భారతీయ జనతా పార్టీ విధానాలను అతిగా సమర్థించబోయిన నటి కంగనా రనౌత్ కు కేసుతో సత్కారం అందుతోంది. ఆమెపై కేసు నమోదయ్యింది. రైతు బిల్లులకు సంబంధించి ఆమె చేసిన ట్వీట్లకు దక్కిన ప్రతిఫలం ఇది.
గత కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీని తెగ సమర్థిస్తోంది కంగనా. పనిలో పనిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకుల మీదా దుమ్మెత్తి పోస్తోంది. బీజేపీ విధానాల్లో దేన్ని తప్పు పట్టినా వారిని దేశద్రోహులు అనేంత స్థాయి భక్తురాలు అయ్యింది ఈమె!
ఈ భక్తురాలు.. రైతుల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై పలు చోట్ల నిరసనలు, ధర్నాలు సాగుతూ ఉన్నాయి.
పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలతో సహా వివిధ చోట్ల ఈ బిల్లుల విషయంలో బీజేపీ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనలు చేస్తున్న వారిపై ఈమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. వారిని దేశద్రోహులు అన్నంత పని చేసింది.
ఈ వ్యవహారంపై కర్ణాటకలోని రైతు సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి. ఆమె తీరుపై కోర్టుకు ఎక్కాయి. దీంతో ఆమెపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక పోలీసులు కంగనా మీద కేసు నమోదు చేశారు.
వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారు అపోహలను ప్రచారం చేస్తున్నారని, గతంలో అపోహలను ప్రచారం చేసి మతకలహాలు రేపిన వారే ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించి కంగనా బుక్ అయ్యింది. ఏ అంశం గురించి మాట్లాడుతున్న అవగాహన కూడా లేని ఈ నటీమణి తన అతితో ఈ కేసును బహుమానంగా పొందింది.