cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఈసారి ఏప్రిల్ ఫూల్ చేయబోతున్నాడా..?

ఈసారి ఏప్రిల్ ఫూల్ చేయబోతున్నాడా..?

ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు తయారైంది వెంకీ-తేజ సినిమా పరిస్థితి. సినిమాకు కొబ్బరికాయ కొట్టారు కానీ, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఫలానా రోజు షూటింగ్ అంటూ డేట్స్ అయితే బయటకొస్తున్నాయి కానీ చెప్పిన తేదీకి సినిమా మొదలుకాలేదు. ఇప్పుడేమో మార్చి 26లేదా ఏప్రిల్ 1అంటూ మరో తేదీ బయటకొచ్చింది.

అసలు యూనిట్ లోపల ఏం జరుగుతోందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కొందరేమో కొత్త నటీనటులకు ట్రయినింగ్ జరుగుతోందంటున్నారు. మరికొందరేమో.. ఇప్పటికే వెంకీ ఓకే చేసిన స్క్రీన్ ప్లేలో మళ్లీ మార్పులు చేస్తున్నారని అంటున్నారు. ఈ గ్యాప్ లో సందట్లో సడేమియాలా వెంకీపై షూట్ చేసిన స్టిల్ బయటకొచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఫస్ట్ లుక్ కింద విడుదల చేయాలనుకున్న ఆ స్టిల్స్, ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాకుండానే లీక్ అయింది.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ల ఎంట్రీపై కూడా అనుమానాలు ఎక్కువయ్యాయి. పెళ్లికి రెడీ అవుతున్న శ్రియ ఈ మూవీలో నటించేది అనుమానమే అంటూ పుకార్లు వస్తున్నాయి. మరోవైపు సెకెండ్ హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్న ఈషా రెబ్బతో కూడా చర్చలు కొలిక్కిరాలేదట.

కొసమెరుపేంటంటే.. ఈమధ్యే కిరాక్ పార్టీ రిలీజ్ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు నిర్మాత అనిల్ సుంకర. తేజ-వెంకీ సినిమాకు సురేష్ బాబుతో పాటు ఇతడు కూడా నిర్మాత. మూవీ అప్ డేట్స్ పై ప్రశ్నిస్తే.. అది తప్ప ఇంకేదైనా మాట్లాడుకుందామంటూ సుంకర తప్పించుకున్నాడు.