cloudfront

Advertisement


Home > Movies - Movie News

కమల్‌కి రాజకీయ 'విశ్వరూపం' కష్టమే.!

కమల్‌కి రాజకీయ 'విశ్వరూపం' కష్టమే.!

'విశ్వరూపం-2' ట్రైలర్‌ వచ్చేసింది. ఎక్కడ విన్నా ఈ ట్రైలర్‌ గురించిన పాజిటివ్‌ రెస్పాన్సే కన్పిస్తోంది. ఈ విషయంలో కమల్‌హాసన్‌ ఫుల్‌ హ్యాపీగా వుండాలి. కానీ, అనూహ్యంగా కమల్‌హాసన్‌ నుంచి ఇంట్రెస్టింగ్‌ పొలిటికల్‌ స్టేట్‌మెంట్‌ వచ్చింది. 'విశ్వరూపం-2' సినిమాకి అడ్డంకులు ఎదురైతే, రాజకీయ నేతగా వాటిని ఎదుర్కొంటానని అంటున్నాడాయన. అసలిప్పుడు, 'రాజకీయం' గురించిన గోల ఎందుకట.? అంటే, ఈ సినిమాని కమల్‌హాసన్‌ తన రాజకీయ పార్టీ పబ్లిసిటీ కోసం ఫుల్లుగా వాడేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టేనన్న సమాధానం వస్తోంది అందరి నుంచీ.

కమల్‌హాసన్‌కి వివాదాలు కొత్త కాదు. 'విశ్వరూపం-1' ఎదుర్కొన్న వివాదాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 'ఇకపై నేను తమిళనాడులో వుండలేను..' అంటూ కమల్‌, 'విశ్వరూపం-1' విడుదల కష్టాల నేపథ్యంలో అసహనం వ్యక్తం చేశాడు. సినిమాని థియేటర్లలో కాదు, పూర్తిగా డీటీహెచ్‌ ద్వారా విడుదల చేసేస్తాననీ ప్రకటించాడు. చివరికి, అనేక వివాదాల నడుమ, ఎలాగోలా 'విశ్వరూపం-1' ప్రేక్షకుల ముందుకొచ్చిందనుకోండి.. అది వేరే విషయం.

ఇక, ఇప్పుడు 'విశ్వరూపం-2' సినిమా విషయానికొస్తే, ఈ సినిమాపై ప్రస్తుతానికి వివాదాలేమీ లేవు. ట్రైలర్‌ వచ్చాక, ప్రశంసలే తప్ప, ఎవరూ ఇంతవరకూ సినిమా పట్ల నెగెటివ్‌గా కామెంట్‌ చేయడంగానీ, సినిమాని అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేయడంగానీ జరగలేదు. బహుశా ఇదే కమల్‌హాసన్‌ని డిజప్పాయింట్‌ చేసి వుండొచ్చు. ఎందుకంటే, ఇప్పుడు కమల్‌ కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, రాజకీయ నాయకుడు కూడా కదా.! రాజకీయ వివాదాలతో ప్రచారం ఎలా పొందాలో బాగానే అర్ధంచేసేసుకున్నాడు.

వచ్చే ఎన్నికల్లో తన పార్టీని బరిలోకి దింపుతానని కమల్‌ ఇప్పటికే ప్రకటించేశాడు. ఈలోగా లైన్‌లో వున్న సినిమాలన్నీ పూర్తి చేసేసి, విడుదల చేసెయ్యాలన్నది కమల్‌ ఆలోచన. అన్నీ అనుకున్నట్టు జరిగి వుంటే, 'విశ్వరూపం-2' ఎప్పుడో వచ్చేసేదే. దాంతోపాటుగా, 'శభాష్‌ నాయుడు' అనే సినిమా కూడా కొన్ని అనివార్య కారణాలతో వెనక్కి వెళ్ళింది. ముందు 'విశ్వరూపం-2'కి లైన్‌ క్లియర్‌ చేసుకున్న కమల్‌, ఆ వెంటనే 'శభాష్‌ నాయుడు'పైనా ఫోకస్‌ పెట్టనున్నాడు. 'భారతీయుడు-2'పై ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.

ఇదిలా వుంటే, తమిళనాడులో పొలిటికల్‌ ఈక్వేషన్స్‌ ఏవీ కమల్‌హాసన్‌కి అనుకూలంగా కన్పించడంలేదు. రజనీకాంత్‌ పార్టీ పెడితే మాత్రం, కొంత ప్రభావం చూపగలడనే విశ్లేషణలు విన్పిస్తున్నాయి. రజనీకాంత్‌ రాజకీయాలపై కొంత కన్‌ఫ్యూజన్‌ కొనసాగిస్తున్న దరిమిలా, ఈ వాక్యూమ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న కమల్‌ ఆలోచనలు బాగానే వున్నా, టైమ్‌ అంటూ కలిసిరావాలి కదా.!