Advertisement


Home > Movies - Movie News
గేయమేరా జీవితం.. గేయమేరా శాశ్వతం!

డాక్టర్‌. సి. నారాయణ రెడ్డి లేదా సినారె. ఆయన లేరంటే లేరు. ఉన్నారంటే ఉన్నారు. ప్రాణం విడిచారు కాబట్టి లేరు. కీర్తి మిగిల్చారు కాబట్టి వున్నారు. ప్రొఫెసర్‌ అయ్యాక కూడా ఆయన్ని 'డాక్టర్‌'గానే గుర్తుంచుకున్నారు. ఆకాశవాణిలో ఆయన పాట వేసే ముందు కూడా 'గీత రచన.. డాక్టర్‌.సి. నారాయణ రెడ్డి అనే చెప్పేవారు. ఇప్పటి తరహా 'గిరిశోధన' ద్వారా కాకుండా, అప్పటి 'పరిశోధన' తోనే ఆయన 'డాక్టరేటు' తెచ్చుకున్నాడు.

ఆయనే కాబోలు పరిశోధనకీ, గిరిశోధనకీ  తేడా చెప్పింది..! పరిశోధన సహజమైన శోధనే. కానీ గిరి శోధన అలా కాదు.. కొండను (గిరిని) తవ్వి ఎలుకను పట్టటం. ఆయన హాస్యంలోనూ చతురుడు లెండి. ఇక 'సినారె' అంటారా..? చెయ్యెత్తు కవులూ, రచయితలు కూడా ఎందుకో తమ పేర్లను పొట్టివి చేసేవారు.

శ్రీశ్రీ తో ఈ సరదా మరింత పెరిగింది. కొ.కు(కొడవటి కుటుంబరావులు)  'చాసో'( చాగంటి సోమయాజులు) ఇలా పలువురు వచ్చేశారు. అయితే అందరికీ 'హ్వ్రస్వ' నామం సరికాదు. కానీ 'సినారె' కు సరిపోయింది. ఇలా చివర 'రె' వచ్చే మరో పరిశోధకుడు వున్నారు. ఆయన 'బంగోరె' ( బండి గోపాలరెడ్డి).

సినారె బహుముఖీనుడయినా, లోకానికి బాగా తెలిసిన ముఖం ఒక్కటే. గేయ రచయిత. ఒక వ్యక్తి మరీ ఇన్ని గొప్ప పాటలు రాసేశారా? రాశిలోనూ, వాసిలోనూ ఎక్కువే. మూడు వేలకు పైగా రాసేశారు. నోటికి వచ్చేస్తాయి. 'వస్తాడు నా రాజు.. ఈ రోజు' కావచ్చు; 'తోటలోని నా రాజు..' కావచ్చు. ఇలా గుర్తు చేస్తే చాలు అలా పాట స్మృతిలోకి డొల్లుకుంటూ వచ్చేస్తుంది.

మొత్తం పాట అంతా గుర్తుకు రాక పోవచ్చు కానీ, కొన్ని చరణాలనయినా మనం 'హమ్‌' చేసేస్తాం. ఇదే అయన విస్తృతి, ఆయన పరిమితి కూడా. సినిమాలో సందర్భం చెబితే చాలు.. పాట అలా వచ్చేస్తుండేది. ఇది గేయ రచయితగా ఆయన విరాట్‌ స్వరూపం. కానీ ఇదే స్వరం ఆయనలోని కవిని మింగేసింది.

అపురూపమైన జ్ఞానపీఠ్‌ ఆయన కవిత్వాని (విశ్వంభర)కి వచ్చింది. కానీ 'సినారె'ను ఉటంకించాలంటే, తొలుత గేయమే గుర్తుకొస్తుంది కవిత కాదు. గేయంలో కవిత్వం లేదా.. అంటే అది వేరే విషయం. కేవలం పరిశోధకులకూ, సమకాలీన సహ కవులకు మాత్రమే ఆయన కవిత్వం తెలుస్తుంది; గుర్తుంటుంది.

కృష్ణశాస్త్రి, శ్రీశ్రీలు అలా కాదు. వారి పద్యపాదాలనూ, కవిత్వ పంక్తులనూ, గేయాలతో సమానంగా ఉటంకించవచ్చు. శ్రీశ్రీకయితే ముందే కవిత.. తర్వాతే గేయం. 'దిగిరాను. దిగిరాను. దివినుంచి భువికి' అన్న పాదమూ గుర్తుంటుంది; 'ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు' అన్న చరణమూ స్ఫురణకు వస్తుంది. ఇక శ్రీశ్రీ అయితే వేరు.

ఆధునిక కవులును ఉటంకించాలంటే పద్యంలో జాషువా; వచన కవిత్వంలో శ్రీశ్రీ ముందుంటారు.'రాజు మరణించె నొక తార నేల రాలె; కవియు మరణించె, నొక తార గగనమెక్కె' అన్న జాషువా మార్కు పాదాలు కోకొల్లలు. 'తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్‌ చరిత్రకర్థం'  అన్న పంక్తులు అనేకానేకం.

సి.నారాయణ రెడ్డి సినిమాలకు గేయ రచన చేస్తుండగానే నాలుగు తరాల గేయ రచయితలు వచ్చి వెళ్లిపోయారు. ఆత్రేయ, శ్రీశ్రీ, వేటూరి వంటి ఉద్దండుల గేయాలూ, ఆయన గేయాల పక్కనే సమ ప్రాచుర్యం పొందుతూ వచ్చేవి. ఆత్రేయ,శ్రీశ్రీలలో వామపక్ష వాద స్పృహ కొట్టొచ్చినట్లు కనిపిస్తూ వుండేది.  సినారె గేయాల్లోనూ సమసమాజ ఆకాంక్ష బలంగానే వుండేది.

అయినా గేయ రచనలో 'మనసుకవి' గా ఆత్రేయ కీ, 'విప్లవ కవి'గా శ్రీశ్రీకీ ముద్ర పడింది. సినారె అన్ని 'జోనర్‌'లలోనూ సమానంగా పలికారు. ప్రేమ, ప్రణయం, విరహం, శృంగారం, సమాజం, కుటుంబం, విషాదం, దు:ఖం,జాలి, సందేశం- ఇలా ఏది కావాలంటే అది, 'సినారె' అంబుల పొదిలో దొరికేసేది. అందుకే నిర్మాతలకీ, దర్శకులకీ వెంటనే అక్కరకు వచ్చే గేయరచయితగా పేరొందారు.

తెలుగులో బలమైన గేయరచయితలు ఎప్పుడూ వుంటూనే వున్నారు. జాలాది కూడా 1500 గేయాలు రాశారు. 'పుణ్యభూమి నా దేశం నమో నమామి' అనేది రెండు తెలుగు ప్రాంతాల్లోనూ మార్మోగింది. కానీ  సినీపరిశ్రమ ప్లాటినం జూబిలీ ఉత్సవాలకు ఆహ్వానించటం మరచి పోయింది. అది వేరే విషయం.

అయితే ఇంత కాలం పాటు నిలిచి వెలిగిన గేయ దీపంగా మాత్రం సినారె వెలిగారని చెప్పటానికి సందేహం అవసరం లేదు. ఆయన గొప్ప అధ్యాపకుడు. సౌజన్యశీలి, ఆశ్రిత పక్షపాతి. కవి అనే వాడు కనిపిస్తే చాలు.. ఎదగాలని ఆశీస్సులందించే వాడు. ఎన్నెన్ని పీఠికలు, ముందు మాటలో..! ఇక శిష్యులు సరేసరి. సినారె జీవన శైలి, క్రమ శిక్షణా అనుసరించదగ్గవి.