cloudfront

Advertisement


Home > Movies - Movie News

బిగ్ బాస్ నరకం.. పెళ్లిచూపులు అరాచకం

బిగ్ బాస్ నరకం.. పెళ్లిచూపులు అరాచకం

రెండు సీజన్లు పూర్తయినా ఇప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ షోను విమర్శించేవాళ్ల సంఖ్య తక్కువేం కాదు. మొన్నటికి మొన్న సెకెండ్ సీజన్ పూర్తయిన వెంటనే "హమ్మయ్య.. పీడ వదిలింది".. "నరకం నుంచి బయటకొచ్చినట్టుంది" అనే కామెంట్స్ పడ్డాయి. ఇప్పుడు అది పోయిందనుకుంటే అంతకుమించిన అరాచకం ఒకటి బయల్దేరింది. ఈసారి "పెళ్లిచూపులు" రూపంలో అది మొదలైంది.

ప్రదీప్ పెళ్లి చూపులు.. బిగ్ బాస్-2 తర్వాత రేటింగ్స్ పెంచుకోడానికి మాటీవీ స్టార్ట్ చేసిన కొత్త గేమ్ షో ఇది. కాన్సెప్ట్ పరంగా చూస్తే హిందీలో చాలా ఏళ్ల క్రితం వచ్చిన పాతచింతకాయ పచ్చడి కార్యక్రమం ఇది. తమిళ టీవీల్లో కూడా ఈ కాన్సెప్టును అరగదీశారు. నా పెళ్లి అంటూ ఆమధ్య ఆర్య హంగామా చేసింది ఈ షో కోసమే.

తెలుగులో మాత్రం మగ-స్వయంవరం కార్యక్రమం ఇదే మొదటిసారి. 14 మంది అమ్మాయిలు ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి పడే తంటాలు, వారి ప్రేమను వ్యక్తపరిచే విధానాలు.. వీటితో నిండిపోయి ఉంటుంది ఈ కార్యక్రమం. ఇలా టెలికాస్ట్ అయిందో లేదో అలా దీనిపై విమర్శలు మొదలయ్యాయి. కేవలం ఇద్దరు మనుషులు, రెండు మనసుల మధ్య ఉండాల్సిన ప్రేమ అనే పవిత్ర భావనను, ఇలా బజారుకీడ్చడం, కెమెరాల్లో రికార్డ్ చేయడం, నలుగురిలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి.

ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే కావచ్చు, అతనిపై చాలామంది అమ్మాయిలకు క్రష్ ఉండొచ్చు.. ఆ క్రష్ ను ఇలా క్యాష్ చేసుకోవాలనుకోవడం స్టార్ మా కి ఎంతవరకు కరెక్ట్. "ఐ లవ్యూ ప్రదీప్, మనిద్దరికీ ఎప్పుడో పెళ్లైపోయిందనుకుంటున్నా, మన ఇద్దరికీ పాప పుడుతుందని కలగన్నా, ఆమెకు పేరుకూడా పెట్టేశా". అంటూ కొంతమంది అమ్మాయిలు ఎపిసోడ్ లో చెబుతున్న మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి.

ఇది టీవీషో అనే విషయం మర్చిపోయి 14మంది అమ్మాయిలూ ప్రదీప్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు? ప్రదీప్ రిజెక్ట్ చేసిన 13 మంది అమ్మాయిలు వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్న తర్వాత, మొగుడితో కలసి ఈ ఎపిసోడ్ లను చూడగలరా..? కనీసం అలాంటి పరిస్థితిని ఊహించుకోగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు?

ఒక హీరోని ఇద్దరు హీరోయిన్లు పంచుకోవడం అనే కాన్సెప్టే చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అలాంటిది 14 మంది అమ్మాయిలు ఒక అబ్బాయి అంటే పడిచచ్చిపోవడం, అతని ప్రేమ కోసం అర్రులు చాచడం, అతడ్ని ఇంప్రెస్ చేయడానికి ఏవేవో పనులు చేయడం, ఇతరులపై ఈగోలు పెంచుకోవడం.. అసలు ఎటు పోతున్నాం మనం.

ప్రేమ, పెళ్లి గాడితప్పినప్పుడు జరుగుతున్న దాడుల్ని రాష్ట్రంలో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఉద్విగ్న వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్. పైగా ఈ కార్యక్రమం కోసం అమ్మాయిల్ని ఎంపిక చేసే క్రమంలో 'నీది ఏ కులం' అని అడగడం ఇంకా దారుణం.

ప్రేక్షకులు చూస్తున్నారు, మేం చూపిస్తున్నాం అంటూ వితండవాదం చేస్తే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. సినిమాలకు రీ-సెన్సార్ చేసి మరీ టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. అలాంటిది.. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ ప్రోగ్రామ్ కి ఎలా పర్మిషన్ ఇస్తారు?