ఈ మధ్యనే ప్రెగ్నెన్సీ బైబిల్ అంటూ ఒక పుస్తకాన్ని రచించి విడుదల చేసిన నటి కరీనా కపూర్, ఇప్పుడు ఆ అంశంపై తనకున్న అవగాహనను టాక్ షో ల్లో పాలు పంచుకుంటోంది. దర్శక నిర్మాత కరణ్ జొహార్- కరీనా కపూర్ ల మధ్య జరిగిన ఆన్ లైన్ చాట్ షో లో ఈ అంశం చర్చకు వచ్చింది.
ఇద్దరు పిల్లలను కన్న అనుభవంతో ప్రెగ్నెన్సీ టైమ్ స్త్రీ పరిస్థితి గురించి వివరించి చెబుతోంది కరీనా. అందుకు సంబంధించి పుస్తకాన్ని విడుదల చేసిన ఆమె, టాక్ షో లో కూడా ఈ అంశం గురించి మొహమాటం లేకుండానే స్పందించింది.
గర్భధారణ సమయంలో స్త్రీకి భర్త సపోర్ట్ చాలా కీలకం అని అంటోంది కరీనా. అప్పుడు ఆమె ఉన్న శారీరక, మానసిక స్థితికి అనుగుణంగా భర్త వ్యవహరించాలని అంటోంది. ప్రత్యేకించి ఆమె అందంగా కనపడాలి, హాట్ గా కనపడాలనే కోరికలను ఆ సమయంలో భర్తలు వ్యక్తం చేయకూడదని స్పష్టం చేసింది. ఆమె శారీరక, మానసిక ఒత్తిళ్లను గమనించి నడుచుకోవాలని సూచించింది.
ఏతావాతా గర్భధారణ సమయంలో స్త్రీకి పురుషుడి సపోర్ట్ ఎంతో కీలకమని ఆమె స్పష్టం చేసింది. గర్భధారణ సమయంలో సెక్స్ అనేది అనేక మందికి అపోహలతో కూడుకున్న అంశమే, అనేక మంది అవగాహనను పెంపొందించుకోవాల్సిన అంశమే.
ఈ విషయం గురించి ఇది వరకూ సెక్సాలజిస్టులు పత్రికల్లో వచ్చే తమ వ్యాసాల్లోనూ, ప్రశ్న- సమాధానాల్లోనూ చెప్పే వారు. అయితే సెక్సాలజిస్టులు చెప్పేది కేవలం శాస్త్రీయ అంచనా, పరిశీలన కావొచ్చు. కానీ ఆ విషయాల్లో స్త్రీల వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, శారీరక సహకారం వంటివే కీలకం.
సెక్సాలజిస్టులు చెప్పారు కదా ఇబ్బంది ఉండదని.. అని రుతుక్రమం సమయంలో, గర్భధారణ సమయంలోనూ సెక్స్ గురించి ఆడవాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశాలుంటాయి. అయితే ఈ పరిస్థితులు ఎవరికి వారివి ప్రత్యేకం కావొచ్చు. ఎవరి శారీరక పరిస్థితిని బట్టి వారు స్పందించవచ్చు.
కాబట్టి.. ఈ అంశం గురించి ఒక సెలబ్రిటీ నోరు విప్పడం మంచిదే. కనీసం నాలుగు గోడల మధ్యన అయినా.. భార్యాభర్తల మధ్య ఈ చర్చ జరగడానికి బహిరంగంగా ఎవరో ఒకరు చొరవ తీసుకోవాల్సిన అంశమే ఇది. ఆరోగ్యకరమైన సెక్స్ సంబంధంలో శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడటం ఎట్టి పరిస్థితుల్లో తప్పో, సిగ్గుపడాల్సిన అంశమో కాదు. ఈ విషయంలో కరీనా స్పందన మెచ్చుకోదగినదే.