cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బతకడమే కాదు.. చావు కూడా పాఠమే!

బతకడమే కాదు.. చావు కూడా పాఠమే!

చాలామంది జీవితాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. వాళ్ల లైఫ్‌స్టైల్‌, వాళ్ల కష్టం, వాళ్లు సాధించిన సక్సెస్‌... ఇవన్నీ పాఠాలే. అలా బతకాలి.. అలా సాధించాలి.. ఆ స్థాయికి వెళ్లాలి.. అంత సంపాదించాలి.. అలా జీవితాన్ని మలుచుకోవాలి.. ఈ స్ఫూర్తి, ఈ మాలలు అనేకమంది జీవితాలను నడిపిస్తాయి. సెలబ్రిటీల దగ్గర నుంచి మనకు తెలిసిన వాళ్ల వరకూ చాలామంది జీవితాలు మనకు పాఠాలుగా నిలుస్తూ ఉంటాయి. ఇలాంటి పాఠాలే సొసైటీని చాలావరకూ నడిపిస్తాయి కూడా. గవాస్కర్‌ను చూసి సచిన్‌ ఎదిగాడు. సచిన్‌ను చూసి మరెంతో మంది బ్యాట్‌ పట్టారు. జాతీయ జట్టు వరకూ ఎదిగారు.

చిరంజీవిని చూసి చాలా మరెంతో మంది స్ఫూర్తి పొందారు. ఇలా చెబుతూపోతే పాఠాలుగా నిలిచే వ్యక్తుల జీవితాలు ఎన్నో ఉంటాయి. అయితే అలా బతకాలి, ఆ స్థాయికి ఎదగాలి అనే జీవితాల నుంచినే కాదు.. కొన్నిసార్లు విషాదాంతాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. అయితే మనుషుల్లో ఇంకా ఈ క్వాలిటీ మెరుగైనట్టుగా కనిపించడం లేదు. నందమూరి హరికృష్ణ అలా మరణించడం అనేది ప్రమాదాల విషయంలో ఇంకా చాలామంది పాఠాలు నేర్చుకోలేదు అనే విషయానికి సాక్ష్యంగా నిలుస్తోంది.

హరికృష్ణ తనయుడు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వేదికను ఎక్కినప్పుడల్లా చెబుతూ ఉంటాడు. సీటు బెల్ట్‌ పెట్టుకుని డ్రైవ్‌ చేయమని, అతివేగం ప్రమాదకరమని... అందరు హీరోలూ, హీరోయిన్లు.. ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. అయితే ఎన్టీఆర్‌ మాత్రం అందులోని బాధను ఫీలై చెబుతూ ఉంటాడు. తనకు ప్రాణప్రదమైన అన్న అలా చనిపోయాడని.. మరో కుటుంబానికి అలాంటి బాధవద్దని తారక్‌ బాధాతప్త హృదయంతో చెబుతూ ఉంటాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

అలాచెప్పే ఎన్టీఆర్‌ తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించడం విషాదకరం. చాలామంది దీన్ని విధి అనేయవచ్చు. కానీ అలా అనేస్తే బాధ్యతలు అయిపోవు. మనవంతు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేకుండా అంతా విధి అనేస్తే సరిపోతుందా? సీటు బెల్ట్‌ పెట్టుకోకుండా అంతవేగంతో కారు పోనిస్తే ఏ దేవుడైనా ఎలా కాపాడగలడు? మనవంతు జాగ్రత్త లేకుండా గాల్లో దీపంపెట్టేసి దేవుడా నీవే దిక్కు అంటే అయిపోతుందా?

సెలబ్రిటీల జీవితాలు.. అలా బతకాల్రా అనేందుకు మోడల్స్‌. వారిలోని కొంతమంది మరణిస్తున్న తీరును చూస్తుంటే మాత్రం.. అలాంటి చావుకు దూరంగా ఉండాలనే ఆలోచనను మనుషుల్లో కలిగించలేకపోతున్నాయా? ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల్లో చాలామంది సెలబ్రిటీలు మరణించారు. అందరి విషయంలోనూ ఒకటే వార్త. సీటు బెల్ట్‌ పెట్టుకుని ఉంటే ప్రాణాలు దక్కవి అనేది. ఈమాట నుంచి పాఠం నేర్చుకోలేమా?
- ఎల్ .విజయలక్ష్మి