ఫిబ్రవరి సినిమాలు.. ఈసారి కూడా నితినే!

గతేడాది ఫిబ్రవరిలో హిట్టయిన ఒకే ఒక్క సినిమా భీష్మ. ఆ నెలలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అవ్వగా.. జాను సినిమా ఫ్లాప్ అయింది. అలా ఫిబ్రవరిలో ఒకే ఒక్కడుగా మిగిలాడు నితిన్.…

గతేడాది ఫిబ్రవరిలో హిట్టయిన ఒకే ఒక్క సినిమా భీష్మ. ఆ నెలలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అవ్వగా.. జాను సినిమా ఫ్లాప్ అయింది. అలా ఫిబ్రవరిలో ఒకే ఒక్కడుగా మిగిలాడు నితిన్. ఆశ్చర్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఒకే ఒక్కడు నితిన్.

అవును.. నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమా తప్ప, చెప్పుకోదగ్గ సినిమాలేవీ ఈ నెల రావడం లేదు. చెక్ మినహా పేరున్న సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీనికి ఓ కారణం ఉంది.

గతేడాది లాక్ డౌన్ పడి షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఆ తర్వాత షూటింగ్స్ అన్నీ మినిమం గ్యాప్స్ లో ఒకేసారి ప్రారంభమయ్యాయి. దీంతో పెద్ద సినిమాలతో పాటు, ఓ మోస్తరు అంచనాలున్న సినిమాలేవీ ఫిబ్రవరిని అందుకోలేకపోయాయి. అలా ఈ నెల మరోసారి సోలోగా థియేటర్లలోకి రాబోతున్నాడు నితిన్.

ఈ నెల ఏ సినిమాలు వస్తున్నాయి..

ఫిబ్రవరి మొదటి వారంలో జాంబీరెడ్డి, రాధాకృష్ణ, విఠల్ వాడీ సినిమాలొస్తున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన జాంబీరెడ్డి, లెక్కప్రకారం సంక్రాంతికే రావాలి. వాయిదాపడి ఈ వారాంతం థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీతో తేజ సజ్జ, సోలో హీరోగా పరిచయమౌతున్నాడు.

ఇక ఫిబ్రవరి రెండో వారంలో ఉప్పెన, ఎఫ్.సీ.యూ.కే, శశి సినిమాలున్నాయి. ఉప్పెన సినిమాతో మెగా కాంపౌండ్ నుంచి వైష్ణవ్ తేజ్ రూపంలో మరో హీరో పరిచయమౌతున్నాడు. ఇక ఎఫ్.సీ.యూ.కే లో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా.. ఆది సాయికుమార్ హీరోగా శశి సినిమా తెరకెక్కింది.

మూడో  వారంలో చెక్, చక్ర, పొగరు సినిమాలున్నాయి. గతేడాది కూడా నితిన్ నటించిన భీష్మ సినిమా ఫిబ్రవరి మూడో వారంలోనే రిలీజైంది. ఈ ఏడాది చెక్ సినిమా కూడా ఫిబ్రవరి మూడో వారానికే షెడ్యూల్ అయింది. అలా భీష్మ సెంటిమెంట్ ను నితిన్ కొనసాగిస్తున్నాడని చెప్పుకోవాలి. ఇక చక్ర, పొగరు రెండూ డబ్బింగ్ సినిమాలు. వీటితో పాటు పాయల్ రాజ్ పుత్ నటించిన 5Ws అనే సినిమా కూడా ఇదే వారంలో వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక ఫిబ్రవరి ఆఖరి వారంలో ఏ1-ఎక్స్ ప్రెస్, కపటధారి, అక్షర, రేడియో మాధవ్ సినిమాలున్నాయి. హాకీ బ్యాక్ డ్రాప్ తో సందీప్ కిషన్ నటించిన సినిమా ఏ1-ఎక్స్ ప్రెస్. ఇక కపటధారిగా సుమంత్, అక్షరగా నందిత శ్వేత థియేటర్లలోకి రానున్నారు. వీటితో పాటు రేడియో మాధవ్ అనే చిన్న డబ్బింగ్ సినిమా కూడా వస్తోంది.

మొత్తమ్మీద ఫిబ్రవరి నెలలో చెక్ తప్ప మరో చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేకపోవడం ఆశ్చర్యమే. మార్చి నుంచి సిసలైన సినిమా సందడి ప్రారంభంకానుంది.

నిమ్మ‌గ‌డ్డ టీడీపీ ముద్ర పోగొట్టుకుంటారా ?

రామతీర్థం లోని రాములోరి గుడి…డ్రోన్ కెమెరా