వకీల్ సాబ్ రిలీజై చాలా రోజులైంది. నిన్ననే రెండో వారంలోకి కూడా ఎంటరైంది. మరి ఈ సినిమాకు వచ్చిన వసూళ్లు ఎంత? ఇది మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ బ్రహ్మపదార్థమే. ట్రేడ్ ఓ లెక్క చెబుతోంది. అభిమానులు మరో ఫిగర్ చెబుతున్నారు. నిర్మాత దిల్ రాజు మాత్రం నోరు మెదపడం లేదు. చివరికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ కలెక్షన్లపై మాట్లాడకుండా దాటేశాడు రాజు.
వకీల్ సాబ్ నుంచి వారం రోజుల తర్వాత ప్రెస్ మీట్ అనగానే వసూళ్ల లెక్కలతో దిల్ రాజు వస్తున్నాడని మీడియా అంచనా వేసింది. మైకులు, కెమెరాలు పట్టుకొని ఎగబడింది. కట్ చేస్తే, దిల్ రాజు తుస్సుమనిపించాడు. సినిమాను చూస్తున్న మహిళలకు మరోసారి థ్యాంక్స్ చెప్పి మమ అనిపించాడు.
అప్పటికీ కలెక్షన్ల గురించి గుచ్చిగుచ్చి అడిగితే ఒక్క ముక్కలో తేల్చిచెప్పేశాడు ఈ నిర్మాత. “నేను చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటాను. ఎంత డబ్బు పెడితే ఎంత వెనక్కి తీసుకోవాలనే విషయంపై చాలా గట్టిగా ఉంటాను. వకీల్ సాబ్ విషయంలో కూడా నా టార్గెట్ నేను వంద శాతం రీచ్ అయ్యాను.” ఇదీ వకీల్ సాబ్ వసూళ్లపై దిల్ రాజు రియాక్షన్. ఇంతకుమించి ఒక్క ముక్క కూడా ఆయన నోటి నుంచి రాలేదు.
వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉందంటే ఉంది. ఎక్కడా దీనికి ఆక్యుపెన్సీ లేదు. కరోనా కారణంగా పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో, గత్యంతరం లేక వకీల్ సాబ్ నే కొనసాగిస్తున్నారు. అంతేతప్ప వసూళ్లు మాత్రం రావట్లేదు. దిల్ రాజు మాత్రం ఎంతమంది ఆడియన్స్ కు రీచ్ అవ్వాలో అందరికీ రీచ్ అయిపోయిందని, త్వరలోనే ఓటీటీ-టీవీ రూపంలో మిగతా ప్రేక్షకులకు కూడా రీచ్ అయిపోతుందని చెబుతున్నాడు.
వకీల్ సాబ్ సినిమా వరకు తనకు డబ్బు ముఖ్యంకాదని, తన ఫేవరెట్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలనే డ్రీమ్ నెరవేరడం, అది అందరికీ రీచ్ అవ్వడం మాత్రమే తనకు ముఖ్యమంటూ ముక్తాయింపు ఇచ్చాడు రాజు. ఎక్కువమందికి రీచ్ అయిందని చెబుతున్న రాజు, వసూళ్లు మాత్రం చెప్పడం లేదు. రాబోయే రోజుల్లో థియేటర్లలో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన వచ్చినా తన సినిమాకు ఎలాంటి నష్టం లేదంటున్నాడు.