పట్టుమని మూడు వారాల సమయం లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు మినిమమ్ బజ్ రావడం లేదు. బయ్యర్ సర్కిళ్లలో కానీ, సినిమా సర్కిళ్లలో కానీ ఆ సినిమా గురించి ముచ్చట్లే లేవు. అసలు అదో సినిమా వస్తోందన్న క్రేజ్ అన్నదే లేదు. మెగాభిమానులు సైతం అసలు ఆ సినిమా గురించి స్పందిస్తున్న వైనం కనిపించడం లేదు. ఇది చేదు వాస్తవం. పోనీ అలా అని అదే మన్నా చిన్న సినిమా, చిన్న బ్యానర్ నా? కాదు.
సూపర్ గుడ్ ఫిలింస్… కొణిదెల ప్రొడక్షన్స్…సల్మాన్ ఖాన్..మెగాస్టార్, నయనతార కాంబినేషన్. సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్. ఇంతకన్నా కావాల్సిందేముంది సినిమాకు బేసిక్ బజ్ రావడానికి. కానీ రావడం లేదు. ఆచార్య సినిమా ఫెయిల్యూర్ ప్రభావం కావచ్చు. లూసిఫర్ సబ్జెక్ట్ మీద అనాసక్తి కావచ్చు. దీనికి తోడు ఇప్పటి వరకు సినిమా నుంచి టీజర్ మినహా విడియో కంటెంట్ బయటకు రాలేదు.
మెగాస్టార్ సినిమా అంటే పాటలు, డ్యాన్స్ లు కీలకం. ఈ రోజు సాయంత్రం తొలిపాట విడుదల చేయబోతున్నారు. ఆ తరువాత అయినా సినిమాకు ఊపు వస్తుందేమో చూడాల్సి వుంది. ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. రెగ్యులర్ సినిమాల మాదిరిగా ఈ సినిమాకు పబ్లిసిటీ కూడా కష్టమే. ఎందుకంటే మెగాస్టార్ కూర్చుని పదుల కోద్దీ ఇంటర్వూలు ఇవ్వలేరు. నయనతార ప్రచారానికి రారు. ఇక మిగలింది దర్శకుడు మోహన్ రాజా, నటుడు సత్యదేవ్ మాత్రమే.
సినిమాకు రెండు ఈవెంట్లు ప్లాన్ చేసారు. అనంతపురంలో ఒకటి. ముంబాయిలో మరొకటి. ముంబాయి ఈవెంట్ కన్నా అనంతపురం ఈవెంట్ నే కీలకం. దాంతోటే సినిమాకు మాంచి బజ్ రావాల్సి వుంటుంది.ఏమైనా మెగాస్టార్ సినిమాలకు పూర్వవైభవం మళ్లీ ఎప్పుడు వస్తుందో అన్నది అనుమానంగానే వుంది.