Advertisement


Home > Movies - Movie News
ఘాజీతో రాజమౌళికి మళ్లీ ఝలక్

హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయాలి అంటే కోట్ల కొద్దీ బడ్జెట్ కావాలి అన్నది మన సినిమా జనాల అభిప్రాయం. బాహుబలి కి 120 కోట్లు ఖర్చుచేసి అదే నిజం అనిపించారు దర్శకుడు రాజమౌళి. కానీ జస్ట్ 51 కోట్లతో గౌతమీ పుత్ర శాతకర్ణి తీసి చూపించాడు దర్శకుడు క్రిష్. అప్పుడే దర్శకుడు రాజమౌళికి ఝలక్ తగిలింది. ఇంత తక్కువ ఖర్చుతో, తక్కువ టైమ్ లో ఇలాంటి సినిమా తీయచ్చా అని అంత అనుకున్నారు. 

ఇప్పుడు నూనూగు మీసాల కొత్త దర్శకుడు, జస్ట్ 15 కోట్ల ఖర్చుతో ఘాజీ సినిమా తీసి చూపించేసాడు. ఘాజీ సినిమా చూసిన వాళ్లకు ఆ సినిమాకు జస్ట్ 15 కోట్లు మాత్రమే ఖర్చయిందని తెలిస్తే కాస్త ఆశ్చర్యమే. టైమ్ కాస్తే ఎక్కవ పట్టింది కానీ, మంచి టెక్నీషియన్లను మంచి నటులను తీసుకుని కూడా15 కోట్లలో సినిమాను ఫినిష్ చేసేసారు. అమెజాన్ సంస్థ ఈ సినిమా ఇంటర్ నెట్ హక్కులకే పది కోట్లు చెల్లించడానికి రెడీ అయింది. శాటిలైట్ వుండనే వుంది. అంటే థియేటర్ల కలెక్షన్లతో సంబంధం లేకుండానే ఖర్చు వచ్చేసింది.

కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ వుంది. ఈ సినిమాను హిందీలో వేయికి పైగా సెంటర్లలో విడుదల చేసారు. అక్కడే వచ్చింది సమస్య. హిందీ వెర్షన్ అంటే దేశ వ్యాప్తంగా టీవీ పబ్లిసిటీ, అన్ని థియేటర్ల క్యూబ్ ఖర్చులు అవీ కలిపి మరో 15 కోట్లు అయిపోయిందట. అంటే ఇప్పుడు ఆ 15 కోట్ల మేరకు బాలీవుడ్ వెర్షన్ లో కలెక్షన్లు రావాల్సి వుంటుంది. కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ 20 పర్సంట్ కలుపుకుని, హిందీ వెర్షన్ 18 కోట్లకు పైగా వసూలు చేస్తే, ఓవర్ సీస్,  తెలుగు, తమిళ వెర్షన్ల కలెక్షన్లు లాభాలుగా మిగుల్తాయి.