డిస్ట్రబింగ్, బ్రిలియంట్, గొప్ప ఇమాజినేషన్, రియాలిస్టిక్… ఇలాంటి ఎన్నో ఉపమానాలను వాడొచ్చు 'ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్' సినిమా గురించి చెప్పడానికి. ఈ సినిమా అందరి కప్ ఆఫ్ టీ కాదు. ప్రత్యేకించి బిగినింగ్ లో వచ్చే కొన్ని సీన్లను వీక్షించాకా ఇక లోపలకు వెళ్లడానికి మనసొప్పుకోవాలి!
సెక్స్- వయొలెన్స్ విషయంలో ఈ సినిమా హార్డ్ హిట్టింగ్. ఆ సీన్లను చూశాకా, ముందు ముందు ఇంకా ఎలాంటి సీన్లుంటాయో అనే భయమేసి తొలి 15 నిమిషాల్లోనే ఆగిపోనూవచ్చు. అయితే వాస్తవానికి ఒక సగటు తెలుగు సినిమాలో చూపించేంత హింసలో పావు వంతు హింస కూడా ఈ సినిమాలో ఉండదు.
తెలుగు సినిమాల్లో విలన్లు ఎన్నో రేపులు చేస్తూ ఉంటారు, హీరో వందల మంది విలన్లను చితక్కొడుతూ ఉంటాడు. కేవలం తెలుగు సినిమాలే కాదు, ఏ భాష సినిమాలు అయినా సెక్స్ కూ వయొలెన్స్ కు అతీతమైనవి కావు. ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్ కూడా అలాంటి సినిమాల్లో ఒకటే అయినా.. ఈ సినిమాల్లో ఆ సీన్లను చిత్రీకరించిన ఇంపాక్ట్.. హయ్యెస్ట్ డిగ్రీలో ఉంటుంది!
ఎన్నో సినిమాల్లో చూపించే హింసాత్మక సన్నివేశాలను కూడా వాస్తవికంగా తెరకెక్కిస్తే అవి అచ్చం ఈ సినిమాలో చూపినట్టుగా ఉంటాయనేంత స్థాయిలో ముద్ర వేస్తుందిది. అయితే ఇది పూర్తిగా ఇమాజినేటివ్ సినిమా. ఊహాత్మక కథ. భవిష్యత్తులో ఎప్పుడో ఇలా జరగొచ్చు, మనుషుల్లో కొందరు ఇలా మారొచ్చు అనే అంచనాల ఆధారంగా రాసిన ఒక నవల 'ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్'. ఆ నవల ఆధారంగా ఒళ్లు గగుర్పొడిచే రీతిన ఈ సినిమాను చిత్రీకరించాడు దర్శకుడు స్టాన్లీ క్యూబ్రిక్.
చాలా సినిమాలను రియాలిస్టిక్ సినిమాలంటూ విమర్శకులు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. వాస్తవికంగా చిత్రీకరించారని చెబుతుంటారు, అయితే ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్ చూశాకా, హింసకు సంబంధించి వాస్తవిక చిత్రీకరణ అంటే ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అసలు హింస అంటేనే అదెలా ఉంటుందో అర్థం అవుతుంది!
అనునిత్యం పత్రికల్లో చదివే హింసాత్మక ఘటనలు, హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు.. అవి ఎంత భయంకరంగా ఉంటాయో, అవి ఊరికే చదివి పక్కన పడేసేవో, సంచలనం చేసేవో కాదు.. వాటిని అనుభవించిన వారి ధైన్య స్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టే సినిమా ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్. స్థూలంగా వాస్తవిక హింసకు సీన్ల రూపంలో నిర్వచనాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఆ సన్నివేశాలకు ఒక అర్థవంతమైన, ఊహాజనితమైన కథను అల్లుకున్నారు. దీంతో ఇదో క్లాసిక్ అయ్యింది.
బ్రిటన్ వేదికగా భవిష్యత్తు కాలంలో ఇలాంటి పరిస్థితులు రావొచ్చు అని దీని నవలాకారుడి ఉద్దేశం. 1969 లో ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్ నవల వచ్చింది. 1971లో దీన్ని సినిమాగా మలిచారు. భవిష్యత్ తరాల్లో హింసాత్మక ప్రవృత్తి పెరగొచ్చు అనే అంచనాలతో నవల రచయిత తన అక్షరాలతో పాఠకులను ఆకట్టుకోగా, ఆ అక్షరాల ఇంపాక్ట్ ను విజువల్స్ తో మరింతగా పెంచారు ఈ సినిమాతో. ఊహాత్మక కథకు సంబంధించి సెట్స్ ను అత్యంత వైవిధ్యమైన పంథాలో వేశారు.
సెట్స్ కు సంబంధించిన కలర్ కాంబినేషన్స్ ఈ సినిమా మూడ్ ను అనేక రెట్లు పెంచాయి. తెలుగు దర్శకుడు రవిబాబు తన సినిమాల్లో చూపించే సెట్స్, డిజైనింగ్ వెనుక చాలా వరకూ క్లాక్ వర్క్ ఆరెంజ్ ప్రభావమే ఉంటుంది. ఈ సినిమాను సెట్స్ డిజైనింగ్ ను అనుకరించే సాహసం రవిబాబు తన తొలి సినిమాలో బాగా చేశాడు. అయితే క్లాక్ వర్క్ ఆరెంజ్ మాత్రం ప్రతి ఫ్రేమ్ తోనూ ఒక వైవిధ్యతను కొనసాగిస్తూ సాగుతుంది. ఆ తర్వాత ఎవరేం చేసినా జస్ట్ కాపీ కొట్టడమే.
కథ విషయానికి వస్తే.. ఫలానా సంవత్సరంలో అంటూ చెప్పని బ్రిటన్ భవిష్యత్ కాలంలోని ఒక నలుగురు యువకులు. ఆ గ్రూప్ కు నాయకుడు అలెక్స్ డెలార్జ్. స్కూల్ కో, కాలేజ్ కో వెళ్లి చదువుకునే వయసు వారే. అయితే సాయంత్రం అయితే తమ రూపురేఖలు మార్చుకునే గెటప్ వేసుకుని.. నిరాయుధులు, ఒంటరిగా ఉన్న వారి పై దాడులకు దిగుతూ ఉంటారు. రోడ్ సైడ్ పడుకుని ఉన్న బిచ్చగాళ్లు, ఒంటరి మహిళలు, వృద్ధులు వీరి టార్గెట్. విశృంఖలమైన రీతిలో వారిపై హింసకు పాల్పడి శాడిస్టిక్ ప్లజర్ ను పొందుతుంటారు.
అనునిత్యం వారికి ఇదే పని. ఈ బ్యాచ్ ఒక యువతిని గ్యాంప్ రేప్ చేస్తుంది. అనేక సినిమాల్లో చూపించే రేప్ సీన్లూ, పత్రికల్లో మనం చదివే అత్యాచార వార్తలు.. ఇవన్నీ ఇదే తరహాలో జరిగి ఉంటాయనే ఊహే భయాన్ని కలిగిస్తుంది. ఆ స్థాయి ఇంపాక్ట్ తో హింసాత్మక సన్నివేశాలన్నింటినీ చిత్రీకరించారు. తమది ఆల్ట్రా వయొలెన్స్ అంటూ అలెక్స్ చెప్పుకుంటాడు.
తల్లిదండ్రులిద్దరూ తమ తమ ఉద్యోగాలకు వెళ్లిపోగా.. పగలంతా ఇంట్లో దొర్లుతూ, దొరికిన అమ్మాయిలతో సెక్స్ చేస్తూ, సాయంత్రానికి చిత్రమైన గెటప్ తో రోడ్ల మీదకు పడి దొరికిన వారిని దొరికినట్టుగా ఏడిపించడం వీరి దినచర్యగా మారి ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని అత్యాచారాలను చేస్తారు. ఒక రచయిత ఇంటి తలుపులను కొడతారు. వాళ్లు డోర్ తీయకపోవడంతో బయట యాక్సిడెంట్ జరిగిందని, తాము అసహాయులమని డోర్ తీయమంటూ ప్రాధేయపడతారు. వీరి చెప్పింది నమ్మి డోర్ తీసిన రచయిత భార్యపై దారుణంగా అత్యాచారానికి ఒడిగడతారు.
ఆమె చనిపోతుంది. ఇలాంటి బ్యాచ్ ఒకటి తిరుగుతోందని పత్రికలో వార్తలు వస్తాయి. అయితే వీరు దొరకరు. అనూహ్యంగా ఈ గ్యాంగ్ లో ముసలం పుడుతుంది. తను నాయకుడిని అంటూ తన మాటే చెల్లాలని అలెక్స్ వారిని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత వీరు మరో ఒంటరి మహిళపై ఆమె ఇంట్లోనే అత్యాచారానికి ఒడిగట్టే సమయంలో.. గ్యాంగ్ లోని సభ్యులు అలెక్స్ ను అక్కడే ఇరుక్కునేలా చేస్తారు. ఆమె చనిపోతుంది.
అలెక్స్ ను అరెస్టు చేస్తారు. గ్యాంగ్ సభ్యులు తప్పించుకుంటారు. అలెక్స్ కు శిక్ష పడుతుంది. అయితే ఖైదీల్లో పరివర్తన కోసం వారిని ఎక్కువ సంవత్సరాలు జైల్లో ఉంచవలసిన అవసరం లేదని, వారికి సైంటిఫిక్ గా చికిత్స చేసి వారిని మంచి వాళ్లుగా బయటకు వదలొచ్చని బ్రిటన్ లో ఒక మంత్రి ప్రతిపాదిస్తాడు. దీని వల్ల సమాజం మొత్తం మంచిగా మారిపోతుందంటాడు. ఆ ప్రయోగాత్మక చికిత్సను ముందుగా అలెక్స్ మీదే చేస్తారు. అత్యంత భయనక సినిమాలను, సన్నివేశాలను అతడికి కన్నార్పకుండా చూపించి అతడు హింస అంటే భయపడేలా మార్చేస్తారు. ఆ చికిత్స విజయవంతం అవుతుంది. అప్పుడు అతడిని మళ్లీ సమాజం మీద వదులుతారు.
అల్ట్రా వయెలెన్స్ అంటూ అందరినీ హింసించిన అలెక్స్ నిరాయుధుడిగా, హింసకు భయపడే వాడిగా రోడ్ల మీదకు వస్తాడు. ముందుగా గతంలో ఇతడి చేతిలో హింసకు గురైన బిచ్చగాడికి అలెక్స్ దొరకుతాడు. బిచ్చగాడు తన రీవేంజ్ మొత్తం తీర్చుకోగా, అక్కడకు పోలీసులు వస్తారు. వారెవరో కాదు గతంలో అలెక్స్ అనుచరులు! వాళ్లు ఇతడిని మరింత హింసించి ఊరవతల పారేసి వస్తారు. తీవ్రగాయాలతో ఒక ఇంటి వద్దకు అలెక్స్ వెళ్తాడు.
ఆ ఇల్లు మరెవరిదో కాదు..గతంలో అలెక్స్ అత్యాచారం చేసి, చంపిన రచయిత భార్యది. రచయిత ఇంకా బతికే ఉంటాడు. ఇతడెవరో తెలియక ముందు చికిత్స అందించిన రచయిత, ఆ తర్వాత ఇతడి గురించి తెలిసి.. తనకు తెలిసిన వారితో ఇంకో సైంటిఫిక్ ప్రయోగానికి దిగుతాడు. అలెక్స్ కు ట్రీట్ మెంట్ ఇచ్చిన రాజకీయ నేత అంటే ఆ రచయితకు పడదు. అటు రాజకీయంగా అతడిని దెబ్బతీయడానికి, అలెక్స్ పై ప్రతీకారానికి.. మ్యూజిక్ ట్రీట్ మెంట్ ఒకటి చేయిస్తాడు.
ఆ మ్యూజిక్ వింటూ తట్టుకోలేక అలెక్స్ ఇంటి మీద నుంచి దూకుతాడు. ఆసుపత్రికి చేర్చగా.. త్రుటిలో ప్రాణాపాయం తప్పుతుంది. జైల్లో అలెక్స్ కు ట్రీట్ మెంట్ ఇప్పించిన పొలిటిషీయన్ అక్కడ మళ్లీ అలెక్స్ కుఅండగా నిలుస్తాడు. అలెక్స్ కు నయం అయ్యిందని, సమాజం అతడిని ఆదరించాలంటాడు. తన ఎన్నికల ప్రచారానికి అలెక్స్ ను వాడుకునే ఆలోచన చేస్తాడు. అయితే అలెక్స్ మనసులో మళ్లీ హింసాత్మక ఆలోచనలు వస్తుండగా.. సినిమా ముగుస్తుంది. అతడు మళ్లీ మొదటికి వచ్చాడని స్పష్టం అవుతుంది.
విడుదల అయిన రోజుల్లో ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్ రేపిన దుమారం అంతా ఇంతా కాదు. అనేక యూరోపియన్ దేశాలు దీన్ని నిషేధించాయి. తీవ్రమైన హింసను ప్రేరేపించేదిగా దీన్ని అభివర్ణిస్తూ పలు దేశాలు దీన్ని విడుదల చేయడానికే ఒప్పుకోలేదు! అమెరికాలోనే పలు కట్స్ చెప్పారు. ఆ పై బ్రిటన్ లో అయితే థియేటర్ల లో విడుదలయ్యాకా ఈ సినిమాను ఉపసంహరించారు. ఈ సినిమాను చూసి కొందరు యువత కాపీ క్యాట్ వయొలెన్స్ కు పాల్పడుతున్నారనే ఫిర్యాదులతో ఈ సినిమాను నిషేధించారు.
చాలా కాలం పాటు సాగిన లీగల్ బ్యాటిల్ అనంతరం ఈ సినిమా కు నిషేధాజ్ఞలు తొలిగాయక్కడ. ఇప్పటికీ అనేక దేశాల్లో ఈ సినిమాపై నిషేధం ఉన్నట్టుంది. ఆస్కార్ తో సహా అనేక అవార్డులకు వివిధ విభాగాల్లో నామినేట్ అయ్యింది. అయితే గెలిచిన అవార్డులు తక్కువే. అవార్డులను గెలవకపోయినా.. ఊహాజనిత కథాంశాన్ని ప్రభావాత్మకంగా తెరకెక్కించిన సినిమాగా ఏ క్లాక్ వర్క్ అరెంజ్ ఒక మాస్టర్ పీస్ గా నిలుస్తోంది. ప్రత్యేకించి అలెక్స్ పాత్రను పోషించిన మాల్కం మెకొడోవల్.. తన బీభత్సమైన నటనతో కల్ట్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
ఇంతకీ ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్ అంటే టైటిల్ కూ ఈ సినిమాకూ ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కథకు సంబంధించిన నవలలో అత్యాచారానికి గురయ్యే మహిళ భర్త ఒక రచయిత ఉంటాడు. సినిమాలో కూడా ఆ పాత్ర ఉంటుంది. నవల్లో అలెక్స్ తమ ఇంటి తలుపు తట్టేటప్పుడు ఆ రచయిత 'ఏ క్లాక్ వర్క్ ఆరెంజ్' పేరుతో ఒక నవల రాస్తుంటాడు. కథలోని రచయిత రాసే నవల పేరునే అసలు రచయిత దీనికి టైటిల్ గా మార్చాడు. సినిమాకూ అదే టైటిల్ ఫిక్స్ అయ్యింది. అయితే సినిమాలో ఈ టైటిల్ ప్రస్తావన ఎక్కడా ఉండదు!
-జీవన్ రెడ్డి.బి