి మూడు సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం. బుల్లితెర, వెండితెరపై ఆయా కంటెస్టెంట్ల క్రేజ్‌ను బట్టి అప్పట్లో స్టార్ మా నిర్వాహకులు బాగానే నజరానా ముట్టచెప్పారని పెద్ద ఎత్తున వార్తలు లీక్ అయ్యాయి.
తాజాగా స్టార్ట్ కానున్న నాలుగో సీజన్ కంటెస్టెంట్లకు ముందు సీజన్లలో ఇచ్చినట్టుగా ఇవ్వడానికి సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో పాటు అన్నిటికి మించి తాము ఎంపిక చేసుకోవడం వల్ల వచ్చే పాపులారిటీ ముందు రెమ్యునరేషన్ ఏ పాటిదనే వాదన చేస్తున్నారని సమాచారం. బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వడం , ఆ క్రేజ్‌ను సొమ్ము చేసుకుని ఎంతైనా సంపాదించవచ్చని నిర్వాహకులు చెబుతున్నట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
దీంతో కంటెస్టెంట్లు కూడా పారితోషికాలు తక్కువైనా రియాల్టీ షోలో పాల్గొనేందుకే మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఆగస్టు నుంచి బిగ్‌బాస్ రియాల్టీ షో నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. ఈ దఫా కంటెస్టెంట్లు ఎవరవనేది ఉత్కంఠ కలిగిస్తోంది.