cloudfront

Advertisement


Home > Movies - Movie News

'మహానటి'పై తమిళులు ఏమంటున్నారు?

'మహానటి'పై తమిళులు ఏమంటున్నారు?

తెలుగులో అయితే ఏకగ్రీవంగా ప్రేక్షకుల, విమర్శకుల ఆమోదం పొందింది 'మహానటి' సినిమా. గొప్ప రేటింగులు, మాటలు చాలవనే ప్రశంసలు లభించాయి ఈ సినిమాకు. సావిత్రి జీవిత కథను కళాఖండంగా చిత్రీకరించడంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ వందశాతం విజయవంతం అయ్యాడనే ప్రశంసలు అందుతున్నాయి. సినిమా అద్భుతమని అనేకమంది ఫేస్‌బుక్‌లో తమ భావాలను పంచుకుంటున్నారు. ఈ సినిమా గురించి గొప్పగొప్పగా రాస్తున్నారు.

సెల్ఫ్‌బ్రాడ్‌ కాస్టింగ్‌ మీడియా అయిన సోషల్‌ మీడియాలో జనాలు ఈ సినిమాను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం మంచి పబ్లిసిటీగా మారుతోంది. మౌత్‌ టాక్‌కు ధీటుగా సోషల్‌ మీడియా టాక్‌ కూడా 'మహానటి'కి మంచి చేస్తోంది. సినిమా బాగుంది, అద్భుతంగా ఉందనే మాట సోషల్‌ మీడియా ద్వారా పాస్‌ అవుతోంది. ఇదంతా తెలుగువాళ్లు రియాక్షన్‌. సావిత్రి తెలుగు వ్యక్తి, తెలుగులో వందల సినిమాల్లో నటించిన శక్తి. తెలుగు సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా వచ్చే ప్రస్తావనల్లో సావిత్రి కూడా ఒకరు.

కాబట్టి ఆమె గురించి బయోపిక్‌ తెలుగు వాళ్లలో ఈ స్థాయిలో చర్చనీయాంశంగా నిలిచింది. అలాగే సావిత్రి కేవలం తెలుగు సినిమాకు సంబంధించిన వ్యక్తే కాదు. తమిళ సినిమాకు సంబంధించిన వ్యక్తి కూడా. సావిత్రి తెలుగింటి బిడ్డ అయితే, తమిళింటి కోడలు. తెలుగులో వందల సినిమాల్లో నటించిన ఆమె తమిళంలోనూ వంద సినిమాలకు పైనే నటించింది! తెలుగులో సూపర్‌ స్టార్‌ హీరోల సరసన నటించిన ఆమె తమిళంలోనూ అదేస్థాయి హీరోల సరసన నటించింది.

తెలుగులో క్లాసిక్‌ సినిమాల్లో కనిపించిన ఆమె తమిళంలోనూ క్లాసిక్స్‌ను తన ఖాతాలో కలిగి ఉన్నారు. ఈ రకంగా సావిత్రి బయోపిక్‌ తెలుగులో ఎంత ఆసక్తిని రేపిందో తమిళంలో కూడా దాదాపు అదేస్థాయి ఆసక్తిని రేపింది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ రూపొందించి విడుదల చేశారు. తమిళంలో 'నడిగైయర్‌ తిలగం' పేరుతో 'మహానటి' విడుదల అయ్యింది. సమాన అర్థాలు అయిన పేర్లతో రెండు వెర్షన్లూ విడుదల అయ్యాయి.

ఈ నేపథ్యంలో తమిళంలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది? ఈ సినిమాను తమిళులు ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? అంటే.. వాళ్లు కొంత నిరాశపడ్డారు! ఎందుకంటే.. సినిమాలో లెస్‌ తమిళ్‌, మోర్‌ తెలుగు.. అనిపించింది వాళ్లకు. కొంతమంది రివ్యూయర్లు ఇదే విషయాన్ని పేర్కొన్నారు. సావిత్రి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తికాదు. ఆమె తమిళంలోనూ రమారమీ వంద సినిమాల్లో నటించారు. అనేక క్లాసిక్స్‌లో ఆమె హీరోయిన్‌గా నటించారు.

శివాజీ గణేషన్‌తో దాదాపు ఇరవై సినిమాల్లో నటించారామె. వాటిల్లో 'పాశమలార్‌' వంటి క్లాసిక్స్‌ ఉన్నాయి. పాశమలార్‌నే తెలుగులో రక్తసంబంధంగా రూపొందించారు. నవరాత్రి సినిమాలో శివాజీ గణేషన్‌ తొమ్మిది పాత్రల్లో కనిపిస్తారు. అందులో సావిత్రి హీరోయిన్‌. ఇలా మొదలుపెడితే తమిళ కెరీర్‌లో సావిత్రి గురించి చెప్పుకోదగిన సినిమాలెన్నో ఉన్నాయి. అలాంటి వాటి ప్రస్తాన తక్కువైంది.. ఎక్కువగా తెలుగు సినిమాల ప్రస్తావనే ఉండటంతో ఈ సినిమాను చూసి తాము కొంత నిరాశకు గురయ్యామని తమిళ రివ్యూయర్లు పేర్కొన్నారు.

అన్ని రకాలుగానూ ఓకేకానీ, తమిళ సినిమాల ప్రస్తావన తక్కువ అనేది తమిళుల కంప్లైంట్‌! ఇక ఈ సినిమాను వీక్షించిన జెమినీ గణేషన్‌ కుటుంబీకులు మాత్రం కొంత పెదవి విరుస్తున్నారు. తమ తండ్రిని విలన్‌గా చూపారని జెమిని కూతుళ్లు అంటున్నారు. సావిత్రితో మునుపే జెమినీకి వేరే అతివలతో వివాహం అయిన సంగతి తెలిసిందే. వారి పిల్లలు ఈ సినిమా పట్ల పెదవి విరుస్తున్నారు. జెమిని ఫస్ట్‌లవ్‌ సావిత్రి అనే విషయాన్ని కూడా వారు ఖండిస్తున్నారు.

సావిత్రికి మునుపే ఆయన వేరే పెళ్లిళ్లు చేసుకున్నారనే విషయాన్ని గుర్తించాలంటున్నారు. అలాంటిప్పుడు జెమిని మొదట ప్రేమించింది సావిత్రినే అని ఎలా చూపిస్తారు? అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే సావిత్రికి మద్యం అలవాటు చేసింది కూడా జెమినినే అని చూపడాన్ని కూడా వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రాప్తం అనే సినిమా నిర్మాణం జోలికి వెళ్లవద్దని జెమిని వారించాడని, అయితే సావిత్రి వినలేదని జెమిని కూతుర్లు అంటున్నారు.

వారించడానికి వెళ్లిన జెమినిపై సావిత్రి ఇంటివద్ద కుక్కలను వదిలారని.. దీంతో ఆయన మళ్లీ ఆమె ఇంటికి వెళ్లలేదని జెమిని గణేషన్‌ మొదటిభార్య కూతురు ఒకామె వ్యాఖ్యానించారు.