ఈ మధ్య జనాలు జానపదాల మీద పడ్డారు. సంగీత దర్శకులు తమ క్రియేటివిటీని పక్కన పెట్టి, జనాల్లో నానిపోయిన పాత జానపదాలను వెతికి పట్టుకుని, కొత్త సొగసులు అద్దకం చేసి, సక్సెస్ కొడుతున్నారు. నాదీ నెక్కలీసు గొలుసు, రాములో రాముల లాంటి పాటలు ఇలా వచ్చినవే. ఈ తరహాలోనే మరోపాట వచ్చింది
సుధీర్ బాబు హీరోగా 70ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకపై శశి, విజయ్ నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడాసెంటర్. ఈ సినిమా కోసం మణిశర్మ-కాసర్ల శ్యామ్ కలిసి ఓ ఉత్తరాంధ్ర పాటను వెదికి పట్టుకువచ్చారు.
ఈ డిజిటల్ యుగం రాకముందు, అసలు ప్రయివేటు ఆల్బమ్ లు అంటే అవేంటీ? అని అడిగే రోజుల్లో ఉత్తరాంధ్రను ఊపేసిన గాయకుడు 'దిమిలి పొడుగు మనిషి'. అప్పట్లో ఆయన పాట వినిపించని మైక్ సెట్ వుండేది కాదు. ఆ రోజుల్లో చెన్నయ్ వెళ్లి ప్రయివేటు ఆల్బమ్ లు చేసిన గాయకుడు. ఈయన పాటలు గతంలో రఘు కుంచె, ఆర్పీ పట్నాయక్ లాంటి వాళ్లు కనీసం క్రెడిట్ లైన్ ఇవ్వకుండా కొట్టేసారు.
ఈసారి మాత్రం శ్రీదేవి సోడాసెంటర్ సినిమా కోసం వాడుకుని, ఉత్తరాంధ్ర జానపద గీతం ఆధారంగా అని కోట్ చేసారు. బహుశా ఇది దిమిలి పొడుగు మనిషి పాట అని వారికి కూడా తెలిసి వుండదేమో? కనీసం సినిమా టైటిల్ కార్డ్ లో అయినా ఆయన పేరు పేర్కొంటే బాగుంటుంది.
సరే, అసలు విషయానికి వస్తే, సాంగ్ పిక్చరైజేషన్ మాంచి పెప్పీగా చేసారు. సుధీర్ బాబు లుక్ కొత్తగా వుంది. సెట్, డ్యాన్స్ అన్నీ భలేగా కుదిరాయి. గతంలో పలాస సినిమాను అందించిన కరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు.