మా ఎన్నికల వ్యవహారం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ముందుగా ప్రకాష్ రాజ్ తన సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆ తరువాత నాగబాబు అదే పని చేసారు. వ్యవహారం అక్కడితో ఆగలేదు.
మంచి మెజారిటీతో గెలిచినా కూడా పట్టించుకోకుండా, తమ ప్యానల్ లో గెలిచిన వారందరినీ రాజీనామా చేయించారు. దీనికి ఆయన లాజిక్ లు ఆయనకు వున్నా, సరికాదు అనే విమర్ళలకు దారి తీసింది. గెలుపు ఓటములను సహృదయంతో, క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలి కానీ ఇలా చేయకూడదని కామెంట్ లు వినిపించాయి.
వ్యవహారం అక్కడితో సద్దుమణుగుతుంది అనుకున్నారంతా. ఎందుకంటే తాము రాజీనామా చేసి, కామన్ సభ్యులుగా వుంటూ విష్ణు కు సహకరిస్తామని ఆనాడు అన్నారు. కానీ గట్టిగా రోజు మారకుండానే ఎన్నికల వేళ రికార్డు చేసిన సిసి ఫుటేజ్ ఇవ్వమంటూ ఎన్నికల నిర్వహకులకు లేఖ రాసారు. ఎన్నికలు సజావుగా జరగలేదని, భయానిక వాతావరణంలో జరిగాయని, ఇంకా చాలా కారణాలు చెబుతూ, ఈ ఫుటేజ్ కోసం లేఖ రాసారు.
కోర్టుకు సబ్ మిట్ చేయడం కోసమే ఈ ఫుటేజ్ ను అడినట్లు వార్తలు ఆ వెంటనే వ్యాపించాయి. ఇలాంటి నేపథ్యంలో లీడింగ్ లాయర్ నిరంజన్ రెడ్డి ద్వారా ప్రకాష్ రాజ్ కేసు వేయబోతున్నారని వార్తలు వినవస్తున్నాయి. నిరంజన్ రెడ్డి ఇటు నాగార్జునకు, అటు దిల్ రాజు, పివిపి, చిరంజీవి లకు అత్యంత సన్నిహితుడు. ఆచార్య సినిమా నిర్మాత కూడా ఆయనే. పైగా ఆంధ్ర సిఎమ్ జగన్ కేసులు వాదించేది కూడా ఆయనే.
అలాంటి లాయర్ తోనే ప్రకాష్ రాజ్ కేసు కనుక వేయిస్తే భలే గమ్మత్తుగా వుంటుంది. వెంటనే ఈ వ్యవహారం వెనుక మెగాస్టార్ వున్నారనే గ్యాసిప్ లు ప్రారంభం అవుతాయి. సోమవారం ఏ సంగతి తెలిసే అవకాశం వుంది.