నాకు చాలా ఆఫర్లు వస్తున్నాయి – దిల్ రాజు

ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆఫర్లు ఇస్తుంటారు దిల్ రాజు. అలాంటి దిల్ రాజు తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయంటున్నారు. అయితే అవి సినిమా ఆఫర్లు కావు, పొలిటికల్ ఆఫర్లు. అవును.. తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న…

ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆఫర్లు ఇస్తుంటారు దిల్ రాజు. అలాంటి దిల్ రాజు తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయంటున్నారు. అయితే అవి సినిమా ఆఫర్లు కావు, పొలిటికల్ ఆఫర్లు. అవును.. తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై దిల్ రాజు స్పందించారు.

రాజకీయాల్లోకి రావాలంటూ తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయన్నారు దిల్ రాజు. పలు పార్టీల నుంచి, పలువురు ప్రముఖుల నుంచి తనకు పొలిటికల్ పిలుపులు వచ్చాయని స్పష్టం చేశారు.

అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ప్రకటించారు. పైపైచ్చు పాలిటిక్స్ పై ఆయన ఒకింత భయం వ్యక్తం చేశారు. సినిమా జీవితంలోనే తనను చాలా మంది విమర్శిస్తున్నారని, తనపై చాలా ట్రోలింగ్ నడుస్తోందని అన్నారు దిల్ రాజు. దాన్నే తను తట్టుకోలేకపోతున్నానని, ఇక రాజకీయాల్లోకి వస్తే ఆ విమర్శల్ని తట్టుకోవడం తన వల్ల కాదని, అందుకే రాజకీయాల్లోకి రానని ఆయన విస్పష్టంగా ప్రకటించారు.

మరోవైపు బలగం సినిమాపై కూడా స్పందించారు. బలగం సినిమాను తెలంగాణలోని కొన్ని పల్లెల్లో పరదాలు కట్టి ప్రసారం చేస్తున్న విషయం దిల్ రాజు వద్దకు చేరింది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాపీరైట్ నేరం కిందకు వస్తుందని స్పష్టం చేశారు. అయితే దీనిపై చాలా విమర్శలు చెలరేగాయి. దిల్ రాజుకు డబ్బు ఆశ పట్టుకుందని, బలగం సినిమాను ధియేటర్లలోనే చూడాలని ఆయన కోరుకుంటున్నారని చాలా కథనాలు వచ్చాయి. వీటిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.

బలగం సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో కు ఓటీటీకి ఇచ్చారు. ఆ సంస్థ నుంచి దిల్ రాజుకు మెయిల్ వచ్చింది. దానికి ప్రతిస్పందనగా ఇలా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని, అంతకుమించి బలగం సినిమా ప్రసారాల్ని అడ్డుకునే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదన్నారు దిల్ రాజు.

ఎవరికైనా బలగం సినిమా చూడాలనిపిస్తే, తనకు సమాచారం అందిస్తే.. దగ్గర్లోని థియేటర్ లో తనే ఉచితంగా సినిమాను ప్రదర్శిస్తానని, మరింత మందికి తన సినిమాను చేరువ చేస్తానని అంటున్నారు దిల్ రాజు. తన సినిమా చూసి విచ్ఛిన్నమైన కుటుంబాల్లో మార్పు వస్తే, తన జన్మ ధన్యం అవుతుందన్నారు రాజు.