అంతా ఊహించిందే జరిగింది. మహేష్-అల్లు అర్జున్ మధ్య కలెక్షన్ వార్ షురూ అయింది. అల వైకుంఠపురములో నుంచి వసూళ్ల పోస్టర్ వచ్చిన గంటల వ్యవథిలోనే సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి లేటెస్ట్ కలెక్షన్లతో పోస్టర్ వచ్చేసింది. మహేష్ నటించిన ఈ సినిమాకు 3 రోజుల్లో 103 కోట్ల రూపాయల గ్రాస్ అంటూ ప్రకటించేశారు మేకర్స్. అల వైకుంఠపురములో సినిమాకు ఒక రోజులోనే 85 కోట్ల రూపాయల గ్రాస్ అని ప్రకటిస్తే, మహేష్ మూవీకి 3 రోజుల్లో 103 కోట్ల గ్రాస్ అని చెప్పుకున్నారు.
నిజానికి ఈ రెండు సినిమాల వసూళ్లలో తేడాలున్నాయి. ఇవి అసలైన కలెక్షన్లు కానే కావు. మహేష్, బన్నీ ఇద్దరూ ఇలా వసూళ్లు ఘనంగా చెప్పుకోవడానికే ఇష్టపడతారు. అందుకే మేకర్స్ కూడా ఇలా పోటీపడి కలెక్షన్ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. బన్నీ కంటే ఒక రోజు ముందు థియేటర్లలోకి వచ్చాడు కాబట్టి, ముందుగా మహేష్ నుంచే పోస్టర్ వచ్చింది. మొదటి రోజు ఏకంగా 46 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ అంటూ అనీల్ సుంకర పోస్టర్ రిలీజ్ చేశాడు.
దీనికి కౌంటర్ గా అల వైకుంఠపురములో సినిమా నుంచి ఒక రోజులో 85 కోట్లు గ్రాస్ అంటూ పోస్టర్ వచ్చింది. వీళ్లు గ్రాస్ లో వసూళ్లు చెప్పారు కాబట్టి, సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా గ్రాస్ లోకి మారింది. మొదటి రోజు వసూళ్లను షేర్లలో చెప్పిన యూనిట్, 3 రోజుల వసూళ్లను గ్రాస్ లో (103 కోట్లు వరల్డ్ వైడ్) చెప్పింది.
ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ ఇద్దరు హీరోలు పోటాపోటీగా వసూళ్ల పోస్టర్లు రిలీజ్ చేసుకుంటున్నారు. ఇలా జరుగుతుందనే విషయాన్ని అంతా ముందుగానే ఊహించారు కానీ ఈసారి అది కాస్తా శృతిమించినట్టు కనిపిస్తోంది. వాస్తవంగా చూసుకుంటే.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు నిన్న (వర్కింగ్ డే కావడంతో) వసూళ్లు తగ్గాయి. అందుకే మేకర్స్ షేర్ చెప్పకుండా లా మధ్యేమార్గంగా గ్రాస్ పోస్టర్ రిలీజ్ చేశారు.