అసలు ఈ సినిమా సెలబ్రిటీలున్నారే!

మీడియా, సినిమా – ఈ రెండూ ఒకదానిమీద ఒకటి బతికే రంగాలు. తెర మీద వినోదాన్ని సినిమా అందిస్తే, తెర బయట వినోదాన్ని మీడియా అందిస్తుంది.  Advertisement నిప్పు లేనిదే పొగ రాదంటారు. ఏ…

మీడియా, సినిమా – ఈ రెండూ ఒకదానిమీద ఒకటి బతికే రంగాలు. తెర మీద వినోదాన్ని సినిమా అందిస్తే, తెర బయట వినోదాన్ని మీడియా అందిస్తుంది. 

నిప్పు లేనిదే పొగ రాదంటారు. ఏ మూలనుంచో పొగ రావడంతో వార్త మీడియాలో మెరుస్తుంది. కొంతమంది వెంటనే ఖండిస్తారు.  కొందరు నిజమే అని ఒప్పుకుంటారు. కొందరు ఏదీ చెప్పక సైలెంటుగా అటెన్షన్ మాత్రం ఎంజాయ్ చేస్తుంటారు. ఇది ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా ఉన్నదే. 

మీడియా గాసిప్స్ రాస్తే బాధపడ్డామని కొందరు సెలెబ్రిటీలు అంటుంటారు.  కానీ అసలు తమ మీద గాసిప్సే రాకపోతే తాము సెలబ్రిటీలమే కామన్న లాజిక్కుతో చెప్పి మరీ గాసిప్ రాయించుకునే సెలెబ్రిటీలూ మా లిస్టులో ఉన్నారు. 

కొందరు తమ మీద వచ్చిన గాసిప్పుని వెంటనే ఖండించరు. మౌనం అంగీకారమే అన్న చందాన మీడియాకూడా గాసిప్స్ ని అల్లుకుపోతుంటుంది. ఏ ప్రెస్ మీట్ లోనో ముఖాముఖిలో ప్రస్తావిస్తే “అలాంటి గాసిప్ చదివి బాధపడ్డాను” అంటారు తప్ప అడిగిన ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పరు. 

తాజాగా నాగ చైతన్య- సమంత విడాకుల కబురు గాసిప్పు రూపంలో తిరుగుతూనే ఉంది. ఇది అబద్ధమైతే వెంటనే ఆ ఇద్దరూ జంటగా ఒక ఫోటోనో, వీడియోనో సోషల్ మీడియాలో వదిలుంటే గాసిప్పుకి తెర పడిపోయేది. స్పందించకుండా ఇన్నాళ్లూ వదిలేయడంతో ఇప్పుడా వార్త నిజమేనని అందరూ నమ్ముతున్నారు. 

సమంత తన ఇన్స్టాగ్రాం లో రోజుకొక ఎమోషనల్ స్టాటస్ పెడుతూ జనం దృష్టి తనమీద ఉంచుకునేలా చేస్తోంది. పీఆర్వోని అడిగితే “మనకెందుకు సార్..వాళ్ల గొడవ” అంటాడు. 

విషయమేంటని అడిగితే, “ఆ గాసిప్స్ చదివి బాధ పడ్డాను” అన్నారు నాగ చైతన్య. 

బాధపడితే ముందే ఖండించవచ్చు కదా అనేది మీడియా ప్రశ్న. ఇంతా జరిగి రేపు ఈ జంట చక్కగా కలిసిపోయినా ఆశ్చర్యం లేదు. అప్పుడు మీడియాకి చివాట్లు ఎలాగూ తప్పవు. అయినా పర్వాలేదు..ఇప్పటికీ అందరూ కోరుకుంటున్నది ఒక్కటే..ఈ జంట కలకాలం కలిసుండాలని. కానీ మొహమ్మీద అడిగినా విషయం చెప్పకుండా మీడియాని మొట్టికాయ మొడితే ఎలా?!

సమంత గానీ, బాధ పడ్డ నాగచైతన్య గానీ కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకుంటే తప్ప ఈ గాసిప్పులు ఆగవు. ఈ జంట మీద జనానికి అంత ఆసక్తి ఉంది మరి. 

సినిమా వాళ్ల వ్యక్తిగత విషయాలు మీడియాకెందుకు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఒక లైన్. వ్యక్తిగత విషయాలు బయటికి రావద్దంటే సినిమాల్లోకి అడుగుపెట్టకపోవడమే మంచిది. దానికి ప్రిపేర్ అయితే ఈ రంగంలోకి రావాలి. ఎందుకంటే సినిమావాళ్లని ప్రతి కామన్ మ్యాన్ ఫ్యామిలీ మెంబర్ లా భావిస్తాడు. వాళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. వాళ్ల మంచైనా, చెడైనా ఏదైనా సరే..ప్రతీది ఆసక్తికరమే. కనుక, నీటిలో మునుగుతాను కానీ తడి అంటకూడదంటే ఎలా కుదరదో సినిమాల్లో పాపులర్ అవుతాను కానీ పర్సనల్ విషయాలు బయటికి రాకూడదంటే అస్సలు కుదరదు. హాలీవుడ్డైనా, బాలీవుడ్డైనా, టాలీవుడ్డైనా ఇదింతే. 

ఇక్కడొక చిన్న కామెడీ బిట్ చెప్పుకోవాలి.

ఒక దర్శకుడు తన సినిమా టైటిల్ ని ముందుగానే లీక్ చేసామని కోపంతో ఊగిపోయాడు. ఇది కచ్చితంగా వ్యక్తిగత విషయం కాదు. సినిమా విషయమే కదా. 

ఫలానా సినిమా ఫలానా టైటిల్స్ అనుకుంటున్నారు అని రాయడం కూడా పాత పద్ధతే. అలా రాసిన వాటిల్లో తాను ఫైనలైజ్ చేసిన టైటిల్ ఉందన్న బాధతో మా రిపోర్టర్ కి కాల్ చేసి, “ఇలా మీ అత్యుత్సాహంతో మా ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ని చంపేయకండి. మీరు బతకాలనుకుంటే నాకు అమ్మాయిలతో లింకులున్నాయని రాసుకోండి”, అన్నాడు. 

చెప్పాడు కదా అని “అదే” రాస్తే మళ్లీ తన వ్యక్తిగత జీవితమ్మీద దాడి చేసామనొచ్చు. 

కొంతమంది సినిమావాళ్ల దృష్టిలో మీడియా అంటే ఎప్పటికీ వాళ్లకి డప్పు కొట్టేయ్యాలి, ఎలా సినిమా తీసినా అద్భుతమని పొగడాలి, ఏం తప్పుడు మాట మాట్లాడినా వెనకేసుకురావాలి, ఫోన్ చేసి పిలిస్తే పరుగెట్టుకెళ్లాలి, తోచినప్పుడు కవరిస్తే పుచ్చేసుకుని చెప్పింది రాసేయ్యాలి….ఇలా ఉంటాయి కోరికలు. జనాదరణ పొందిన ఏ వెబ్సైటు కూడా ఆ పనులు చెయ్యదు. ఒకవేళ చేస్తే జనాదరణ పొందదు.

తెర మీద కథ చెప్పి జనానికి వినోదాన్ని అందించడం సినిమా వాళ్ల పని. తెర బయట కథలు రాసి అదే జనానికి వినోదాన్ని పంచడం మీడియా పని. 

అన్నట్టు మీడియాకి గాసిప్పులందించేది కూడా సినిమా వాళ్ళే. ఒక దర్శకుడు ఫోన్ చేసి మరొక దర్శకుడి సినిమా గురించో, “వ్యవహారం” గురించే చెవిలో ఊది, అడిగితే ఏదో ఆధారం కూడా చూపించి రాసుకోమంటాడు. నాలుగు రోజులు పోయాక ఈ దర్శకుడు గురించి మరొక నిర్మాత ఫోన్ చేసి ఏదో చెప్తాడు. మధ్యలో పీఆర్వోల ద్వారా కూడా తమ వంతు సాయం మీడియాకి చేస్తూనే ఉంటారు హీరోలు, నిర్మాతలు. 

ఈ సినిమావాళ్లున్నారే..వాళ్లు ఏ టైపంటే..”అందరికీ వినోదం కావాలి..కానీ తాను మాత్రం వినోద వస్తువు కాకూడదు” అనుకునే టైపు. 

– ఒక సీనియర్ సినీ జర్నలిస్ట్