cloudfront

Advertisement


Home > Movies - Movie News

హరికృష్ణ రోడ్డు ప్రమాదం వెనుక...

హరికృష్ణ రోడ్డు ప్రమాదం వెనుక...

గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న కారు.. అదుపు తప్పడంతో ఆ కారుని నడుపుతోన్న సినీనటుడు, టీడీపీ సీనియర్‌ నేత హరికృష్ణ ప్రాణాలు కోల్పోయారన్నది పోలీస్‌ ఉన్నతాధికారులు చెబుతున్నమాట. అయితే, ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. ఎంత ఘోర రోడ్డు ప్రమాదం అన్నదీ, కారు తాను వెళుతున్న మార్గంలోంచి, పక్క మార్గంలోకి దూసుకెళ్ళి.. అటువైపు లేన్‌లో వెళుతున్న కారుని ఢీకొట్టడంతోనే స్పష్టమవుతోంది.

ఈ క్రమంలో హరికృష్ణ నడిపిన కారు గాల్లోకి లేచి, చాలాసేపు గాల్లోనే పల్టీలు కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ ప్రత్యక్ష సాక్షులు కూడా, ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇంకో కారులోని వ్యక్తులే కావడం గమనార్హం. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణ నడుపుతున్న కారులో ఆయన స్నేహితులు ఇద్దరున్నారు. ఒకరు శివాజీ కాగా, మరొకరు వెంకట్రావు. వీరిలో శివాజీ అనే వ్యక్తి కాలికి ఫ్రాక్చర్‌ అయ్యింది. 'గాయం చిన్నదే' అని స్వయానా శివాజీ చెబుతున్నారు.

మరోపక్క, వెంకట్రావుకి మాత్రం ఎలాంటి గాయాలూ కాలేదు. 'వాటర్‌ బాటిల్‌ తీసుకునేందుకు హరికృష్ణ పక్కకు తిరిగారు. ఆ సమయంలో కారు ఎడమ వైపుకు లాగేసింది. స్ట్రెయిట్‌ చేసే క్రమంలో రైట్‌ వైపుకు తిప్పారు. కారు అదుపు తప్పి, డివైడర్‌ని ఢీకొట్టి గాల్లోకి లేచింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు' అని శివాజీ, వెంకట్రావు జరిగిన ఘటనను వివరించారు.

ఇంత పెద్ద ప్రమాదంలో హరికృష్ణ ఒక్కరే కారు నుంచి బయటకు ఎగిరిపడటం ఆశ్చర్యం కల్గించకమానదు. కార్లోంచి దూరంగా హరికృష్ణ విసిరి వేయబడ్డారు. దాంతో తలకు గాయాలై ఆయన ప్రాణాలు కోల్పోయారు. గతంలో వైఎస్సార్సీపీ నేత శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించినప్పుడూ.. ఆమె కారు నుంచి బయటకు విసిరివేయబడ్డ సంగతి తెల్సిందే.

తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ ముఖ్యనేతలు లాల్‌ జాన్‌ భాషా, కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. హరికృష్ణ తనయుడు జానకిరామ్‌ సైతం ఇప్పుడు హరికృష్ణ ప్రాణాలు కోల్పోయిన ప్రాంతానికి కాస్త దగ్గర్లోనే నాలుగేళ్ళ క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెల్సిందే.

ఆ ఘటన తర్వాత, 'వాహనాల్ని జాగ్రత్తగా నడపాలి..' అంటూ తన ప్రతి సినిమా ప్రమోషన్‌ సందర్భంగా అభిమానుల్ని అప్రమత్తం చేస్తుంటాడు హరికృష్ణ తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. దురదృష్టవశాత్తూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంట్లోనో మరో రోడ్డు ప్రమాదం జరిగి.. కుటుంబ పెద్దను కోల్పోవాల్సి వచ్చింది.