సోనూసూద్…బాలీవుడ్ నటుడిగా హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు. కరోనా కష్టకాలంలో అభాగ్యులకు ఆయన అండగా నిలిచారు. సాయానికి కులమతాలు, ప్రాంతాలు ఏవీ అడ్డంకి కావని ఆయన నిరూపించారు.
చిత్తూరు జిల్లా మదనపల్లెలో తండ్రికి అండగా కాడెద్దులైన కూతుళ్లను చూసి స్పందించి తన వంతు సాయం అందించారాయన. అలాగే నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ సిలిండర్ల ఏర్పాటుకు తన వంతు సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఇలా ఆయన చేయూతనిచ్చిన వాటి గురించి చెప్పాలంటే ఎన్నో వున్నాయి.
అలాంటి రియల్ హీరోపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు నిర్వహించడం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. నాలుగు రోజుల పాటు నిర్వహించిన దాడులపై ఆయన తాజాగా ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా అన్నిటికీ కాలమే జవాబు చెబుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, తానెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
‘ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో భారతదేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నాను. సాయం కోసం చూసే ప్రజలతోపాటు ఒక విలువైన ప్రాణాన్ని కాపాడటం కోసమే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్ సంస్థలకు సూచించాను. అలా మా ప్రయాణం కొనసాగుతోంది. మళ్లీ సేవలందించేందుకు మీ ముందుకు వచ్చేశాను’ అని సోనూ ట్వీట్ చేశారు.
నాలుగు రోజుల పాటు సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఐటీశాఖ కీలక విషయాలు వెల్లడించింది. సోనూ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారని ఐటీ శాఖ తేల్చింది. ఆయన విరాళాలు, సోనూ దాతృత్వంపై అనుమానాలు తలెత్తేలా ఐటీ అధికారులు వివరాలు వెల్లడించారనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిసారీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఐటీ అధికారులతో పాటు మరెవరికో ఆయన గట్టి సమాధానం చెప్పాలనే భావన ఆయన ట్వీట్‌లో కనిపిస్తుందని రాజకీయ, సినీ సెలబ్రిటీలు అంటున్నారు. మొత్తానికి ఆయన ట్వీట్ వెనుక మర్మం చర్చకు తెరలేపింది.