పూరీ జగన్నాథ్ అద్భుతమైన ఆలోచనలున్న డైరెక్టర్. సమాజ పరిణామాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. “పూరీ మ్యూజింగ్స్” పేరుతో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకోవడం చూస్తున్నాం. తాజాగా “ట్రాష్ బ్యాగ్స్ ” గురించి ఆయన చెప్పిన విషయాలు … పూరీ మేధస్సుకు అద్దం పట్టాయి. అలాగే ఆయనలోని నిర్వేదాన్ని కూడా చూడొచ్చు.
జీవితంలో లక్ష్య సాధనలో విజయం సాధించాలంటే ఏం చేయాలో ఆయన అద్భుతంగా వివరించారు. మొట్ట మొదట మన చుట్టూ ఉండే చెత్తను వదిలించుకోవాలని స్పష్టంగా వివరించారు. చెత్తంటే మరేదో అనుకునేరు …. చెడు ఆలోచనలతో ఉండే మనుషుల గురించి చెత్త అని ఆయన సంబోధించడం.
ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఎడ్మండ్ హిల్లరీ గురించి వివరించిన తీరు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటోంది. మొత్తం 400 మందితో కలిసి 4500 కిలోల బరువుతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు బయల్దేరినట్టు చెప్పారు. కొంత దూరం వెళ్లిన తర్వాత అందులో కొంత లగేజీ అవసరం లేదని భావించారన్నారు. దీంతో అనవసరమైన బరువును అక్కడ వదిలించుకున్నట్టు తెలిపారు.
ఆ తర్వాత బేస్ క్యాంప్‌నకు వెళ్లాక మరికొంత దాన్ని అనవసరమైన భారంగా భావించారన్నారు. దీంతో లగేజీతో పాటు మరి కొందరిని కూడా వెనక్కి పంపినట్టు పూరీ చెప్పుకొచ్చారు. అలా లక్ష్య సాధనలో ముందుకు వెళ్లే క్రమంలో బరువు మోస్తూ …ఏది ఎంత వరకు అవసరమో గుర్తించడం, దాన్ని అక్కడికక్కడే వదిలేస్తూ ఎడ్మండ్ హిల్లరీ గమ్యం వైపు నడక సాగించినట్టు పూరీ వివరించారు. అంతిమంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అతనొక్కడే అధిరోహించారని డాషింగ్ డైరెక్టర్ చెప్పారు.
అలాగే జీవితమనే శిఖరాన్ని అధిరోహించేందుకు అనవసరమైన భారం ఉండకూడదనే సారాంశం, సందేశంతో పూరీ ఈ వారం సృజనాత్మకంగా విషయ పరిజ్ఞానాన్ని అందించారు. ముందుగా మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలని హితబోధ చేశారు. అయితే ఆ చెత్త మనుష్యుల రూపంలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అది గుర్తించే సరికి తన జీవితంలో సగం కాలం కరిగిపోయిందని ఆయన వాపోయారు. కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండాలని ఆయన నెటిజన్లు, అభిమానులనుద్దేశించి అన్నారు. చెత్తను ఎప్పటికప్పుడు గుర్తించి వదిలించుకోవాలని ఆయన చెప్పడం ఆలోచింపజేసేలా ఉంది.