Advertisement


Home > Movies - Movie News
అజ్ఞాతవాసి.. లాజిక్కులు లాగితే అంతే!

ఆ మధ్య అర్జున్ రెడ్డి సినిమా వస్తే.. అది బాగుంది అని కొంతమంది అన్న పాపానికి మరికొందరు రెచ్చిపోయారు. ఏముంది ఆ సినిమాలో? అంటూ విరుచుకుపడ్డారు. ఆ సినిమాలో కొన్ని సీన్లను ప్రస్తావిస్తూ.. వాటిల్లో లాజిక్ ఎక్కడుంది? అంటూ వీళ్లు తమ పాండిత్యాన్ని అంతా ప్రస్తావించారు. అర్జున్ రెడ్డి లాంటి వైవిధ్యభరితమైన, సినిమా వచ్చినందుకు సదరు మూవీ మేకర్లను అభినందించాల్సింది పోయి.. వీళ్లు తమ మెదడంతా ఉపయోగించి.. అర్జున్ రెడ్డిని ఆ అమ్మాయి ఎలా లవ్ చేసింది? అని వీళ్లు వాదించారు.

అరె.. యూనివర్సిటీ డీన్ చెప్పాడుగా.. అర్జున్ రెడ్డి కాలేజ్ టాప్, వర్సిటీ టాప్ అని.. కాలేజీలో ఒక అబ్బాయికి, ఒక అమ్మాయి పడిపోవడానికి అంతకన్నా రీజన్ ఏం కావాలి? అర్జున్ రెడ్డిని చూసిన మేధావులకు మాత్రం అది తట్టలేదు. మరి అర్జున్ రెడ్డి విషయంలో అలా విరుచుకుపడిన వాళ్లు గనుక ఈ అజ్ఞాతవాసిని.. చూస్తే నోరు కొట్టుకుంటారేమో! జులాయి సినిమాలో ఒక డైలాగ్ పెట్టాడు త్రివిక్రమ్. మనదేశంలో లాజిక్ ల కన్నా మ్యాజిక్ లే జనాలకు నచ్చుతాయి.. అందుకే మన దగ్గర సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్ అని.

బహుశా త్రివిక్రమ్ కూడా ఆ డైలాగును ఒంటబట్టించుకున్నట్టుగా ఉన్నాడు. అజ్ఞాతవాసి సినిమాలో లాజిక్ కు అందని.. మానవ మాత్రుడికి అర్థంకాని.. బ్రహ్మపదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటిని ప్రస్తావిస్తే.. లవ్ స్టోరీలు.. అర్జున్ రెడ్డికి అమ్మాయి పడితేనే అంత ఆశ్చర్యపోయారే.. ఈ అజ్ఞాతవాసికి అమ్మాయిలు పడిపోయే వైనాన్ని చూస్తే.. అసలు ప్రేమ అనే మాటంటేనే చిరాకు పుట్టకమానదు. తన బాయ్ ఫ్రెండ్ ముద్దు సరిగా పెట్టలేదని.. ఒక హీరోయిన్ మగాళ్ల బాత్రూమ్ లో కూర్చుని సిగరెట్లు పీకుతోంటుంది (నిజంగా హీరోయిన్ ఎంట్రీ ఇలానే ఉంటుంది).

ఆ సిగరెట్ వాసనకు హీరో టాయ్ లెట్ క్యాబిన్ డోర్ తెరిచి చూస్తాడు! (సిగరెట్ స్మెల్ వస్తోందని టాయ్ లెట్ క్యాబిన్ డోర్ తెరిచి చూస్తారా ఎవరైనా?) ఇంత బ్రహ్మాండమైన ఇంట్రడక్షన్ ను ఎక్కడా చూసి ఉండరు కదా! అలా అతడిని చూడగానే.. ఆమె తన బాధనంతా ఆ బాత్రూమ్ లోనే చెప్పుకుంటుంది. హీరోకి పడిపోతుంది. కానీ.. త్రివిక్రమ్ లాంటి మేధావికి తట్టని అంశాలు ఇక్కడ చెప్పుకోవాలి. నిజానికి అదెంత కార్పొరేట్ ఆఫీస్ అయినా.. ఆడ, మగలకు ఒకే బాత్రూమ్ ఉండదు. సపరేట్ బాత్రూమ్ లు ఉంటాయి.

ఇక బయటకు అంత పోష్ గా కనిపించే అలాంటి కార్పొరేట్ ఆఫీసు బాత్రూమ్ లో సిగరెట్ తాగితే.. సైరన్లు మోగి బద్ధలవుతాయి. నయా కార్పొరేట్ ఆఫీసుల్లో స్మోకింగ్ జోన్ అంటూ ఒకటి పెడతారు. అక్కడ మాత్రమే సిగరెట్ తాగాలి. ఇంకెక్కడ తాగినా సైరన్లే! ఒక ప్రేమ సన్నివేశం రాయడానికి త్రివిక్రమ్ కు బాత్రూము, సిగరెట్ కు మించిన ఐడియా రాలేదేమో పాపం. దీనివెనుక ‘ఇన్‌స్పిరేషన్’ ఏమిటో! ఇక కీర్తీసురేష్ తో అజ్ఞాతవాసి ప్రేమకథ అయితే నభూతో నభవిష్యతి.

దాన్ని వర్ణించడానికి, దాంట్లోని లాజిక్ లెస్ ను చెప్పడానికి మానవమాత్రుల తరంకాదు.. దానికి మరో త్రివిక్రమ్ కావాలి! సినిమాలో హీరోయిన్లకి హీరోపై ఉన్నది లవ్ కన్నా.. లస్ట్ అంటే కరెక్టేమో! ఇక గతి తప్పిన ఈ చిత్రంలోనే మరో ప్రముఖమైన అంశం ఏదంటే.. సంపత్ రాజ్ క్యారెక్టర్. అజ్ఞాతవాసి ఫ్లాష్ బ్యాక్ ను అతడు చెబుతాడు. ఎవరు అతడు? అంటే.. ఎవరో పోలీసాఫీసర్. దేని ఆధారంగా ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు అంటే? ఫోటోలు చూసి! ఆశ్చర్యపోవద్దు.. ఇది నిజం.

ఎదురుగా అతికించిన ఫోటోలు ఉంటాయి. వాటిని చూస్తూ.. ఎరుకలసాని సోది చెప్పినట్టుగా జరిగిందంతా చెబుతాడు. పవన్ తండ్రి పాత్ర.. ఎక్కడో వ్యాపారం చేస్తే అక్కడ ఏం జరిగింది? అతడి స్నేహితుడు పన్నిన కుట్ర ఏంటి? పవన్ తల్లి ఎవరు? ఆమె ఎలా చచ్చిపోయింది? ఆమెను ఎవరు చంపారు? భార్య విషయంలో అజ్ఞాతవాసి తండ్రి ప్లాన్ బీ ఏమిటి? ఇలా ప్రతీదీ అతడు చెప్పేస్తాడు. అతడు చెప్పేదానికి ఆధారం ఏమిటి? అంటే.. ఏమీలేదు. ఫోటోలు! ఫొటోలు చూసి అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పగలిగే పోలీసాఫీసర్ క్యారెక్టర్ ను క్రియేట్ చేసిన త్రివిక్రమ్ గొప్పదనాన్ని మెచ్చుకోక తప్పదు.

మేం ఏం రాసినా జనాలు చూస్తారు.. ఏం తీసి వదిలినా.. కలెక్షన్లు వస్తాయి.. అనే భ్రమలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు ఈ దర్శకరచయిత. ఇతడి గత సినిమా ‘అ ఆ’ దగ్గరే దెబ్బపడాల్సింది. మీనాను ఆధారంగా చేసుకుని అతుకుల బొంతలా అల్లినా అప్పుడేదో వర్కవుట్ అయ్యింది. ‘అ ఆ’ లోనే క్లైమాక్స్ కు ముందు వచ్చే ఫైట్ ఎందుకు వస్తుందో? అదెందుకు ముగుస్తుందో ఎవ్వరికీ అర్థంకాదు. అప్పుడు త్రుటిలో మిస్ అయ్యింది.. ఇప్పుడు మొత్తానికి దెబ్బపడింది.