ప్రముఖ హీరోయిన్, గోవా భామ ఇలియానా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్నే తనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. బహుశా ఆ నిర్వేదనం నుంచే తాత్విక ఆలోచనలు పుట్టుకొచ్చినట్టున్నాయి. జీవితంలో ఎత్తుపల్లాలన్నీ చూసిన వాళ్ల నోటి నుంచి వచ్చే మాటలు….ఇలియానా మాట్లాడుతుండటం కాసింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రతిరోజు అద్భుతాల్ని ఆశించ వద్దని, ప్రతి ఒక్కరి జీవితంలో అనుకూల, ప్రతికూల పరిస్థితులు ఉంటాయని ఆమె అన్నారు. ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా ఎన్నో జీవిత సత్యాల్ని తెలుసుకోవచ్చంటూ వేదాంత ధోరణిలో ఆమె అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో తన శరీరంతో పాటు మనసులో వచ్చిన మార్పులను ఆమె బయట పెట్టారు. అలసిపోతున్నానన్న భావన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారామె.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియాన్ పెట్టిన పోస్ట్…అనేక రకాల ఆలోచనలు, ఆవేదన, నిస్సహాయత, ఆధ్యాత్మిక చింతనను ప్రతిబింబించేలా ఉంది.
‘కొన్ని రోజులుగా వర్కవుట్స్ చేయాలంటే తెలియని బద్ధకం ఆవహించింది. మాటల్లో చెప్పలేని తెలియని నిస్సహాయత. తనలో కలిగే ఈ భావనల గురించి లోతుగా ఆలోచిస్తే నా శరీరంతో పాటు మనసు కూడా అలసిపోయిందనే నిర్ణయానికి వచ్చాను. ఆ రెండింటికి విశ్రాంతి కావాలనిపిస్తోంది. మనకు ఏం కావాలో తెలుసుకునే అన్వేషణలో నేను ప్రస్తుతం ఉన్నా. నాతో నేను సంభాషించుకుంటున్నా. ఈ క్రమంలో సత్యాన్ని తెలుసుకుంటున్నా’ అని ఇలియానా తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.