Advertisement


Home > Movies - Movie News
మా నాన్న మంచోడు: పూరి పవిత్ర

''మా నాన్న చాలా మంచోడు. డ్రగ్స్‌తో మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదు. ఎవరిపైన అయినా ఆధారాల్లేకుండా ఆరోపణలు చేసేముందు, ఆ ఆరోపణల కారణంగా ఆ వ్యక్తి కుటుంబం ఎంత బాధపడుతుందో ఆలోచించండి. మీకూ ఓ కుటుంబం ఉంటుంది కదా.. మీ మీద అసత్య ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులకెలా ఉంటుంది.?'' అంటూ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ కుమార్తె పవిత్ర, సోషల్‌ మీడియా వేదికగా తన తండ్రిపై వస్తున్న డ్రగ్స్‌ ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేసింది. 

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలకు సంబంధించి 'సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌'గా నిలుస్తున్న పేరు పూరి జగన్నాథ్‌దే. పూరి, ఆయన సన్నిహితురాలు, సినీ నటి ఛార్మి, అలాగే పూరి జగన్నాథ్‌కి అత్యంత సన్నిహితుడైన మాస్‌ మహరాజ్‌ రవితేజ, ఇంకోపక్క పూరికి మరో సన్నిహితుడు సుబ్బరాజుపైనా డ్రగ్స్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే పూరి సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌ అవుతున్నాడు ఈ డ్రగ్స్‌ కేసులో. 

తనకు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నోటీసులు అందాయని సుబ్బరాజు ప్రకటించాడు. రవితేజ ఇంకా స్పందించలేదు. ఛార్మి అయితే, సోషల్‌ మీడియాలో ఓ 'కోట్‌' పేర్కొంది తప్ప, ఆ కేసుపై స్పందించలేదు. పూరి జగన్నాథ్‌ 'ఖాళీ లేదు, బిజీగా వున్నాను..' అంటున్నాడు. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇంతవరకు తెలంగాణ ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల పేర్లు వెల్లడించలేదు.. జస్ట్‌ కొందరికి నోటీసులు పంపిందంతే. 

మామూలుగా అయితే నోటీసులు చిన్న విషయం కాదు. కానీ, 'నోటీసులు అందుకోవడం నేరం కాదు..' అంటూ సమస్య తీవ్రతను తగ్గించేందుకు కొందరు సినీ ప్రముఖుల ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్‌ కేసు విషయమై సీరియస్‌గా వున్నామంటోంది తెలంగాణ ప్రభుత్వం. కొందరు డ్రగ్స్‌ బాధితులు, సరఫరాదారులు టాలీవుడ్‌లో వుండొచ్చని సాక్షాత్తూ 'మా' తరఫున కొందరు సినీ ప్రముఖులే స్పందించిన పరిస్థితి. పూరి జగన్నాథ్‌ సహా, ఎవరెవరికి ఈ డ్రగ్స్‌ కేసులో సంబంధాలున్నాయో, వుంటే అవెలాంటి సంబంధాలో రానున్న రోజుల్లో తేలనుంది.