“చీమ చీమ ఎందుకు కరిచావంటే.. నా పుట్టలో వేలు పెడితే కొరకనా అందంట.” అలానే ఉంది నటి హేమ వాదన. తన దారికి అడ్డొస్తే ఎవరినైనా కొరికి పడేస్తానంటోంది. శివబాలాజీ చేయి కొరికింది తానేనంటూ అంగీకరించిన హేమ.. ఊరికే ఎందుకు కొరుకుతానంటూ సమర్థించుకుంది.
“ఆయనేం చేయకుండా కొరికి రక్కేస్తామా. ఆయన ఏదో చేశాడు, అందుకే నేను చేయి కొరకాల్సి వచ్చింది. ఆయన అలా చేయి పెట్టొచ్చా.”
ఇలా తను కరిచిన వ్యవహారాన్ని సమర్థించుకున్నారు హేమ. అయితే శివబాలాజీ చేయి పెట్టి ఏం చేశాడనే విషయాన్ని మాత్రం హేమ చెప్పలేదు. అతడు అసభ్యకరంగా ప్రవర్తించాడనే అర్థం వచ్చేలా హేమ మాట్లాడారు. మరోవైపు శివబాలాజీ మాత్రం తనకేం తెలియదంటున్నాడు. హేమ ఎందుకు తనను కరిచిందో అర్థంకావడం లేదన్నాడు.
“క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. బయట వ్యక్తి వచ్చి ప్రత్యర్థి ప్యానెల్ లో ప్రచారం చేస్తున్నాడు. అతడ్ని పట్టుకోవాలనుకున్నాను, ఆ గొడవల్లో అతడు పారిపోయాడు. ఈలోగా మనుషులు మీద పడిపోతున్నారని చెప్పి నాకు రెండు వైపుల ఉన్న 2 పోల్స్ ను గట్టిగా పట్టుకున్నాను. అంతలోనే ఆమె కొరికారు. ఎందుకు కొరికారో నాకు తెలీదు.”
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ రోజు కూడా వివాదాలు వదలడం లేదు. ఇప్పటికే మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేయడం, బూతులు తిట్టడం లాంటి వివాదాలు చోటుచేసుకోగా.. ఇప్పుడు ఈ కొరుకుడు వివాదం మొదలైంది. నటుడు శివబాలాజీ చేతిని హేమ కొరకడం.. స్వయంగా నరేష్ ఈ వ్యవహారాన్ని మీడియా ముందు పెట్టడంతో, ఇది కాస్తా వివాదాస్పదమైంది.