సాధారణంగా కొత్త హీరో, హీరోయిన్, డైరక్టర్ లను పరిచయం చేసినపుడు, వాళ్లు ప్రామిసింగ్ వున్నారు, పైకి వస్తారు అనుకుంటే నిర్మాణ సంస్థలు లేదా దర్శకులు లాక్ చేస్తుంటారు. తరువాత సినిమా తమకే చేయాలి. లేదంటే పెనాల్టీ చెల్లించాలి. ఇలా రకరకాల కండిషన్లు ముందే అగ్రిమెంట్ లో రాసుకుంటారు.
ఇది ఒక్కోసారి వారి కెరీర్ కు ప్లస్ అవుతుంటుంది. లేదంటే దారుణంగా మైనస్ అవుతుంటుంది. కొంత మంది పెనాల్టీ చెల్లించి బయటపడుతుంటారు. పెనాల్టీ అంటే తరువాత చేసే సినిమా రెమ్యూనిరేషన్ లో సగం తాము అగ్రిమెంట్ చేసుకున్నవారికి ఇచ్చేయడం ఇలా అన్నమాట.
ఇప్పుడు ఓ ప్రామిసింగ్ హీరోయిన్ ఇలాగే ఇరుక్కుపోయింది. అఖిల్ అక్కినేని హీరోగా అనిల్ సుంకర నిర్మిస్తున్న ఏజెంట్ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. తెలుగులో ఈమెకు ఇదే మొదటి సినిమా. ఇప్పటికే ఆమె ఫోటోలు, ఇన్ స్టా పోస్ట్ లు బాగానే చలామణీ అయ్యాయి. దాంతో ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవాలనుకునే వారు రెడీగా వున్నారు.
కానీ సమస్య ఏమిటంటే దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెను లాక్ చేసారని తెలుస్తోంది. ఏజెంట్ విడుదల అయ్యే వరకో, లేదా విడుదల అయిన తరువాత సినిమాను కూడానో ఆయనకే చేయాలనే అగ్రిమెంట్ ఏదో ఉందని వినిపిస్తోంది.
తొలి సినిమాకు ఆమె ముఫై లక్షల మేరకు పారితోషికం తీసుకుంది. మలి సినిమాకు కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీగా వున్నారు. కానీ అక్కడ పడిన లాక్ అడ్డం పడుతోంది. దీని మీద డిస్కషన్లు నడుస్తున్నాయి. అవి ఫలిస్తే ముందుగా ఓ పెద్ద బ్యానర్ లో ఓ క్రేజీ ప్రాజెక్టులో సాక్షి జాయిన్ అవుతుంది.