Advertisement


Home > Movies - Movie News
శ్రీదేవి లేదు.. తర్వాత స్థానం ఆమెదే!

అతిలోకసుందరి శ్రీదేవి హఠాన్మరణం అందర్నీ షాక్ కు గురిచేసింది. రీఎంట్రీ తర్వాత లీడ్ రోల్ లో కేవలం 2 సినిమాలు మాత్రమే చేసిన శ్రీదేవి, ఇకపై సినిమాల విషయంలో స్పీడ్ పెంచాలనుకున్నారు. పెద్ద కూతుర్ని హీరోయిన్ గా పరిచయం చేస్తూనే ఏడాదికి 2 సినిమాల్లో నటించాలని ఆశపడ్డారు. తర్వాత నెమ్మదిగా కూతురుతో కలిసి కూడా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పెద్దకూతురు జాన్వితో కలిసి శ్రీదేవి వెండితెరపై మెరిసేది. కానీ ఇంతలోనే ఆమె కన్నుమూసింది.

అలా శ్రీదేవి దూరమవ్వడంతో ఇప్పుడు ఆమెకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ మాధురీ దీక్షిత్ వైపు వెళ్తున్నాయి. తాము అనుకున్న పాత్రల్ని పోషించడానికి శ్రీదేవి ఎలాగూలేదు, ఆమె స్థానాన్ని భర్తీచేయలేకపోయినప్పటికీ.. కనీసం మాధురీ దీక్షిత్ తో ఆమెకోసం అనుకున్న కథల్ని పూర్తిచేస్తామంటున్నారు పలువురు బాలీవుడ్ దర్శకులు. ఇందులో భాగంగా శ్రీదేవి కోసం రాసుకున్న ఓ కథతో మాధురి దీక్షిత్ ను కలిశాడు దర్శకుడు అభిషేక్ వర్మ. 

గతంలో 2-స్టేట్స్ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన ఈ దర్శకుడు.. షిద్దాత్ అనే టైటిల్ తో శ్రీదేవి కోసం ఓ స్టోరీ రాసుకున్నాడు. ఇందులో నటించడానికి శ్రీదేవి అంగీకరించింది కూడా. త్వరలోనే అధికారికంగా ప్రకటిద్దామనుకునే టైమ్ కు శ్రీదేవి మరణించింది. ఇప్పుడామె స్థానంలో నటించడానికి మాధురీ దీక్షిత్ అంగీకరించింది. 

షిద్దాత్ లో నటించడానికి మాధురి ఒప్పుకోవడంతో శ్రీదేవి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు. శ్రీదేవి హృదయానికి ఎంతో దగ్గరైన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు మాధురికి థ్యాంక్స్ అంటూ జాన్వి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. శ్రీదేవి కోసం అనుకున్న మరో 2 ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మాధురి చెంతకు చేరాయి. త్వరలోనే వాటిపై కూడా అధికారిక ప్రకటనలు వస్తాయి.