Advertisement

Advertisement


Home > Movies - Movie News

చేతులు కాలిపోతున్నాయి జగన్ జీ

చేతులు కాలిపోతున్నాయి జగన్ జీ

ఎవరైనా సరే, చేతులు కాలకముందే జాగ్రత్త పడాలి. కాలిపోయిన తరువాత ఆకులు కాదు కదా, బర్నాల్ రాసుకున్నా సుఖం అంతంత మాత్రమే. జగన్ ను విపరీతంగా నమ్మి, అధికారం ఇచ్చారు ఆంధ్ర జనం. జగనన్నా..జగనన్నా..అంటూ వెంట నడిచారు. అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. కానీ రెండున్నరేళ్ల పాలనలో కేవలం సంక్షేమ మంత్రాన్ని నమ్ముకుని ఓటర్లను దూరం చేసుకుంటున్నారు. సంక్షేమ ఫలాలు అందుకుంటున్నవారు ఓటర్లే కదా? అని అనుకోవచ్చు. 

కానీ ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా జనాల నాడిని, ఆశలను, అత్యాశలను తక్కువ అంచనావేసినట్లు అవుతుంది. గ్రౌండ్ లెవెల్ లో ఎంత వ్యతిరేకత పేరుకుంటోందో అర్థం కావడం లేదో లేదా తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదో? జగన్ కాళ్లకు చాలా అడ్డంకులు వుండొచ్చు. కానీ అవన్నీ జనాలకు అనవసరం. కీలకమైన వర్గాలను జగన్ దూరం చేసుకుంటున్నారు.

మీది తరగతి వారు జగన్ తో ఎలాగూ హ్యాపీగా లేరు. కానీ జగన్ కు వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే అలాంటి వారు ఎక్కువగా వుండేది తెలుగుదేశం పార్టీతో. అందువల్ల సమస్య లేదు. కానీ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ జనాలు జగన్ వెంట నడిచారు. వీరిలో లోవర్ క్లాస్ కు డబ్బులు జల్లుతున్నారు. అయినా వారు గంపగుత్తగా ఓట్లు వేస్తారనుకుంటే భ్రమే. ఎందుకంటే వాళ్లు కూడా రోడ్ల మీద నడుస్తారు. వాళ్లు కూడా పెట్రోలు కొంటారు. వాళ్లు కూడా నిత్యావసర సరుకులు కొంటారు.

కరోనా తరువాత మార్కెట్ ను నియంత్రించే వ్యవహారం ఏమీ లేదు. ఎంత దారుణం అంటే గ్రామాల్లో ధాన్యం రేటు దారుణంగా పడిపోయింది. దాదాపు ముఫైశాతం మేరకు ధాన్యం రేటు తగ్గిపోయింది. కానీ ఓపెన్ మార్కెట్ లో బియ్యం రేట్లు అలాగే వున్నాయి. కిలో నలభై, యాభై అంటూ దొపిడీ సాగుతూనే వుంది. 

డీజిల్ పెట్రోలు సంగతి చెప్పనక్కరలేదు. గ్యాస్ సంగతి సరేసరి. రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోంది. ఇదంతా కేంద్రం వ్యవహారం అని తప్పించుకోవడానికి లేదు. పెట్రోలు, డీజిల్ పై రాష్ట్రం పన్నువాటా ఎంతో సామాన్యుడికి కూడా తెలిసిపోయింది. థాంక్స్ టు సోషల్ మీడియా. 

రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దమనీయంగా తయారైంది. జనాల కళ్లకు కట్టిటన్లు కనిపిస్తోంది. కేంద్రం వేసిన హైవేలు అన్నీ కళ కళలాడుతున్నాయి. జిల్లా పరిషత్, ఆర్ అండ్ బి, పంచాయతీ రోడ్లు అన్నీ దారుణంగా తయారయ్యాయి. పంచాయతీలకు కొత్త రోడ్లు రావడం లేదు. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన రోడ్లు వేయడానికి గ్రామాల్లో నామినేషన్ కాంట్రాక్టర్లు ఎవ్వరూ రావడం లేదు. పంచాయతీ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన వారికి ఈ రోజుకు బిల్లుల చెల్లింపు లేదు. దాంతో కొత్త భవనాలు ఇస్తున్నా, నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.

స్టేట్ హైవే లు దారుణంగా వున్నా, కొన్ని చోట్ల టోల్ వసూలు చేయడం భలే చిత్రం. ఏలూరు నుంచి రాజమండ్రి కి కొత్త బైపాస్ హైవే నిర్మించింది కేంద్రం. దాని చివర్న పది కిలోమీటర్లు స్టేట్ హైవే వుంది. పది కిలోమీటర్ల ప్రయాణానికి గంట పడుతుంది. ఎందుకంటే అతి దారుణమైన గోతులతో నిండి వుంటుంది. గమ్మత్తేమిటంటే ఈ పది కిలోమీటర్లకు టొల్ వసూలు మాత్రం సాగుతూనే వుంది. జనం మామూలుగా తిట్టుకోవడం లేదు.

మధ్యతరగతి జనాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను దారులు దాదాపుగా ప్రభుత్వానికి దూరం అయిపోతున్నారు. ఈ నెల ఇప్పటి వరకు జీతాలు లేవు. పింఛన్లు లేవు. ఫించనుపై బతికేవారు టంఛనుగా ఓటు వేసే పౌరులు. ఇప్పుడు వీరి ఓటు ఏ విధంగా వైకాపాకు రాబట్టగలరు? 

మంత్రులు అందరినీ మార్చేయడం వల్ల పాప భారం అంతా పాత వారి మీదకు పోతుందని జగన్ అనుకుంటే భ్రమే. ఎందుకంటే గత రెండున్నరేళ్ల పాలనలో మంత్రులకు ఎంత ప్రమేయం వుంది అన్నది జనాలకు బాగా తెలుసు.  ప్రస్తుత రాష్ట పరిస్థితికి కర్త కర్మ క్రియ అంతా జగన్ నే అని జనం నమ్ముతున్నారు. 

ఇలాంటి నేపథ్యంలో జగన్ కు మిగిలిన ఆశ అంతా ఒక్కటే కులాలు, మతాల తూకం. కొన్ని కులాలు, మతాలు తనతోనే వుంటాయన్న ధీమా వుండొచ్చు. కానీ జీవన పరిస్థితులు బాగా లేకుంటే వారు కూడా ఆలోచనలో పడే ప్రమాదం వుంది. ఇది చరిత్ర చెబుతున్న నిజం. కేవలం ఈ కుల, మత ఈక్వేషన్లు నమ్ముకుని, రాష్ట్ర పాలనను గాలికి వదిలేస్తే...చేతులు కాలిన తరువాత బర్నాల్ రాసుకున్నట్లు అవుతుంది.

-చాణక్య

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?