cloudfront

Advertisement


Home > Movies - Movie News

వడ్డీ లేకుండా రూ.50 లక్షలిచ్చాడు: జగపతి

  వడ్డీ లేకుండా రూ.50 లక్షలిచ్చాడు: జగపతి

తన ఆర్థిక స్థితి గతుల గురించి మొహమాటం లేకుండా బయటకు చెప్పుకునే నటుడు జగపతిబాబు. ఇప్పుడు మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా, చేతినిండా సినిమాలున్నాయి.. అని చెప్పడానికి వెనుకాడని ఈ హీరో గతంలో తను అనుభవించిన ఆర్థిక కష్టాల గురించి కూడా వివరించడానికి వెనుకాడే టైపు కాదు. తన కూతురు పెళ్లి సమయంలో, వివాహ వేడుకకు కూడా తన దగ్గర డబ్బులేదని.. సింపుల్‌గా కానిచ్చేశానని జగపతి బాబు వివరిస్తాడు.

హీరోగా హిట్లు లేక, అవకాశాలు మందగించిన సమయంలో ఖర్చులకు కూడా ఇబ్బందిపడిన సందర్భం ఉందని జగపతిబాబు మొహమాటం లేకుండా చెబుతాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అలాంటి కష్టకాలంలో తనను ఆదుకున్న వాళ్ల గురించి కూడా జగపతి చెప్పాడు. ఎవ్వరూ తనకు డబ్బులు ఇవ్వలేదని, ఆ విషయంలో తనకు బాధ కూడా ఏమీలేదని.. ఎవ్వరో ఇస్తారని కూడా తను ఎక్స్ పెక్ట్ చేయలేదని జగపతి వివరించాడు.

అయితే పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తను కష్టకాలంలో ఉన్నప్పుడు 50లక్షల రూపాయలు ఇచ్చాడని, అది అప్పుగా.. అయితే వడ్డీ లేకుండా ఆ డబ్బులిచ్చాడని జగపతి వివరించాడు. అయితే ఆ డబ్బును కొంతకాలం తర్వాత ఆయన అడిగారని.. దాన్ని తిరిగివ్వడానికి మాత్రం తను మరో అప్పు చేయాల్సి వచ్చిందని జగపతి నవ్వుతూ చెప్పాడు.

ఇదంతా గతం.. ఇప్పుడు జగపతి బాబుకు చేతినిండా అవకాశాలున్నాయి. మంచి రెమ్యూనరేషన్ కూడా దక్కుతోంది. ఇప్పుడు కూడా ఏదో విలాసంగా బతికేయాలని తనకేం లేదని.. ఖరీదైన కార్లు, బంగ్లా కొనేయాలని లేదని.. అపార్ట్‌మెంట్లోనే ఉంటున్నానని జగపతి వివరించాడు. డబ్బున్నది ఖర్చుపెట్టుకోవడానికే, అంతకు మించి మనీ విషయంలో తనకేం ఫిలాసఫీ లేదని జగపతి బాబు అంటున్నాడు.