cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎంట‌ర్టైనింగ్ మిస్ట‌రీ.. నైవ్స్ ఔట్!

ఎంట‌ర్టైనింగ్ మిస్ట‌రీ.. నైవ్స్ ఔట్!

ఏదైనా మ‌ర్డ‌ర్ చుట్టూ అల్లుకున్న‌ మిస్ట‌రీ సినిమాల విష‌యంలో ఇదొక థ్రిల్లింగ్, ఎంట‌ర్ టైనింగ్ ఫార్ములా. మిస్ట‌రీని చేధించే ప్ర‌క్రియ తిరుగులేని వినోదం. అయితే.. ఇది మంచి మాసాలా కూర వండ‌టం లాంటిది. అన్ని దినుసులూ త‌గుపాళ్ల‌లో ప‌డాలి. మోతాదుల్లో తేడా వ‌చ్చిందంటే..  రుచిలో తేడా వ‌స్తుంది. అలాగ‌ని పాత రుచిలోనే ఉంటే వినిపించేవి పెద‌వి విరుపులే. కొత్త రుచి ఉండాలి, కానీ.. దినుస‌ల‌న్నీ స‌రిగ్గా కుద‌రాలి! 

అందుకే.. ఈ త‌ర‌హా సినిమాలు తెర‌కెక్కించే ప్ర‌క్రియ కూడా చాలా క‌ష్ట‌మైనది. వీటితో మూవీ మేక‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకోవ‌చ్చో, అందుకోసం లైన్ అల్లుకునే ప్ర‌క్రియ అంత క‌ష్ట‌మైన‌ది. క‌థ చుట్టూ అల్లుకునే ఫోల్డ‌ర్లు.. ఒక ప‌జిల్ ను క్రియేట్ చేయ‌డం, ఆ పై.. ఒక్కో లేయ‌ర్ నూ తొల‌గిస్తూ వెళ్ల‌డం.. స్క్రీన్ ప్లే ప‌రంగా ప్ర‌తి చోటా ఫిట్ గా ఉండేలా చూసుకోవ‌డం.. ఇదంతా క‌త్తిమీద సాము! అది విజ‌యవంతంగా సాగే సంద‌ర్భాలు అరుదుగానే ఉంటాయి. అలాంటి అరుదైన, విజ‌య‌వంత‌మైన క‌త్తిమీద సామే.. నైవ్స్ ఔట్!

చాలా పాత‌కాల‌పు స్టోరీ లైన్. అగాథాక్రిస్టీ న‌వ‌ల్స్ త‌ర‌హాలో సాగే క‌థాంశం. ప్ర‌తి పాత్రా అనుమానాస్ప‌దంగానే క‌దులుతుంది. అన్నీ అనుమానానికి గురి చేస్తాయి. క‌థ‌లోని ప్ర‌తి పాత్ర మీదా ప్రేక్ష‌కుడికి అనుమానం రేకెత్తించ‌డం, చివ‌ర్లో బోలెడ‌న్ని ట్విస్ట‌ల‌తో స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌డం అగాథాక్రిస్టీ థ్రిల్లింగ్ న‌వ‌ల‌ల శైలి. అచ్చంగా అదే శైలిని ఫాలో అయిన సినిమా ఇది. రాత‌ల్లో స‌స్పెన్స్ మెయింటెయిన్ చేయ‌డం క‌న్నా తెర మీద మ‌రింత క‌ష్టం కావొచ్చు. ఈ ర‌కంగా చూస్తే.. ఇంత ఎంట‌ర్ టైనింగ్ స్క్రిప్ట్ గ‌త కొన్నేళ్ల‌లో ఏ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కూడా వ‌చ్చి ఉండ‌దు. వెరీ మోడ్ర‌న్ మిస్టీరియ‌స్ క్లాసిక్ గా నైవ్స్ ఔట్ ను పేర్కొన‌వ‌చ్చు.

ఈ చిత్ర క‌థాంశం ప‌ర్వ‌తాలంత‌ పాత‌ది. కానీ చెప్ప‌డంలోనే కొత్త‌ద‌నం అంతా. ఒక ధ‌నికుడు అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో మ‌ర‌ణించి ఉంటాడు. అంత‌కు ముందు రోజు రాత్రి అత‌డి ఇంట్లో అత‌డి బ‌ర్త్ డే పార్టీ. దానిక‌ని అత‌డి వార‌సులంతా వ‌చ్చి ఉంటారు. మామూలుగా అయితే ఆ ముస‌లాయ‌న యోగ క్షేమాల‌ను వారు అంత‌గా ప‌ట్టించుకోరు. అత‌డి ఆస్తుల మీద మాత్రం వార‌సులంద‌రికీ యావే. అయితే వారి వ్య‌క్తిత్వాలు ముసలా‌య‌న‌కు అస‌లు న‌చ్చ‌వు. త‌న వార‌సులంద‌రి బ‌ల‌హీన‌త‌ల‌న్నీ ఆయ‌న‌కు తెలుసు. త‌న కూతురుని అల్లుడు మోసం చేస్తుంటాడు, త‌న కోడ‌లు ఇంటి దొంగ‌.. అలా వారి చీక‌టిమాటు వ్య‌వ‌హారాల‌న్నీ ముస‌లాయ‌న‌కు తెలుసు. పార్టీకి ముందే.. ప్ర‌వ‌ర్త‌న‌లు మార్చుకోవాల‌ని లేక‌పోతే.. అంద‌రి గుట్టూ బ‌య‌ట‌పెడ‌తానంటూ పెద్దాయ‌న హెచ్చ‌రించి ఉంటాడు.

తెల్లారేస‌రికి ఆయ‌నే అనుమానాస్ప‌ద ప‌రిస్థితుల్లో మ‌ర‌ణిస్తాడు. ఆయ‌న మ‌ర‌ణించి ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తే.. అది ఆత్మ‌హ‌త్య అని స్ప‌ష్టం అవుతుంది. అయినా ఇంకా అనుమానాలు. ఆయ‌న‌కు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. కాబ‌ట్టి.. హ‌త్య అయిఉండొచ్చ‌ని డౌట్. స్థానిక పోలీసులు విచార‌ణ చేప‌డ‌తారు. అయితే ఇంట్లో వాళ్లే ఒక‌రు ప్రైవేట్ డిటెక్టివ్ కు ర‌హ‌స్యంగా స‌మాచారం ఇస్తారు. పోలీసులు దీన్ని ఆత్మ‌హ‌త్య‌గా తేల్చేస్తార‌ని.. అయితే అస‌లు క‌థ ఏమిటో తేల్చాలంటూ హీరో క‌మ్ డిటెక్టివ్ కు ఉప్పందిస్తారు. అయితే త‌నకు లెట‌ర్ రాసి.. ఈ కేసులోకి త‌ల‌దూర్చ‌మ‌ని కోరింది ఎవ‌రో డిటెక్టివ్ కు కూడా తెలీదు!

ఈ ప‌రిస్థితుల నుంచి అప‌రాధ ప‌రిశోధ‌న మొద‌ల‌వుతుంది. బోలెడ‌న్ని మ‌లుపులు. చ‌నిపోయిన వ్య‌క్తి వార‌సుల బ‌ల‌హీన‌త‌లు.. వారు ఎందుకు ఆయ‌న‌ను హ‌త్య చేసి ఉండే అవ‌కాశం ఉంది? అనే కోణాల్లో సాగే విచార‌ణ అత్యంత ఆస‌క్తిదాయ‌కంగా ఉంటుంది. విచార‌ణ పూర్త‌య్యే వ‌ర‌కూ అంతా ఇంట్లోనే ఉండాలంటూ.. విచార‌ణాధికారులు స్ప‌ష్టం చేస్తారు. కుటుంబ స‌భ్యులు వృద్ధుడుని నిర్ల‌క్ష్యం చేసిన ప‌రిస్థితుల్లో అక్క‌డే స్థానికంగా ఉంటూ ఒక అమ్మాయి ఆయ‌న‌కు మందులివ్వ‌డం, ఇంజెక్ష‌న్లు చేయ‌డం వంటి ప‌నులు చేసి పెడుతూ ఉంటుంది. 

క‌థ‌లో రెండో ప్ర‌ధాన పాత్ర అది. ఇంట్లో వాళ్ల వ్య‌క్తిత్వాలు అన్నీ ఆమెకు తెలుసు. వృద్ధుడు చ‌నిపోయే ముందు రాత్రి అత‌డిని చివ‌రి సారి చూసింది కూడా ఆమె! త‌న వాళ్ల గురించి త‌న బాధ‌ల‌న్నింటినీ ఆ చిన్న‌మ్మాయికి చెప్పుకుని ఉంటాడు మ‌ర‌ణించిన వృద్ధుడు. ఆ హ‌త్యానేరంలో కుటుంబ స‌భ్యుల అనుమానాలు ఆమె మీద కూడా వ్య‌క్తం అవుతాయి. డిటెక్టివ్ వ‌ద్ద కుటుంబ స‌భ్యులు ఒకరిపై మ‌రొక‌రు అనుమానాలు వ్య‌క్తం చేసే వైనం, ఆధారాలు ఒక్కొక్క‌టిగా మాయం అయ్యే సీన్లు... థ్రిల్లింగ్ గా సాగుతాయి.

వృద్ధుడు ఎలా చ‌నిపోయాడో క‌చ్చితంగా తెలిసింది ఆయ‌న‌కు సేవ‌లు చేసిన అమ్మాయికే. ఆ వివ‌రాల‌ను త‌ను చెబితే.. ముందుగా బుక్ అయ్యేది కూడా త‌నే. కానీ వృద్ధుడిని చంప‌డానికి సూత్ర‌ధారి ఆమె కాదు. వ్యూహాత్మ‌కంగా వృద్ధుడి మ‌ర‌ణానికి ఆమె కార‌ణం అయ్యేలా కుటుంబ స‌భ్యుడే ఒక‌డు ప‌క్కా ప్లాన్ వేసి ఉంటాడు. ఆపై ఆ యువ‌తిని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.

మ‌రోవైపు వృద్ధుడు రాసి వెళ్లిన వీలునామా బ‌య‌ట‌కు తీస్తే.. తన ఆస్తికి ఆ యువ‌తినే వార‌సురాలిగా చేసి ఉంటాడు! త‌న‌ను అంత‌గా న‌మ్మిన, అభిమానించిన‌ ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి త‌నే కార‌ణం కావ‌డం ఆ యువ‌తిని క‌లిచి వేస్తుంది. ఈ ట్విస్ట్ వెనుక మ‌రో ట్విస్ట్ ను పేర్చి ఉంటాడు ద‌ర్శ‌కుడు. అంతిమంగా.. ఒక ఆత్మ‌హ‌త్య‌, అనేక మంది హంత‌కుల‌ను తెర‌పైకి తీసుకొస్తుంది! హత్య చేయాల‌ని బ‌లంగా ఫిక్స్ అయిన కిరాత‌కుడు త‌న ప్లాన్ ల‌తో.. ఆత్మ‌హ‌త్య కూడా చేయించ‌గ‌ల‌డనే ట్విస్ట్ తో సినిమా ముగుస్తుంది. ‌

ఈ మిస్ట‌రీ సినిమా చూస్తున్నంత సేపూ ఆద్యంతం గుర్తుండిపోయేది డేనియ‌ల్ క్రేగ్. ఈ జేమ్స్ బాండ్ న‌టుడు.. ఒంటి చేత్తో మొత్తం క‌థ‌ను న‌డిపిస్తాడు. అప‌రాధ ప‌రిశోధ‌న‌లో త‌నకు ఎలాంటి క్లూస్ దొర‌క‌న‌ప్పుడు, హంత‌కుడే ఈ డిటెక్టివ్ తో ఆడుకునే సీన్ల‌లో క్రేగ్ న‌ట‌న‌.. ముచ్చ‌ట‌గా ఉంటుంది. య‌థారీతిన ప్రేక్ష‌కుడు అనుమానించే వాళ్లెవ్వ‌రూ హంత‌కులు కారు. కొంత ప్రిడిక్ట‌బుల్ గానే ఉన్నా.. ట్విస్ట‌ల‌తో ప‌క్కా ఎంట‌ర్ టైనింగ్ గా నిలుస్తుంది నైవ్స్ ఔట్.

ఒక మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ప్లాట్ చుట్టూ ప్రేక్ష‌కుడిని ప్ర‌ద‌క్షిణ‌లు చేయిస్తుంది ఈ నెరేష‌న్. క‌థాంశం చాలా పాత‌కాలానిదే అయినా, చెప్పే ప‌ద్ధ‌తిలో మాత్రం ఎక్క‌డా త‌ర‌చుద‌నం తొంగిచూడ‌దు. అన్ ఎక్స్ పెక్టెడ్ టైమ్స్ లో కీల‌క‌మైన ట్విస్ట్ ల‌ను రివీల్ చేసే తీరు ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంటుంది. సినిమా ఆసాంతం ప్రేక్ష‌కుడికి ఒక బ్లాస్టింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది. జ‌రిగిన ఘ‌ట‌న‌ల విష‌యంలో ప్ర‌తి పాత్ర‌కూ మోటివ్ ఉంటుంది.  

మర్డ‌ర్ మిస్ట‌రీనే అయినా ఓ లెవ‌ల్ సీరియ‌స్ నెస్ కాకుండా, లైట్ గా సాగ‌డం మ‌రో ప్ర‌త్యేక‌త‌. బోలెడ‌న్ని స‌న్నివేశాలు హ్యూమ‌ర‌స్ గా ఉంటాయి. డిటెక్టివ్ గా క్రేగ్ బోలెడంత హ్యూమ‌ర్ ను పండిస్తాడు. పొడి పొడి ప‌దాల‌తో అత‌డి పాత్ర స్పందించే తీరు న‌వ్వులు విచ్చుకునేలా చేస్తుంది. వాటికి న‌వ్వుకుంటూ మన సెన్సాఫ్ హ్యూమ‌ర్ కు మ‌న‌మే మెచ్చుకుంటాం! దాదాపు రెండు గంట‌ల ర‌న్ టైమ్ తో ఎక్క‌డా డ‌ల్ మొమెంట్స్ లేకుండా.. ఒక థ్రిల్లింగ్ రైడ్ ను ఇస్తుంది నైవ్స్ ఔట్!

-జీవ‌న్ రెడ్డి.బి

కుప్ప‌మా ?.. కుప్పిగంతులా ?

సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో న‌టించా

 


×