శ్రీనువైట్ల మంచి దర్శకుడు. ఒకప్పుడు టాప్ పొజిషన్ కు చేరుకున్నవాడు. కానీ ఆ తరువాత సరైన కథ, కథనాలు మిస్ చేసుకుని ఎక్కడో కిందకు జారిపోయాడు.
సెకెండ్ చాన్స్ అంటూ రెండు అవకాశాలు వచ్చినా మిస్ ఫైర్ చేసకున్నాడు. మినిమమ్ క్వాలిటీ కూడా అందించలేకపోయాడు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ మరొసారి శ్రీను వైట్ల మెగాఫోన్ పట్టబోతున్నట్లు వినిపిస్తోంది.
గోపీ మోహన్ రాసిన ఓ కథను పట్టుకుని నిర్మాతలు, హీరోలను ఒప్పించే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత దానయ్య ఏదైనా ప్రాజెక్టు చేయాలని చూస్తున్నారు. హీరో గోపీచంద్ డేట్ లు ఆయన దగ్గర వున్నాయి. అందుకే ఇప్పుడు అట్నుంచి నరుక్కు వస్తున్నట్లు తెలుస్తోంది. గోపీమోహన్ చేసిన కథను గోపీచంద్ కు చెప్పి ఒప్పించి, దానయ్య నిర్మాణంలో సినిమా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతానికి గోపీచంద్ ను కథతో దాదాపు ఒప్పించారని తెలుస్తోంది. కథ ఫైన్ ట్యూన్ చేయడం వంటి పనులు పూర్తయితే సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం వుంది. ప్రస్తుతం గోపీచంద్ చేతిలో కూడా రెండు మూడు సినిమాలు వున్నాయి. వాటి సంగతి, ఆ లైనప్ కూడా చూడాలి. శ్రీనువైట్ల సినిమా స్టార్ట్ చేయాలని చిరకాలంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే గోపీ మోహన్ కూడా. ఇప్పుడైనా సాధ్యమవుతుందేమో చూడాలి.