ఒకటని కాదు.. సీబీఐ, ఈడీ, ఎన్సీబీ.. ఇన్ని విచారణ సంస్థలు ఒకేసారి రంగంలోకి దిగాయి. వీరికి అదనంగా బిహార్ పోలీసులు, మహారాష్ట్ర పోలీసుల విచారణ అదనం! ఇక మీడియా మార్కు విచారణ సరేసరి! ఆపై సుబ్రమణ్య స్వామి, సోషల్ మీడియా.. ఇంతమంది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై విచారణ చేపట్టారు. అందరి టార్గెట్ రియాచక్రబర్తి.
మొదట్లో బాలీవుడ్ సినీ పెద్దల బంధుప్రీతి వల్లనే సుశాంత్ చనిపోయాడని సదరు సినిమా వాళ్లను కొందరు ఇంటరాగేట్ చేసేశారు! ఇలా ఎవరికి వారు విచారణ అధికారులు అయిపోయి.. సుశాంత్ కేసుపై తీర్పులు ఇచ్చేశారు. ఎవరికి ఏ శిక్షలు వేయాలో కూడా సోషల్ మీడియా జనాలు సెక్షన్లతో నిమిత్తం లేకుండా చెప్పేశారంటే.. ఈ కేసులో వారి విచారణలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పవచ్చు!
ఇక టైమ్స్ నౌ చానల్ చూస్తే.. అది కేవలం రియా చక్రబర్తికే అంకితం అయ్యింది. సుశాంత్ సింగ్ అకౌంట్ నుంచి భారీ మొత్తాలు ట్రాన్స్ ఫర్ అయ్యాయంటూ కేసుకు డబ్బు కోణాన్ని జోడించి దాన్ని సంచలనంగా మార్చారు. పది కోట్లు, 15 కోట్లు అంటూ నంబర్ బలంగా వినిపించారు. ఆఖరికి సుశాంత్ కుటుంబీకులు కూడా ఆ విషయాల్లోనే ఫిర్యాదులు చేసినట్టుగా వార్తలు వచ్చాయి!
అయితే డబ్బు కోణంపై సీబీఐ, ఈడీలు విచారించగా.. అంతా తూచ్ అని తేల్చారు. బంధుప్రీతి, బాలీవుడ్ నెపోటిజం వల్ల సుశాంత్ ఆత్మహత్య అనే వాదనకూ విలువ లేకుండా పోయింది. అంతా రియా చక్రబర్తి వల్లనే అనడం చాలా మందికి తేలిక అయిపోయింది! మధ్యలోకి ఆదిత్య ఠాక్రేను లాగారు, ఆపై ముసలాయన మహేష్ భట్ ను కూడా వదల్లేదు. భట్- రియాల వాట్సాప్ చాట్ లకు ఎవరి భాష్యాలు వారు చెప్పారు!
చివరకు.. రియాచక్రబర్తిని, ఆమె సోదరుడిని అరెస్టు చేశారు. ఇంతకీ ఎందుకు? మీడియా మోపిన అభియోగాలకా? లేక సుశాంత్ ను వీరేమైనా హత్య చేశారా? అంటే.. కాదట, సుశాంత్ తోపాటు వీళ్లు కూడా డ్రగ్స్ పంచుకున్నారు! రియా-ఆమె సోదరుడి ఆర్థిక శక్తిని చూస్తే.. వీళ్లకు సుశాంత్ కు డ్రగ్స్ కొనిచ్చేంత సీన్ లేదు. సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా.. అతడి మేనేజర్ , వంటవాడు చెప్పుకొచ్చారట. సుశాంత్ డ్రగ్స్ తీసుకునే వాడని, తనను కూడా తీసుకోమన్నాడని రియా ఇప్పుడు చెబుతోంది.
ఇక సినిమా వాళ్లూ డ్రగ్స్ అంటే బయట బుగ్గలు నొక్కుకునే పరిస్థితి లేదిప్పుడు. అయితే ఈ కేసులో రియాను అరెస్టు చేయకపోతే బాగుండదన్నట్టుగా రియాను అరెస్టు చేశారనే వాదన వినిపిస్తోంది. ఇదంతా బిహార్ ఎన్నికల కోసమని, బహుశా బిహార్ ఎన్నికలు పూర్తయ్యే వరకూ రియాను అంత తేలికగా వదలకపోవచ్చని.. ఆ ఎన్నికలు అయిపోగానే.. ఈ కేసు ఎవరికీ పట్టకుండా పోతుందనే వాదనా వినిపిస్తోంది.