ఒక్కొక్కరిలో ఒక్కో ఆనందం చూసుకుంటూ ఉంటారు. అలా చేయకపోతే జీవితం ముందుకు సాగదు. జీవితమంటే సుఖదుఃఖాల కలయిక. కష్టమైనా, సుఖమైనా శాశ్వతంగా వుండవు. అమావాస్య, పౌర్ణమిలా మారుతూ వుంటాయి. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతికి విరుద్ధంగా ఎవరూ మనుగడ సాగించలేరు. మనుషులైనా అంతే.
తమ ఆలోచనలు, మనసుకు నచ్చినట్టు బతుకుతేనే సుఖం. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆనందం. వివాదాస్పద నటి కంగనా రనౌత్ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. బాలీవుడ్ నటీనటులు కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటి కానున్ననేపథ్యంలో, వారి పెళ్లి తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని కంగనా ప్రకటించడం విశేషం.
ఇందుకు కారణాలను కూడా తనదైన ఆలోచనలతో వ్యక్తపరిచారామె. ‘సమాజంలో ఎంతోమంది ధనవంతులైన పురుషులు తమకంటే వయసులో చిన్నవారినే పెళ్లి చేసుకుంటారు. భర్త కంటే భార్యకు పేరు, పలుకుబడి ఎక్కువగా ఉంటే ఆ పెళ్లి బంధంలో కలతలు వస్తాయి. ఇలాంటి ఎన్నో నిబంధనలు గురించి వింటూ నేను పెరిగాను. ఇప్పుడు.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సక్సెస్, ధనవంతులైన నటీమణులు ఆ నిబంధనలకు స్వస్తి పలుకుతూ వివాహబంధంలోకి అడుగుపెట్టడం నాకెంతో ఆనందంగా ఉంది’ అని కంగన ప్రకటించడం విశేషం.
కత్రినాకైఫ్ కంటే విక్కీ కౌశల్ వయసులో ఐదేళ్లు చిన్న. కంగనాకు ఇది బాగా నచ్చడానికి ప్రధాన కారణం. అందుకే వయసులో అబ్బాయే ఎక్కువ ఉండాలనే నిబంధనను ఈ జంట పక్కన పెట్టిందని కంగనా పేర్కొనడం వెనుక ఉద్దేశం.
పురుషాధిక్య సమాజంలో అన్నింటిలో మగవాళ్లే ఎక్కువనే భావజాలం ఇప్పటికీ మన వ్యవస్థను పట్టి పీడిస్తోంది. అలాంటి ఆధిక్య స్వభావాన్ని బద్దలు కొట్టే వాళ్లు మాత్రమే కొత్త చరిత్రను సృష్టిస్తారు. ఆ పని ఎవరు చేసినా అభినందనీయులే.