
ఇప్పటివరకు తను చాలా విలనీ వేషాలు వేశానని, కానీ సాక్ష్యం సినిమాలో చేసిన పాత్రచూస్తే మాత్రం జనాలు తనను కొడతారని అంటున్నాడు ఒకప్పటి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు జగపతి బాబు. సినిమాలో తనంత నీచుడు ఎవడూ లేడని అంటున్నాడు.
"సాక్ష్యంలో విలనీ నాకు బాగా నచ్చింది. లోకంలో ఇంతకంటే నీచుడు ఉండడు. ఇప్పటివరకు నా పాత్రల్ని ప్రేక్షకులు క్షమిస్తూ వచ్చారు. కానీ ఈసారి కష్టం. ఇందులో విలన్ అంత ఎధవ." ఇలాంటి పాత్రలు చేసి తనమీద తనకే భయం వేస్తోందంటున్నాడు జగపతిబాబు. రొటీన్ లైఫ్ లో కూడా తను ఇలా మారిపోతానేమో అనే భయాన్ని బయటపెట్టాడు.
"లెజెండ్ సినిమాలో విలన్ పాత్రకు ఇగో ఉంది. నాన్నకు ప్రేమలో ప్రతినాయకుడు క్లాస్ గా కనిపిస్తాడు. రీసెంట్ గా చేసిన జయజానకి నాయకలో విలన్ కు పరువు ఉంది. ఇలా ఇన్నాళ్లూ నేను చేసిన విలన్ పాత్రలకు ఓ పర్పస్ ఉంది. కానీ సాక్ష్యంలో విలన్ కు పర్పస్ ఉండదు. కేవలం డబ్బు-డబ్బు-డబ్బు. పరమ ఎధవ."
ఇలా సాక్ష్యం సినిమాలో తన విలనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు జగపతిబాబు. ఇలా ఎన్నోరకాల విలన్ పాత్రలు వేసినప్పటికీ.. కెమెరా నుంచి బయటకొచ్చిన తర్వాత భగవంతుడి దయవల్ల అలాంటి ఛాయలు తనలో కనిపించవని అంటున్నాడు జగపతిబాబు.
"ఒకప్పుడు స్క్రీన్ పై నేను చాలా సాఫ్ట్. ప్లే బాయ్. అలాంటి నేను విలన్ పాత్రలు వేస్తానని అనుకోలేదు. కానీ వేశాను. నా ఖర్మకాలి అవి హిట్ అయ్యాయి. నా కెరీర్ కూడా బాగుంది. కాబట్టి అలాంటి పాత్రలు వేస్తూనే ఉన్నాను. చూద్దాం, ఈ ప్రయాణం ఎటు పోతుందో."