cloudfront

Advertisement


Home > Movies - Movie News

తెరవెనక తతంగాన్ని బయటపెట్టిన బాల

తెరవెనక తతంగాన్ని బయటపెట్టిన బాల

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ వర్మ ప్రాజెక్టు నుంచి బాల తప్పుకున్నాడు. హీరో విక్రమ్, దర్శకుడు బాల మధ్య వచ్చిన అభిప్రాయబేధాల వల్లనే ఈ ప్రాజెక్టు నుంచి బాల తప్పుకోవాల్సి వచ్చిందంటూ వార్తలు వచ్చాయి. అదే నిజమంటూ పరోక్షంగా వెల్లడించాడు బాల.

ఈ సినిమా ఔట్ పుట్, నిర్మాతలకు నచ్చలేదంటూ ప్రెస్ నోట్ బయటకు వచ్చినప్పటికీ.. జనవరి 22న విక్రమ్ కు తనకు మధ్య జరిగిన చర్చలు విఫలం అవ్వడం వల్లనే ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్టు బాల ప్రకటించాడు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసిన బాల, ప్రెస్ నోట్ తో పాటు ఏకంగా తెరవెనక కుదిరిన అగ్రిమెంట్ పేపర్స్ ప్రతులను కూడా బయటపెట్టడం విశేషం.

వర్మ సినిమాలో మార్పులు చేయాల్సిందిగా విక్రమ్ తో పాటు నిర్మాతలు కోరారని, దానికి తను అంగీకరించలేదని, ఫలితంగా ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్టు తెలిపాడు బాల. ఇకపై వర్మ సినిమాకు సంబంధించి తన పేరు ఎక్కడా వాడకూడదనే కండిషన్ మీద సినిమాలో మార్పుచేర్పులకు అంగీకరిస్తూ అగ్రిమెంట్ జరిగిన విషయాన్ని బాల బయటపెట్టాడు.

విక్రమ్ కొడుకు ధృవ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇకపై ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని, కేవలం ధృవ్ ను దృష్టిలో పెట్టుకొని బలవంతంగా ఇలా మీడియా ముందుకు రావాల్సి వచ్చిందంటూ బాల పేర్కొన్నాడు.

ప్రస్తుతం బాల స్థానంలో మరో దర్శకుడి కోసం నిర్మాతలు అన్వేషిస్తున్నారు. అన్నీ కుదిరితే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఫ్రెష్ గా వర్మ సినిమాను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. అటు హీరోయిన్ ను కూడా మార్చే దిశగా కసరత్తు సాగుతోంది. అన్నీ పూర్తిచేసి జూన్ లో వర్మ కొత్త కాపీని తీసుకొస్తామంటున్నారు మేకర్స్.