అట్టహాసంగా ప్రకటించారు. త్వరలోనే సెట్స్ పైకి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ప్రకటించినంత ఈజీగా ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా సెట్స్ పైకి రాదనే విషయం ఇప్పుడు తేలిపోయింది. దీనికి కొంత కారణం ధనుష్ అయితే, ఇంకొంత కారణం కమ్ముల.
ఒక్కో సినిమా కోసం కమ్ముల ఎంత గ్యాప్ తీసుకుంటాడో అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని కమ్ముల కూడా అంగీకరిస్తాడు. ఇలాంటి డైరక్టర్ నుంచి వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుందని అనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. ధనుష్ తో చేయబోయే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీకి సంబంధించి కమ్ముల ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేశాడు. అది ఎప్పటికి పూర్తవుతుందనేది ఆయనకు కూడా తెలియదు.
అటు ధనుష్ పరిస్థితి మరోలా ఉంది. ఈ హీరో చకచకా సినిమాలు పూర్తిచేస్తుంటాడు. కమ్ముల స్క్రిప్ట్ తో రెడీ అయ్యే టైమ్ కు ఈ హీరో ఎంత బిజీ అయిపోతాడో చెప్పలేం. ప్రస్తుతం చేతిలో 2 సినిమాలున్నాయి. ఆ రెండూ కంప్లీట్ అయ్యేసరికి కమ్ముల రెడీ అయితే ఓకే. లేదంటే ధనుష్ మాత్రం ఆగడు.
లెక్కప్రకారం, కమ్ముల సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్వాలి ధనుష్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కమ్ముల దర్శకత్వంలో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ జరిగేలా లేదు. ఆ స్థానాన్ని వెంకీ అట్లూరి భర్తీ చేసేలా ఉన్నాడు. ఈ దర్శకుడు కమ్ముల కోసం కథతో సిద్ధంగా ఉన్నాడు.