cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహానాయకుడు: అక్కడ విలన్.. ఇక్కడ హీరో!

మహానాయకుడు: అక్కడ విలన్.. ఇక్కడ హీరో!

వెన్నుపోటు.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వెన్నుపోటు ఎపిసోడ్ నే హైలెట్ గా చూపించానంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 మహానాయకుడు లో కూడా వెన్నుపోటునే ప్రధానాంశంగా తీసుకున్నారు. కాకపోతే వర్మ సినిమాలో చంద్రబాబు పోటు పొడిస్తే, క్రిష్ మూవీలో ఆ రోల్ నాదెండ్ల భాస్కర్ రావుకి ఇచ్చారు.

వర్మ సినిమాలో చంద్రబాబు విలన్ అయితే, బాలయ్య సినిమాలో బాబే హీరో. ప్రజాస్వామ్య పరిరక్షకుడిలా ఎన్టీఆర్ కి అండదండగా, నాదెండ్ల కుట్రని ఛేదించే హీరోగా చంద్రబాబు క్యారెక్టర్ ని ఎలివేట్ చేశారు.

బయోపిక్ మొదటి పార్ట్ దారుణంగా పరాజయంపాలవడం, అటు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ రామ్ గోపాల్ వర్మ హడావిడి చేయడంతో మహానాయకుడు ట్రైలర్ లో మార్పులు చేర్పులు జరిగాయి. అందులో భాగంగానే ట్రైలర్ మొత్తం నాదెండ్ల క్యారెక్టర్ చుట్టూ తిరిగింది.

నాదెండ్ల భాస్కర్ రావు పాత్రని సచిన్ ఖేడ్ ఖర్ పోషించారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని ఎన్టీఆర్ కి మంచి చెబుతూ ఒక వ్యూహం ప్రకారం ఆయన సీటుకి ఎసరు పెట్టిన విధానాన్ని తెరకెక్కించారు.

ఇందిరాగాంధీ పాత్రను చూపించినా ప్రస్తుతం కాంగ్రెస్ తో టీడీపీకి ఉన్న సత్సంబంధాల వల్ల, నాదెండ్లనే పూర్తిస్థాయి విలన్ గా పరిచయం చేశారు. ఈ వెన్నుపోటు ఎపిసోడ్ లో ఎన్టీఆర్ కి అండగా నిలబడి, టీడీపీని కాపాడిన హీరో రోల్ చంద్రబాబుకి అప్పగించారు. మరోవైపు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు క్యారెక్టర్ ని డమ్మీగా మార్చేశారు.

హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ అలా కనిపిస్తాడే కానీ ట్రైలర్ లో డైలాగుల్లేవు. నాదెండ్ల ఎపిసోడ్ మినహా ట్రైలలో ఇంకేం కనిపించలేదు. చంద్రబాబు నాయుడు ఎలా కోరుకున్నాడో సినిమా అలాగే ఉండబోతోంది. దానికి ఈ ట్రైలరే నిదర్శనం.

అయితే ముందే హెచ్చరించినట్టు నాదెండ్ల మాత్రం న్యాయపోరాటానికి దిగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.