ప్రముఖ హీరో రజనీకాంత్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. అంతేకాదు, గట్టిగా హెచ్చరికలు చేసి పంపింది. కోర్టులో చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామం గురించి తప్పక తెలుసుకోవాల్సిన ఘటన ఇది.
హీరో రజనీకాంత్‌కు చెన్నైలో రాఘవేంద్ర కళ్యాణ మండపం ఉంది. ఈ కళ్యాణ మండపానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ రూ.6.5లక్షలు ఆస్తి పన్ను కింద విధించింది. అయితే ఈ మొత్తాన్ని చెల్లించడానికి ఆయన ససేమిరా అన్నాడు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
కరోనా కారణంగా మార్చి 24 నుంచి లాక్డౌన్ విధించడంతో రాఘవేంద్ర కళ్యాణ మండపాన్ని మూసివేశామని, అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని రజనీకాంత్ తరపు లాయర్ మద్రాస్ హైకోర్టుకు విన్నవించాడు.
ఈ విషయమై విచారణలో భాగంగా మద్రాస్ హైకోర్టు జడ్జి అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించి, కోర్టు సమయాన్ని దుర్వినియోగం చేసినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజనీకాంత్‌ను కోర్టు హెచ్చరించింది.
దీంతో ఈ కేసును విత్‌డ్రా చేసుకోవడానికి కొంత సమయం కావాలని రజనీ తరపు లాయర్ కోర్టును కోరారు. అందుకు కోర్టు సమ్మతించింది. పన్ను ఎగ్గొట్టాలని హీరో గారు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టైంది.