బాలీవుడ్ బిగ్ స్టార్లు, ఇతర నటీనటులు.. షారూక్ కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ఎన్సీబీ కోరిన మొదటి కస్టడీ పూర్తయిన తర్వాత జరిగిన విచారణలో కూడా ఆర్యన్ ఖాన్ కు బెయిల్ దక్కలేదు. దీంతో షారూక్ తనయుడు ఆర్యన్ ఇప్పుడప్పుడే మన్నత్ ను చేరలేడని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో షారూక్ ఖాన్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ, వారు ధృఢంగా ఉండాలంటూ బాలీవుడ్ సెలబ్రిటీలు ఆకాంక్షిస్తున్నారు.
ఆర్యన్ ఖాన్ అరెస్టు వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మన్నత్ వెళ్లాడు. షారూక్, గౌరీలను పరామర్శించాడు. గతంలో అరెస్టు అనుభవం ఉంది సల్మాన్ కు. జైలు జీవితమెంత కఠినమో ఆయనకు తెలిసే ఉంటుంది. షారూక్ తో సల్మాన్ కు విబేధాలున్నాయనే వార్తలు ఉన్నా.. సల్మాన్ వెళ్లి పరామర్శించాడు.
ఇక స్టే స్ట్రాంగ్ అంటూ డైరెక్టుగా ఆర్యన్ ఖాన్ కు సందేశాలు ఇస్తున్నారు మిగిలిన బాలీవుడ్ స్టార్లు. ఈ విషయంలో హృతిక్ రోషన్ వార్తల్లో నిలిచాడు. షారూక్ ఫ్యామిలీకి సంఘీభావం ప్రకటించాడు హృతిక్. ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు జానీ లీవర్ కూడా స్పందించాడు. షారూక్, గౌరీలపై సంఘీభావం ప్రకటించాడు. తాప్సీ తదితర బాలీవుడ్ తారాగణం కూడా స్పందించింది.
షారూక్ ఫ్యామిలీపై ఒక వైపు సోషల్ మీడియాలో ట్రోల్ కొనసాగుతూ ఉంది. ఆర్యన్ ఖాన్ దొరికిన సమయాన్ని ఉపయోగించుకుని ఇష్టానుసారం స్పందించడానికి కూడా కొందరు వెనుకాడటం లేదు.
సంబంధం లేని అంశాలనూ ప్రస్తావిస్తూ ద్వేషాన్ని ప్రకటిస్తోంది సోషల్ మీడియా. అరెస్టు కన్నా,, ట్రోల్ ను ఎదుర్కోవడం కష్టం అని స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో షారూక్ అండ్ ఫ్యామిలీ మరీ కృశించి పోకుండా వారి సన్నిహితులు బాహాటంగా మద్దతుగా నిలుస్తున్నట్టుగా ఉన్నారు.