cloudfront

Advertisement


Home > Movies - Movie News

దుమారం రేపుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్!

దుమారం రేపుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్!

అసలు ఆ సినిమాను రామ్ గోపాల్ వర్మ తీస్తాడా లేక ఫస్ట్ లుక్ టీజర్ల హడావుడితో ఆపేస్తాడా.. అనే సందేహాలు మొన్నటి వరకూ నెలకొని ఉన్నాయి. ఎందుకంటే ఏదో వివాదం మీద సినిమా ప్రకటన చేయడం.. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడం ఆర్జీవీకి కొత్త ఏమీకాదు. ఇలాంటి నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా కేవలం అలాంటి ఫస్ట్ లుక్స్ తో ఆగిపోయే పిక్చర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపించింది.

అయితే ఈ సారి వర్మ చాలా ముందుకే వచ్చేశాడు. ట్రైలర్ కూడా వచ్చేసింది. వర్మ మాట మీద నిలబడి వేలంటైన్స్ డే సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశాడు. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమాకు దాదాపు రెండు లక్షల వ్యూస్ దక్కాయి. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాకు యూట్యూబ్ లో వీక్షణలు లభిస్తూ ఉండటం గమనించాల్సిన విషయం.

మరి ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే.. ఉండాల్సినట్టుగానే ఉన్నట్టుంది.  ఎన్టీఆర్ విషయంలో ఆయన కుటుంబీకులు వ్యవహరించిన తీరు ఇది వరకూ వార్తా కథనాలు వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో పేర్కొన్నట్టుగానే ఈ ట్రైలర్ కనిపిస్తోంది. పిక్చర్ నాణ్యత అంతంతమాత్రంగా ఉంటుంది కానీ.. వివాదాస్పదంగా ఉంటుందని మాత్రం స్పష్టం అవుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఏవో పాటల విషయంలో తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్లింది. ఇప్పుడు ట్రైలర్ విషయంలో మరిన్ని పిటిషన్లు వేసుకోవాల్సిందే! ఓవరాల్ గా లక్ష్మీస్ ఎన్టీఆర్ పెద్ద దుమారాన్నే రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లోగా ఈ సినిమా విడుదల అయితే.. తెలుగుదేశం పార్టీకి మరింత తలపోటే!