Advertisement

Advertisement


Home > Movies - Movie News

మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి కొడుకు ఇన్నాళ్ల‌కు!

మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి కొడుకు ఇన్నాళ్ల‌కు!

మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి, అల్లు అర్జున్ హీరోగా న‌టించిన బ‌న్నీ సినిమాకు నిర్మాత‌గా బాగా వినిపించిన పేరు. బ‌న్నీ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో మ‌ల్లిడి కూడా పాల్గొనే వారు. ఆ త‌ర్వాత మంచు విష్ణుతో ఢీ సినిమాను అనౌన్స్ చేశాడు. కానీ.. ఆ సినిమా విడుద‌ల విష‌యంలో చాలా ఇబ్బందులే ప‌డ్డ‌ట్టుగా అప్ప‌ట్లోనే వార్త‌లు వ‌చ్చేవి. వాస్త‌వానికి ఢీ సినిమా ముందుగా అనుకున్న విడుద‌ల స‌మ‌యానికి ఆ త‌ర్వాత ఏడాది విడుద‌లైన‌ట్టుగా ఉంది! 

ఇండ‌స్ట్రీలో ఢీ సినిమా ట్రెండ్ ను అయితే సెట్ చేసింది కానీ, విడుద‌ల‌కు మాత్రం బాగా ఇబ్బందులను ఎదుర్కొంది. ఒక ద‌శ‌లో మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి ఆ సినిమాను వ‌దిలించుకున్నార‌నే మాటా వినిపించేది. చివ‌ర‌కు నిర్మాత‌గా ఆయ‌న పేరుతోనే అది విడుద‌ల అయ్యింది.

ఢీ సినిమాకు ముందే మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి త‌న త‌న‌యుడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఒక చిన్న సైజు సినిమాను రూపొందించారు. దాని పేరు * ప్రేమ‌లేఖ రాశా..* ఈ సినిమాలో మ‌ల్లిడి వేణు హీరోగా న‌టించాడు. మ‌రో విశేషం ఏమిటంటే.. ఇందులో హీరోయిన్ అంజ‌లి. అప్ప‌టికే ఫొటో వంటి సినిమాలో న‌టించిందామె. 

ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు పాట‌ల‌, మాట‌ల ర‌చ‌యిత కుల‌శేఖ‌ర్. ఇప్పుడెక్క‌డున్నాడో పాపం! తేజా సినిమాలతో కుల‌శేఖ‌ర్ కు గుర్తింపు ల‌భించింది. అదే ఊపులో ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ఆ ర‌చ‌యిత‌. ఇందులో మ‌ల్లిడి వేణు న‌ట‌న గురించి కూడా చెప్పుకోవాలి! అచ్చం ర‌వితేజ‌ను అనుక‌రిస్తూ ఈ సినిమాలో న‌టించాడు వేణు.  డైలాగ్ డెలివ‌రీ అయితే.. ర‌వితేజ‌ను ఇమిటేట్ చేయ‌డానికి అష్ట‌క‌ష్టాలు ప‌డ్డ‌ట్టుగా ఉంటుంది! ఇక ఇదే సినిమా సమ‌యంలో.. అంజ‌లి ప్రేమ‌లో ప‌డ్డాడు కుల శేఖ‌ర్ అనే టాక్ ఉండేది. ఈ సినిమా వీరెవ్వ‌రికీ త‌గిన గుర్తింపును అయితే ఇవ్వ‌లేదు.

త‌మిళ సినిమాల‌తో అంజ‌లికి కాలం క‌లిసొచ్చింది. కుల‌శేఖ‌ర్ ఏమో దేవాల‌యాల్లో దొంగ‌త‌నాల‌ను హాబీగా మార్చుకుని అరెస్టు అయ్యి వార్త‌ల్లో నిలిచాడు. ఢీ సినిమా త‌ర్వాత మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ రెడ్డి కూడా నిర్మాత‌గా చెప్పుకోదగిన సినిమాలూ చేయ‌లేదు. ఇప్పుడు మ‌ల్లిడి వేణు వేరే పేరుతో ద‌ర్శ‌క‌త్వం తో మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చాడు. బింబిసారా సినిమా ద‌ర్శ‌కుడే ఆ మ‌ల్లిడి వేణు, ఇప్పుడు వ‌శిష్ట్.

మొత్తానికి తండ్రి నిర్మాత కాబ‌ట్టి, కొడుకు హీరోగా ప్ర‌య‌త్నించి, భంగ‌ప‌డ‌టం అనే లైన్ తో త‌న క‌థ‌ను ముగించ‌కుండా, సినిమాపై త‌న‌కున్న ప్యాష‌న్ తో మ‌ల్లిడి వేణు అలియాస్ వ‌శిష్ట్ ఇన్నేళ్ల‌కు మ‌రో ప్ర‌య‌త్నంతో తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?