లోకమంటే రకరకాల ప్రాణులు, ఆలోచనల సమ్మేళనం. సమాజంలో ఎవరెవరు ఏఏ ఇబ్బందులతో బాధ పడుతుంటారో తెలియదు. కొందరు ఆ బాధల నుంచి బయట పడేందుకు తమను తాము ఓదార్చుకుంటారు.
మరి కొందరు తమను బాధ పెడుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు. సమస్యలు మనుషులకు కాకుండా మాన్లకు వస్తుంటాయా? అని కొందరు దేన్నైనా లైట్ తీసుకుంటారు. అలాంటి వాళ్లే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు.
ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నటి అవికాగోర్ తనను తీవ్రంగా బాధ పెట్టిన సమస్య గురించి ఓపెన్‌గా బయట పెట్టారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా సెల్ఫ్ లవ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది.
ఈ పోస్టు ప్రతి ఒక్కరి హృదయాలను ఆకట్టుకుంటోంది. సమస్యకు పరిష్కారం మనలోనే ఉందని, ప్రతిరోజూ మనతో మనం మాట్లాడుకుంటే …అన్నిటికి పరిష్కారం లభిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. జీవితంలో సంతోషం ఎక్కడో లేదని, అది మనలో పాజిటివ్ ఆలోచనల రూపంలో ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా నెటిజన్లను, అభిమానులను ప్రశ్నిస్తూ … తిరిగి తానే వాటికి జవాబులు చెప్పి అబ్బుర పరిచారు.
ఒంటరితనం వల్ల మీరు ఎప్పుడైనా భయపడ్డారా? మీ ఆలోచనలతో మీరు కంగారుపడ్డారా? అంటూ అవికా గోర్ ప్రశ్నించారు. గతేడాది వరకూ ఈ ప్రపంచంతో పాటు తన జీవితం గురించి తరచూ తప్పుగానే ఆలోచించేదాన్నని ఆవేదన చెందారు.
తనలోని చెడు ఆలోచనల నుంచి బయటపడేందుకు, తన చుట్టూ ఉన్నవారితో ఎక్కువ సమయాన్ని గడిపినట్టు చెప్పుకొచ్చారు. అందరి మాదిరిగా సాధారణ జీవితాన్ని గడపాలంటే తన చుట్టూ ఉన్నవాళ్లతో గడపాలని, లేకపోతే నెగెటివ్ ఆలోచనల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయం తనను వెంటాడినట్టు ఆమె తెలిపారు.
ఇలాంటి ఆలోచనలతో తాను ఎన్నో సంవత్సరాలు ఇబ్బందిపడినట్టు అవికా గోర్ తన మనసులోని విషయాలను బహిరంగ పరిచారు. ఆ తర్వాత స్వీయ సంరక్షణ, వ్యక్తిగత ప్రేమ గురించి ఎంతో తెలుసుకున్నట్టు ఆమె వెల్లడించారు. ఆ క్షణాన ఒక రకంగా తనకు జ్ఞానోదయం అయినట్టు తెలిపారు.
నెగెటివ్ ఆలోచనలే తనను సంవత్సరాల తరబడి ఇబ్బంది పెట్టాయన్నారు. సమస్యను గుర్తించిన తర్వాతే తనతో తాను ఎక్కువ సమయం గడపడం అలవాటు చేసుకున్నానని ఆమె చెప్పారు.
కాబట్టి చివరిగా …సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు ఇవేమీ లేకుండా తమతమ ఆలోచనలతో సమయాన్ని ఆస్వాదించాలని అవికా గోర్ వివరించారు. ఈ పోస్టుపై నెటిజన్ల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. అద్భుతంగా చెప్పావంటూ పలువురు కామెంట్స్ పెడుతుండడం విశేషం.