cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

కర్ణాటకలో మళ్లీ మొదలైన డబ్బింగ్‌ల శకం!

కర్ణాటకలో మళ్లీ మొదలైన డబ్బింగ్‌ల శకం!

కర్ణాటక జనాభా రమారమీ ఆరుకోట్లు. సాధారణంగా ఇంత జనాభా ఉంటే ఆ ప్రాంతానికి ఒక సినిమా ఇండస్ట్రీ ఏర్పడటం చాలా సహజం. అయితే కర్ణాటకలో మాత్రం కన్నడ సినిమాలకు అంత అవకాశం కనిపించడం లేదు. ఇది ఈనాటి పరిస్థితి కాదు. దశాబ్దాల నాటి పరిస్థితి. మొదటి నుంచి కర్ణాటకలో కన్నడ సినిమా పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. దీనికి అనేక కారణాలు. బయటివాళ్ల లెక్కలో చెప్పాలంటే కన్నడ సినిమాలు క్వాలిటీ రహితంగా ఉండటం. అందువల్లనే కన్నడ ప్రజలు కన్నడ భాష సినిమాలను ఆదరించడం లేదు. ఇది కొంతవరకూ వాస్తవమే.

ఈ విషయాన్ని అక్కడి మూవీమేకర్ల వద్ద ప్రస్తావిస్తే.. అసలు ప్రేక్షకుల ప్రోత్సాహమే లేదు.. అలాంటప్పుడు గొప్ప సినిమాలు ఎలా వస్తాయి? అని అంటారు. ఇది పరస్పరం చేసుకునే కంప్లైంట్‌. మంచి సినిమా తీస్తే మేమెందుకు చూడం అని  ప్రేక్షకుల నుంచి వాదన వినిపిస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీని బతికించుకోవడానికి సినీ పరిశ్రమ ప్రముఖులు దశాబ్దాలుగా తమవంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అందుకు కన్నడీగులు కనుగొన్న మొదటిమార్గం డబ్బింగులను నిషేధించడం. దాదాపు 56 సంవత్సరాల కిందట కన్నడనాట ఇతర భాషల నుంచి డబ్బింగ్‌ అయ్యే సినిమాలపై నిషేధం ఏర్పడింది.

ఇది దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. డబ్బింగుల ప్రభంజనం అంటే అదెలా ఉంటుందో తెలుగు వారికి చెప్పనక్కర్లేదు. ఇది తెలుగు పరిశ్రమ కూడా గతంలో ఎదుర్కొన్న అనుభవమే. ప్రత్యేకించి 2004-05-06 ఆ సమయంలో అయితే డైరెక్టు తెలుగు సినిమాలు డిజాస్టర్లుగా డబ్బింగ్‌ సినిమాలు మాత్రం సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. తమిళం నుంచి వచ్చిన అనువాద సినిమాలు తెలుగు బాక్సాఫీస్‌ను డ్యామినేట్‌ చేశాయి. తెలుగులో స్టార్‌ హీరోలు చేసిన సినిమాలు కూడా ఆ సమయంలో ఫెయిల్యూర్స్‌గా మిగిలాయి.

ఆ సమయంలో మనోళ్లు ఇంకా తొడలు కొట్టడం, నోటితో బుల్లెట్‌లు పేల్చడం వంటి సినిమాలు చేసేవాళ్లు. అదే సమయంలో తమిళం నుంచి చంద్రముఖి, ప్రేమిస్తే, శివపుత్రుడు, మన్మథ, గజిని, అపరిచితుడు వంటి సినిమాలు వచ్చాయి. సూర్య, విక్రమ్‌, శింబు, విశాల్‌ వంటి హీరోలు తెలుగునాట స్థిరమైన మార్కెట్‌ను ఏర్పరుచుకున్న సమయం అదే. తెలుగువాళ్లు తమిళ ప్రయోగాత్మక సినిమాలకు అడిక్ట్‌ అయిపోయిన సమయం అది. తమిళంలో ఈ హీరోలు చేసిన ప్రతి సినిమా కూడా తెలుగులోకి అనువాదం కావడం మొదలైంది అప్పటినుంచే.

ఆ దశలో తెలుగు సినిమాలు కూడా వరసగా బోల్తా పడటంతో టాలీవుడ్‌లో కూడా డబ్బింగులను నిషేధించాలి అనే డిమాండ్‌ వినిపించింది. ఆకట్టుకునే సినిమాలు చేయలేని తెలుగు మూవీమేకర్లు.. తమిళం నుంచి వచ్చే సినిమాలను నిషేధించేయాలి.. అని డిమాండ్‌ను వినిపించారు. అయితే.. ఆ డిమాండ్‌కు సరైన మద్దతు లభించలేదు. చివరకు ఎలాగో తమిళుల దండయాత్రలు తగ్గుముఖం పట్టాయి. ఆ డబ్బింగ్‌ సినిమాలు కూడా కొన్ని ఫెయిల్‌ కావడం.. తెలుగువాళ్లూ మళ్లీ ఆకట్టుకోవడంతో తెలుగునాట డబ్బింగుల ప్రవాహానికి ఆనకట్టపడింది.

అదీ డబ్బింగుల ప్రభావం అంటే అలా ఉంటుంది. తెలుగునాట రెండు మూడేళ్లు అలాంటి పరిస్థితి వస్తేనే అది గుర్తుండి పోయింది. కర్ణాటక వాళ్లు దశాబ్దాల కిందటే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అందుకే 1960లలోనే డబ్బింగులపై నిషేధం వేశారు. అయితే ఈ నిషేధం అధికారికమైనది కాదు. అనధికారికమైనది. కన్నడ మూవీమేకర్లు తమలో తాము వేసుకున్నది. ఇది చట్టపరమైనది కాదు. కేవలం కన్నడ సినిమా పెద్దమనుషులు పెట్టిన నియమం ఇది.

ఇతర భాషల నుంచి డబ్‌ అయ్యి వచ్చే సినిమాలు కన్నడ సినిమాల మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయని, ప్రేక్షకులు వాటిని చూస్తూ తమ సినిమాలను పట్టించుకోవడం లేదని వాళ్లు ఈ నిషేధాలు మొదలుపెట్టారు. ముందుగా బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ డబ్బింగ్‌ బొమ్మలు వేయకూడదని నిషేధం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా డబ్బింగులపై నిషేధం విధించారు.

నిజంగానే ప్రయోజనం కనిపించిందా?
అంత సీనేలేదు. డబ్బింగులను నిషేధించడం కన్నడ సినిమాలను కాపాడటం మాటేమిటో కానీ.. ఇతర భాషల సినిమాలను డైరెక్టుగా విడుదల అయిపోవడానికి అవకాశం ఏర్పడింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలు భారీఎత్తున డైరెక్టుగా విడుదల అయిపోవడం మొదలైంది. డబ్బింగ్‌ చేయనక్కర్లేదు.. డైరెక్టు రిలీజ్‌లే. ఆయా భాషల సినిమాలు డైరెక్టుగా విడుదల కావడం పుంజుకుంది. ఈ పరిస్థితి ఎక్కడకు తయారైందంటే.. డీప్‌ కర్ణాటకలో కూడా తెలుగు, అరవ సినిమాలు డైరెక్టుగా విడుదల అవుతాయిప్పటికీ.

బెంగళూరు నగరంలో తెలుగు, తమిళ సినిమాలదే డ్యామినేషన్‌. ఏ సినిమా అయినా.. భారీఎత్తున విడుదల అవుతుంది బెంగళూరులో. ఒక్కో సినిమాకు ముప్పై నలభై థియేటర్లు దొరుకుతాయి. క్రేజ్‌ను బట్టి అంతకు మించి కూడా థియేటర్లలో విడుదల అవుతుంటాయి తెలుగు, తమిళ సినిమాలు. ఇక బోర్డర్‌ జిల్లాల్లో అయితే ఎప్పుడూ తెలుగు సినిమాల హడావుడే. కేవలం సరిహద్దు ప్రాంతాల్లోనే కాదు... డీప్‌ కర్ణాటక అనదగ్గ మండ్యా, హాసన్‌ వంటి జిల్లాల్లో కూడా తెలుగు సినిమాలు డైరెక్టుగా విడుదల అవుతుండటం జరుగుతుంటుంది.

ప్రతి శుక్రవారం విడుదల అయ్యే తెలుగు సినిమాలు.. మండ్యా, మైసూరు, హాసన్‌లలో విడుదల అవుతుంటాయి. తెలుగు మాట్లాడటం అస్సలు రాని కన్నడీగులు కూడా ఈ సినిమాలకు క్యూలు కడుతూ ఉంటారు. కన్నడీగులు భాషాభిమానులే. తెలుగు వారితో పోలిస్తే వారికి వారి భాషపై అభిమానం ఎక్కువ. అయినా కూడా సినిమాల విషయంలో వారికి పక్కభాషలే దిక్కు. ఫలితంగా థిక్‌ కర్ణాటకలో కూడా తెలుగు సినిమాల హవా ఉంటుంది.

కర్ణాటకలోని కావేరీ పరివాహక ప్రాంతంలో తమిళ వ్యతిరేకత ఎక్కువ. దీంతో అక్కడ తమిళ సినిమాలు కూడా పెద్దగా రావు. తెలుగు సినిమాలే వసూళ్లను సాధిస్తూ ఉంటుంది. ఇలా తెలుగు సినిమాలకు మరిగిన కన్నడీగులను యాక్చువల్‌ కన్నడ సినిమాలు తీవ్రంగా నిరశపరుస్తూ ఉంటాయి. అక్కడి స్టార్‌ హీరోలు చేసే సినిమాలు రెండు కేటగిరిలున్నాయి. ఒకటి రీమేక్‌లు. ఎలాగూ డబ్బింగులపై నిషేధం కాబట్టి.. అక్కడి స్టార్‌ హీరోలంతా రీమేక్‌లతో బండి లాగిస్తున్నారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హిట్టైన సినిమాలను వాళ్లు రీమేక్‌ చేస్తూ ఉంటారు. ఇక రెండో కేటగిరి సొంత ప్రయత్నాలు. ఇవంత సక్సెస్‌ఫుల్‌గా లేవు. స్టార్‌ హీరోలు చేసే స్ట్రైట్‌ సినిమాలు కూడా అంతగా హిట్‌ అయ్యేదేమీ ఉండదు. ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది కర్ణాటకలో.

డబ్బింగులు మళ్లీ మొదలు!
ఈ పరిస్థితుల్లో మళ్లీ డబ్బింగుల ముచ్చట మొదలైంది. ఇన్నాళ్లు ఉన్నది అనధికార నిషేధమే. సినిమా వాళ్లు పెట్టుకున్న నియమమే. ఇన్నేళ్లూ అది స్ట్రిక్ట్‌గా అమలైంది కానీ.. తాజాగా ఒక తమిళ అనువాద సినిమా విడుదల అయ్యింది. తమిళంలో అజిత్‌ హీరోగా రూపొందిన 'వివేగం' సినిమా కన్నడలోకి 'కమాండో' పేరుతో డబ్‌ అయ్యింది. దీని విడుదల సందర్భంగా రచ్చ జరిగింది. డబ్బింగ్‌ సినిమా విడుదల పట్ల కన్నడ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. థియేటర్ల వద్ద రచ్చచేశాయి. అయితే చట్టపరమైన నిషేధంలేదు కాబట్టి... ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.

ఎట్టకేలకూ విడుదల అయ్యింది. ఇది ఆరంభం మాత్రమే, ఇకపై కన్నడనాట డబ్బింగుల ధాటి మొదలుకావొచ్చు. ఇతర భాషల నుంచి సినిమాలు పెద్దపెట్టున కన్నడలోకి అనువాదం అయ్యి విడుదల కావొచ్చు. ఇప్పటికే శాండల్‌వుడ్‌ గమనం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు అనువాద సినిమాలు కూడా మొదలైతే అది అక్కడి ఇండస్ట్రీని మరింత దెబ్బతీయవచ్చు. డైరక్టుగా ఇతర భాషల నుంచి విడుదల అయ్యే సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని కొంతమంది కన్నడీగులు డిమాండ్‌ చేస్తున్నారు.

కన్నడ సినిమాలు ఆడటానికి కనీసం రోజుకో షో అయినా కేటాయించాలనే డిమాండ్‌ ఉంది. అలా చేస్తేనే కన్నడ సినిమాలు బతుకుతాయని అక్కడివారు అంటున్నారు. ఇలా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా... మళ్లీ డబ్బింగులు వస్తున్నట్టుగా ఉన్నాయి.