Advertisement

Advertisement


Home > Movies - Movie News

'భయో' డేటా: 'కీల్' సాబ్!

'భయో' డేటా: 'కీల్' సాబ్!

నా పేరు: పవన్ కల్యాణ్

దరఖాస్తు చేయు ఉద్యోగం: 'వకీల్ సాబ్' (అంటే కాలాన్ని వాదించి వృదా చేసే ప్లీడరూ కాదు, బోధించి వేస్ట్ చేసే టీచరూ కాదు. ప్రత్యర్థిని ఏ 'కీలు'కా 'కీలు'తీసే లీడరుని. కాక పోతే 'కీలు' ఎక్కడుందో చూపించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పని ఎవరూ చెయ్యలేదు. అందుకే ఆ రెండుచోట్లా ప్రత్యర్థులు తప్పించుకున్నారు. దాన్ని వోటమి అంటే ఎలా?)

వయసు: నిత్య కల్యాణం పచ్చతోరణం. ఎప్పుడూ నవ యవ్వనుణ్ణే. 

ముద్దు పేర్లు: సీజన్‌ను బట్టి పిలవాలి. 'చే' కల్యాణ్ (కమ్యూనిస్టులతో జత కట్టినప్పుడు, 'కాషాయ కల్యాణ్' (ఇప్పుడు బీజేపీ తో జతకట్టాను కదా!)

విద్యార్హతలు:  స్మ ృతీ ఇరానీ మేడమ్ నీ, మోడీజీనీ, నన్నూ ఈ ప్రశ్న అడుగుతారేమిటి? మేం ప్రపంచాన్ని చదువుతాం. మా దగ్గరకొచ్చి కాలేజీ, యూనివర్శిటీల గురించి అడుగుతారా? 

విలాసం: ఇప్పుడు నాదే కాదు, ఎన్నికల్లో పోటీచేసేవారిదీ, గెలిచే వారిదీ, అందరి విలాసమూ ఆ శ్రీనివాసుడి సన్నిధే. గెలిస్తే కల్యాణకట్టే. మొక్కు తీర్చుకోవాలి కదా!

గుర్తింపు చిహ్నాలు: ఒకటి: ఒరిజినాలిటీ. ఒకర్ని అనుకరించను. నేను తీసిన సినిమాలు రీమేక్‌కు రీమేక్ కావచ్చు. 'పింక్' లోపల 'పింక్'లోపల, 'పింక్' కావచ్చు. నటనలో నా స్టయిల్ నాదే.

రెండు: తృప్తి. అన్ని సీట్లు పోయి ఒక్క సీటొచ్చినా అదే తృప్తి. మునిసిపాలిటీలు పోయినా వార్డులొచ్చాయన్న తృప్తి. తృప్తిని మించిన విజయంలేదు. 

సిధ్ధాంతం: సంభవామి క్షణే.. క్షణే...! బీజేపీకి దగ్గర కదా! సంస్కృతంలో చెబితే బాగుండునని అంటున్నాను. యుగానికో అవతారం. 'దశావతరాలు' తీసిన కమల్ హాసన్ కు అర్థం కావటం లేదు. 'మక్కల్ నీది మయ్యం' పార్టీ పెట్టుకుని మార్చకుండా కూర్చున్నాడు. నన్ను సరిగా చూస్తున్నట్టు లేడు. జనసేన నేతగా సీను మారేసరికి మెడలో కండువా కలర్ దానంతటదే మారిపోతుంది. ఇది 'దిశా' వతారం. అంటే మనం వెళ్ళే దిశను బట్టి అవతారం మార్చటమన్నమాట!

వృత్తి: ఒకరికి తొత్తు లా పడి వుండటం నా వృత్తి కాదు. కావాలంటే నచ్చిన పార్టీతో 'పొత్తు' పెట్టుకుంటాను. నచ్చలేదనుకో. విడిపోతాం. నాకు జీవితమూ, రాజకీయమూ వేరు వేరు కాదు.

హాబీలు: 1. మన గురించి మనం కాదు. పక్క వాళ్ళు చెప్పేలా ప్రవర్తించాలి. చూశారా? బీజేపీ నేతలే నన్ను భావి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ( అవునూ. 'సీఎం సాబ్' టైటిల్ ఎలా వుంది? ఆరె సాంబా రాస్కోరా!)

2. ఏ ఆటయినా నిలిచి ఆడాలి. అందుకే కదా, ఎంత ఆడినా నిలిచిన చోటనే వుంటున్నాను. అయినా నిలబడతాను. 

అనుభవం: ముందు వోట్లు లెక్కించాను. తర్వాత పంచాయితీలు లెక్కించాను. ఆ పైన వార్డులు లెక్కించాను. ఆ పైన జిల్లాలు లెక్కిస్తాను. నా కో లెక్క వుంది. దానికి మాత్రం తిక్క లేదు. 

మిత్రులు: డేట్స్.. డేట్స్... చెప్పాలి. అప్పుడు కదా ఎవరితో పొత్తులో వున్నామో చెప్పగలిగేది?

శత్రువులు: కత్తులూ, కటారులూ... బర్మాలూ.. చైనాలూ ఎవరెవరో వుంటారు! నేను పట్టించుకోను. కానీ వాళ్ళు వెంటపడి మరీ నాకు ప్రచారం ఇస్తారు. 

మిత్రశత్రువులు: వుండరు. మనకి అంతా క్లియర్ గా వుండాలి. 

జీవిత ధ్యేయం: నన్నెందుకబ్బా అడుగుతారు? నాతో పెట్టుకున్నవాళ్ళనడగండి. చెబుతున్నారుగా నేనేమవుతానో... వినండీ..!!

సర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?