బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. బాలీవుడ్ బాద్‌షా అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ లక్షణాలున్నట్టు శనివారం నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో అమితాబ్ అభిమానులకు మరో చేదు వార్త. మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ హీరోయిన్, అభిషేక్ భార్య ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. బహుశా ఐశ్వర్యరాయ్, ఆమె కూతురు ఆరాధ్య కూడా అదే ఆస్పత్రిలో చేరే అవకాశం ఉందంటున్నారు.
ప్రపంచ అందగత్తెల్లో ఒకరైన ఐశ్వర్యరాయ్‌కి లక్షలాది మంది అభిమానులున్నారు. ఐశ్వర్యరాయ్ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్నారు. అలాగే 2009లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం నుంచి స్వీకరించారు. 1994లో ప్రపంచ సుందరిగా ఎంపికైన తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి భారతదేశంలో అగ్రతారగా వెలుగొందారు.
ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కోడలిగా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. తమ అభిమాన హీరోయిన్, ఆమె బిడ్డ కరోనా బారిన పడ్డారనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.